రైలు ఎక్కేందుకు భౌతిక దూరం పాటిస్తూ నిల్చున్న వలస కార్మికులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస కార్మికుల తరలింపు ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు తీవ్ర ఆందోళనలో ఉన్న కార్మికులు వద్దంటున్నా వినకుండా నడక సాగిస్తూ ఇబ్బంది పడుతుండగా, మరోవైపు దరఖాస్తు చేసుకున్న వారిని ప్రత్యేక శ్రామిక్ రైళ్ల ద్వారా ప్రభుత్వం సొంత ప్రాంతాలకు తరలిస్తోంది. మే ఒకటి నుంచి ఈ ప్రత్యేక రైళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశంలో తొలి శ్రామిక్ రైలు హైదరాబాద్ నుంచే బయలుదేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే 93 శ్రామిక్ రైళ్లను నడిపి 1,18,229 మంది వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించింది. ఇందులో తెలంగాణ నుంచి 54 రైళ్ల ద్వారా 69,299 మందిని, ఆంధ్రప్రదేశ్ నుంచి 28 రైళ్ల ద్వారా 34,489 మందిని, మహారాష్ట్ర నుంచి 11 రైళ్ల ద్వారా 14,441 మందిని గమ్యం చేర్చింది.
అన్ని జాగ్రత్తలతో...
ప్రయాణికుల మధ్య భౌతిక దూరం, మాస్కులు ధరించటం లాంటి వాటితోపాటు రైళ్లను శానిటైజ్ చేయటం, బోగీల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచటం, ప్రయాణికులకు భోజనం, మంచి నీటిని అందించటం తదితర జాగ్రత్తలను రైల్వే తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో, అటు రైల్వే బోర్డుతో అనుసంధానించుకుంటూ త్వరితగతిన ఏర్పాట్లు చేయటం విశేషం. ఇంకా ఎంతమంది వలస కార్మికులు వచ్చినా రైళ్లు నడిపేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment