పొలం అమ్మినా.. వలస వెళ్లొచ్చినా! తీరని అప్పులు
ఆ దంపతులు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్న ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు.. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో ఆశించిన దిగుబడి రాలేదు.. చేసిన అప్పులు తీర్చేందుకు కొంత పొలం అమ్ముకుని నగరానికి వలస వెళ్లొచ్చి ఆశ చావక తిరిగి పంటలు సాగుచేసినా ఫలితం దక్కలేదు.. దీంతో వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా భార్య మృత్యువాతపడగా, భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరయ్యారు.. ఈ సంఘటన గ్రామస్తులను కలచివేసింది..
నాగర్‌కర్నూల్ రూరల్ :
మండలంలోని పుల్జాలకు చెం దిన గోరింట్ల శ్రీశైల (30), సాంబయ్య (40) దంపతులకు శివారులో మూడున్నర ఎకరాల పొలం ఉంది. అందులో ఎన్నో ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్నారు. దీనికోసం ఏటేటా అప్పులు తెస్తున్నారు.. అయినా పరిస్థితులు అనుకూలించలేదు. వీటిని తీర్చేందుకు రెండేళ్లక్రితం ఎకరాన్నర అమ్మినా సరిపోక హైదబాద్‌కు వలస వెళ్లారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ ఉన్న ఇద్దరు పిల్లలను ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించి చదివిస్తున్నారు.
పెద్ద కుమారుడు ఏడో తరగతి, రెండో కుమారుడు ఆరో తరగతి చదువుతున్నారు. గత ఏడాది వ్యవసాయం చేసుకునేందుకు భార్యాభర్తలు తిరిగి స్వగ్రామానికి వచ్చారు. సుమారు *లక్షన్నర అప్పు తెచ్చి పత్తి వేశారు. వర్షాభావ పరిస్థితులతో నష్టం వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ వ్యవసాయానికి, తమ పిల్లల చదువుకు మరో *రెండు లక్షలు అప్పు చేశారు. అయినా పంట పూర్తిగా దెబ్బతినడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం పొద్దుపోయాక పొలం నుంచి ఇంటికి వచ్చిన దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
పక్కనే ఉన్న సాంబయ్య అన్న వెంకటయ్య గమనించి వెంటనే 108 వాహనంలో నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే శ్రీశైల మృతి చెందింది. సాంబయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ గ్రామానికి వెళ్లి కేసు దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరయ్యారు