dormitory
-
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
భక్త మహాశయులకు...
అన్నవరం: ఆధ్యాత్మిక చింతనతో.. మది నిండా భక్తిభావంతో.. ఆ స్వామివారిని స్మరిస్తూ రత్నగిరికి కాలినడక వచ్చే భక్త మహాశయులకు సౌకర్యాలు ఒనగూరుతున్నాయి.. మెట్ల మార్గం నుంచి అలసి సొలసి వచ్చేవారి కోసం విశ్రాంతి భవనం (డార్మెట్రీ) సకల హంగులతో రూపుదిద్దుకుంటోంది.. రత్నగిరిపై వనదుర్గ ఆలయం ఎదురుగా రూ.రెండు కోట్లతో దాత పెన్నాడ వెంకట రాజామణి సారథ్యంలో భక్తుల విశ్రాంతి భవన నిర్మాణం జరుగుతోంది. ఇది ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి కానుంది. గత ఏడాది ఆగస్టులో పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఆగస్టు నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తి చేసి డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించాలని దాత నిర్ణయించారు. డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ చంద్రశేఖర్ అజాద్ వివరించారు. అలా పునాది పడి.. రత్నగిరి సత్యదేవుని దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇందులో చాలామంది మెట్ల దారి నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి వారికోసం డార్మెట్రీ నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. బాత్రూమ్లలో స్నానం చేసి, తమ వస్తువులను అక్కడే లాకర్లలో భద్రపర్చుకునేందుకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ భవనం చేపట్టాలని భావించారు. ఈ సమయంలోనే రాజమహేంద్రవరానికి చెందిన దాత పెన్నాడ వెంకట రాజామణి డార్మెట్రీ నిర్మించడానికి ముందుకు వచ్చారు. అప్పటి ఈఓ వి.త్రినాథరావు శ్రీవనదుర్గ ఆలయం వద్ద ఉన్న పాత భవనాన్ని కూల్చి వేసి ఆ స్ధలాన్ని దాతకు అప్పగించారు. ఈ నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ భూమిపూజ చేశారు. వెయ్యి మంది సేదతీరేలా.. మొత్తం 3,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులలో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఏకకాలంలో సుమారు వెయ్యి మంది సేదతీరే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూడు అంతస్తులలోనూ టాయిలెట్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు కొండపై వసతి గదుల కోసం ప్రయత్నించకుండా ఇక్కడే స్నానం చేసి స్వామివారిని దర్శనానికి రావొచ్చని అధికారులు తెలిపారు. ఈ పనులు ప్రారంభించిన మూడు నెలలకే పునాదుల దశ పూర్తి చేయగా, ఏప్రిల్ నెలలోనే మూడు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వెలుపల ప్లాస్టింగ్, టైల్స్ అతికించడం పనులు చేస్తున్నారు. టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్తు సరఫరా పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని నిర్మాణ కాంట్రాక్టర్ అబ్బులు తెలిపారు. -
అమ్మ కోసం....
విజయనగరం , సాలూరు: ఎత్తైన కొండలపై జీవనం.. కఠినమైన ఆచార వ్యవహారాలు... కట్టుబాట్లు.. నడుమ జీవిస్తుండడం గిరిజనుల ప్రత్యేకత. వారుండే గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో సాధారణ జీవనం సైతం దుర్భరమే. అదే గర్భం దాల్చిన మహిళలకైతే నరకప్రాయమే. పౌష్టికాహార లోపం.. రక్తహీనత.. వంటి కారణాలతో ఇళ్ల వద్దే ప్రసవిస్తున్న ఎందరో గర్భిణులు ప్రతిఏటా మృతువాత పడుతున్నారు. అలాగే వైద్యం అందక చిన్నారులు సైతం పురిటిలోనే కన్నుమూస్తున్నారు. పురిటినొప్పులు రాగానే డోలీల సహాయంతో మైదాన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు గర్భిణులను తీసుకురావాల్సిన దుస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇదేవిధంగా డోలీల సాయంతో గర్భిణులను కొండల నుంచి కిందకు దిస్తుండగా గర్భిణులు మృతువాత పడ్డారు. ఈ విషయాలు పత్రికల్లో రావడంతో మానవహక్కుల కమిషన్ సైతం ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. దీంతో పరిస్థితి మార్చాలన్న ఆలోచన నుంచే గిరిశిఖర గ్రామాల గర్భిణులకు ప్రత్యేక వసతిగృహం పుట్టుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 17న సాలూరు పట్టణంలోని గుమడాం రోడ్డులో ఉన్న యువజన శిక్షణ కేంద్రంలో వసతిగృహాన్ని ఐటీడీఏ పీఓ లక్ష్మీశా ఆదేశాల మేరకు తెరిచారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోనే అత్యధిక మంది గిరిజనులు వైద్యం కోసం డోలీలతో కొండలు దిగుతున్న కారణంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల ఏజన్సీ ప్రాంత గిరిజన గర్భిణుల కోసం వసతి గృహాన్ని ప్రారంభించారు. ఎన్నో అడ్డంకులు.. ఇదిలా ఉంటే ప్రత్యేక వసతిగృహం విధానం వల్ల వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా గిరిజనులు ఇంటివద్దే ప్రసవం జరుపుకునేందుకు ఇష్టపడతారు. ఊరుదాటి వెళితే తిరిగి వస్తామో.. రామోనన్న భయంతో ఇంటివద్దే మంత్రసానులు, ఏఎన్ఎంల సాయంతో ప్రసవం జరుపుకుంటారు. ఈ కారణంగా ఎంత నచ్చజెప్పినా గర్భిణులతో పాటు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేయరు. దీంతో వీరికి అవగాహన కల్పించడంతో పాటు వసతిగృహానికి తీసుకువచ్చేందుకు వైద్య, అంగన్వాడీ సిబ్బంది పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. అంతేగాకుండా వసతి గృహానికి వచ్చిన వారిని నెలల తరబడి ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచడం కూడా శ్రమతో కూడిన పనవుతోంది. 31 మందికి ప్రసవాలు.. గత నెల 17న ప్రత్యేక వసతిగృహం ప్రారంభం కాగా ఇంతవరకు 31 ప్రసవాలు జరుపుకున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. మొత్తం 36 మంది వసతిగృహానికి చేరుకోగా 31 మంది ప్రసవించారు. ఇందులో 29 మందివి సాధారణ ప్రసవాలు కావడం విశేషం. ఐటీడీఏ పీఓ ఆలోచన సత్ఫలితాలిస్తోందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమ్మని ఆహారం.., వైద్యసేవలు.. ఏడో నెలలోకి అడుగుపెట్టిన గర్భిణులను అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు గుర్తించి వారిని వసతిగృహానికి తీసుకువస్తారు. నెలలు నిండేంతవరకు కమ్మని భోజనాన్ని అందివ్వడంతో పాటు వైద్యపరీక్షలు సైతం క్రమం తప్పకుండా చేపడతారు. ఇద్దరు ఏఎన్ఎంలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు బీపీ పరీక్షలు చేపడుతుంటారు. అవసరమైనవారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అందిస్తారు. ప్రసవానికి పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తూ తల్లీబిడ్డ ఆరోగ్యంతో పాటు ప్రాణాలకు ఎలాంటి ముప్పులేకుండా చర్యలు తీసుకుని ఇంటికి క్షేమంగా పంపిస్తారు. తనిఖీలు చేస్తున్నారు.. నాకు ఏడో నెల రాగానే వసతిగృహానికి చేరుకున్నాను. భోజనం బాగుంది. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. కుటుంబాన్ని వదిలి ఉండడం బాధాగా ఉన్నప్పటికీ, పండంటి బిడ్డతో ఇంటికి వెళ్తానన్న నమ్మకంతో ఉంటున్నాను. వైద్యం సదుపాయం అందుబాటులో లేని గర్భిణులకు వసతిగృహం నిజంగా ఒక వరమే.– పొర్రజన్ని పార్వతి, గర్భిణి, గుమ్మిడిగుడ, పాచిపెంట మండలం -
శిష్యురాళ్ల హాస్టల్‌కు సొరంగ మార్గం
► రహస్యంగా ఏర్పాటు చేసుకున్న గుర్మీత్ బాబా ► హింసకు ప్రేరేపించిన ఇద్దరు అరెస్టు చండీగఢ్: హరియాణాలోని డేరా సచ్చా సౌదా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన నివాసం నుంచి శిష్యురాళ్ల వసతి గృహం వద్దకు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గం శనివారం వెలుగులోకి వచ్చింది. ఫైబర్ గ్లాస్‌తో నిర్మించిన, బాబా నివాసం నుంచి ఐదు కిలోమీటర్ల పొడవున్న మరో సొరంగాన్ని కూడా అధికారులు గుర్తించారు. పంచకులలో 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ డేరాలో పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాలతో అధికారులు సోదాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్రమ టపాసుల తయారీ కేంద్రం, ఏకే–47 తుపాకీ బుల్లెట్ల ఖాళీ డబ్బాలను అధికారులు గుర్తించారు. 84 డబ్బాల టపాసులు, టపాకాయల తయారీకి వాడే రసాయనాలు తదితరాలను అధికారులు కొనుగొన్నారు. రిజిస్ట్రేషన్ కాని ఓ విలాసవంతమైన కారు, కొన్ని పాత రూ.500, రూ.1,000 నోట్లను కూడా అధికారులు సోదాల్లో గుర్తించారు. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, పేరు ముద్రించని కొన్ని ఔషధాలను స్వాధీనం చేసుకుని కొన్ని గదులను సీజ్ చేశారు. డేరా ప్రధాన కేంద్రానికి వచ్చే రోడ్లపై కర్ఫ్యూ కొనసాగుతోంది. గుర్మీత్‌ను ఆగస్టు 25న సీబీఐ కోర్టు అత్యాచార కేసులో దోషిగా తేల్చింది. గుర్మీత్ మద్దతుదారులను హింసకు పురిగొల్పినందుకుగాను డేరా ఇన్చార్జ్ చామ్‌కౌర్, మరో కీలక డేరా అధికారి దాన్ సింగ్‌లను అరెస్టు చేశామని పంచకుల డీసీపీ చెప్పారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
సామర్లకోట: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా సామర్లకోటలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. సామర్లకోటలోని రజకపేటకు చెందిన ఎమ్.కావమ్మ(23) జయ డార్మటరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూలీ పని చేసి జీవనం సాగించే ఆమె డార్మటరీలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
పొలం అమ్మినా.. వలస వెళ్లొచ్చినా! తీరని అప్పులు
ఆ దంపతులు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్న ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు.. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో ఆశించిన దిగుబడి రాలేదు.. చేసిన అప్పులు తీర్చేందుకు కొంత పొలం అమ్ముకుని నగరానికి వలస వెళ్లొచ్చి ఆశ చావక తిరిగి పంటలు సాగుచేసినా ఫలితం దక్కలేదు.. దీంతో వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా భార్య మృత్యువాతపడగా, భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరయ్యారు.. ఈ సంఘటన గ్రామస్తులను కలచివేసింది.. నాగర్‌కర్నూల్ రూరల్ : మండలంలోని పుల్జాలకు చెం దిన గోరింట్ల శ్రీశైల (30), సాంబయ్య (40) దంపతులకు శివారులో మూడున్నర ఎకరాల పొలం ఉంది. అందులో ఎన్నో ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్నారు. దీనికోసం ఏటేటా అప్పులు తెస్తున్నారు.. అయినా పరిస్థితులు అనుకూలించలేదు. వీటిని తీర్చేందుకు రెండేళ్లక్రితం ఎకరాన్నర అమ్మినా సరిపోక హైదబాద్‌కు వలస వెళ్లారు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ ఉన్న ఇద్దరు పిల్లలను ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ఏడో తరగతి, రెండో కుమారుడు ఆరో తరగతి చదువుతున్నారు. గత ఏడాది వ్యవసాయం చేసుకునేందుకు భార్యాభర్తలు తిరిగి స్వగ్రామానికి వచ్చారు. సుమారు *లక్షన్నర అప్పు తెచ్చి పత్తి వేశారు. వర్షాభావ పరిస్థితులతో నష్టం వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ వ్యవసాయానికి, తమ పిల్లల చదువుకు మరో *రెండు లక్షలు అప్పు చేశారు. అయినా పంట పూర్తిగా దెబ్బతినడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం పొద్దుపోయాక పొలం నుంచి ఇంటికి వచ్చిన దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. పక్కనే ఉన్న సాంబయ్య అన్న వెంకటయ్య గమనించి వెంటనే 108 వాహనంలో నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగానే శ్రీశైల మృతి చెందింది. సాంబయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్ గ్రామానికి వెళ్లి కేసు దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరయ్యారు