అన్నవరం: ఆధ్యాత్మిక చింతనతో.. మది నిండా భక్తిభావంతో.. ఆ స్వామివారిని స్మరిస్తూ రత్నగిరికి కాలినడక వచ్చే భక్త మహాశయులకు సౌకర్యాలు ఒనగూరుతున్నాయి.. మెట్ల మార్గం నుంచి అలసి సొలసి వచ్చేవారి కోసం విశ్రాంతి భవనం (డార్మెట్రీ) సకల హంగులతో రూపుదిద్దుకుంటోంది.. రత్నగిరిపై వనదుర్గ ఆలయం ఎదురుగా రూ.రెండు కోట్లతో దాత పెన్నాడ వెంకట రాజామణి సారథ్యంలో భక్తుల విశ్రాంతి భవన నిర్మాణం జరుగుతోంది.
ఇది ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి కానుంది. గత ఏడాది ఆగస్టులో పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఆగస్టు నెలాఖరుకు మిగిలిన పనులు పూర్తి చేసి డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించాలని దాత నిర్ణయించారు. డార్మెట్రీని దేవస్థానానికి అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ చంద్రశేఖర్ అజాద్ వివరించారు.
అలా పునాది పడి..
రత్నగిరి సత్యదేవుని దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇందులో చాలామంది మెట్ల దారి నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. అలాంటి వారికోసం డార్మెట్రీ నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. బాత్‌రూమ్‌లలో స్నానం చేసి, తమ వస్తువులను అక్కడే లాకర్లలో భద్రపర్చుకునేందుకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈ భవనం చేపట్టాలని భావించారు.
ఈ సమయంలోనే రాజమహేంద్రవరానికి చెందిన దాత పెన్నాడ వెంకట రాజామణి డార్మెట్రీ నిర్మించడానికి ముందుకు వచ్చారు. అప్పటి ఈఓ వి.త్రినాథరావు శ్రీవనదుర్గ ఆలయం వద్ద ఉన్న పాత భవనాన్ని కూల్చి వేసి ఆ స్ధలాన్ని దాతకు అప్పగించారు. ఈ నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ భూమిపూజ చేశారు.
వెయ్యి మంది సేదతీరేలా..
మొత్తం 3,900 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులలో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఏకకాలంలో సుమారు వెయ్యి మంది సేదతీరే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూడు అంతస్తులలోనూ టాయిలెట్లు, స్నానపు గదులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తులు కొండపై వసతి గదుల కోసం ప్రయత్నించకుండా ఇక్కడే స్నానం చేసి స్వామివారిని దర్శనానికి రావొచ్చని అధికారులు తెలిపారు.
ఈ పనులు ప్రారంభించిన మూడు నెలలకే పునాదుల దశ పూర్తి చేయగా, ఏప్రిల్ నెలలోనే మూడు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వెలుపల ప్లాస్టింగ్, టైల్స్ అతికించడం పనులు చేస్తున్నారు. టాయిలెట్ల నిర్మాణం, విద్యుత్తు సరఫరా పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని నిర్మాణ కాంట్రాక్టర్ అబ్బులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment