పాలు కాదు.. పచ్చి విషం | Milk Adulteration mafia in Telangana State | Sakshi
Sakshi News home page

పాలు కాదు.. పచ్చి విషం

Published Tue, Dec 12 2017 1:24 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

Milk Adulteration mafia in Telangana State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పొద్దున్నే ఇంటికి పాల ప్యాకెట్‌ వచ్చింది.. పాలు తెల్లగా, చిక్కగా ఉన్నాయి.. కానీ మరిగిస్తుంటే అదో రకమైన వాసన.. ఎంతసేపైనా మీగడ లేదు.. రంగుకూడా మారలేదు.. తోడుపెడితే పెరుగూ సరిగా కాలేదు.. బంకలాగా అతుక్కుపోతోంది... ఈ మధ్య తరచూ ఇలా జరుగుతోందా? దీనికి కారణం నాణ్యత లేని, రసాయనాలు కలిపిన కల్తీ పాలు.. ఏ ఒక్కరి ఇంట్లోనో, ఒక్క కంపెనీవో కాదు.. ఏకంగా 45%  పాల ప్యాకెట్లు నాణ్యతా ప్రమా ణాల ప్రకారం లేవని, హానికరమైన రసాయ నాలు కలసి ఉన్నాయని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. అంతేకాదు ఇ–కొలీ, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలకూ నిలయంగా మారిపోయాయని ప్రభుత్వ లేబొరేటరీ పరీక్షల్లోనే వెల్లడైంది. ఈ పాలు తాగితే పోషకాల మాటేమోగానీ.. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించి, వ్యాధుల బారినపడటం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ లేబొరేటరీయే తేల్చింది..
మనకు పొద్దున పాలు లేనిదే తెల్లవారదు. పెద్దలకు చాయ్‌ దగ్గరి నుంచి పిల్లలకు ఓ గ్లాసుడు పాల దాకా అత్యవసరం. కానీ డెయిరీ నిర్వాహకుల నిర్లక్ష్యం, కక్కుర్తి కారణంగా ఇప్పుడా పాలే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ విక్రయమవుతున్న వాటిలో దాదాపు 45 శాతం పాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విక్రయిస్తున్న పలు ‡బ్రాండ్ల పాల ప్యాకెట్లను ఇటీవల ‘సాక్షి’బృందం సేకరించి నాచారంలో ఉన్న రాష్ట్ర ఆహార పరీక్షా కేంద్రం (స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ)లో పరీక్షలు చేయించింది. అందులో కొన్ని ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. కొన్ని శాంపిళ్ల పాలలో కొవ్వు వంటి పదార్థాలు నిబంధనల మేరకు లేవని.. ప్రమాదకరమైన ఇ–కోలీ, సాల్మోనెల్లా బ్యాక్టీరియా వంటి వాటి ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. అంతేకాదు యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్, సోడా వంటివి కూడా స్వల్ప మోతాదుల్లో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ‘సాక్షి’బృందం సోమవారం హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్యాకెట్‌ పాల నాణ్యతపై మహిళల అభిప్రాయాలు సేకరించింది. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు చెబుతున్నది ఒకటే! ప్యాకెట్‌ పాలు జిగటగా ఉంటున్నాయని.. మరగబెట్టినప్పుడు అదోరకమైన వాసన వస్తోందని.. సరిగా తోడుకోవడం లేదని.. తోడుకున్నా బంకలాగా అతుక్కుంటోందని వాపోతున్నారు.

అటు పోటీ.. ఇటు కక్కుర్తి..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 57 రకాల పాల బ్రాండ్లు అమ్ముడవుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆయా సంస్థలు ఒక్కో లీటర్‌ పాలను వెన్న శాతాన్ని బట్టి రూ.40 నుంచి రూ.54 వరకు విక్రయిస్తున్నాయి. అయితే డెయిరీల మధ్య విపరీతమైన పోటీ నెలకొనడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు డెయిరీలు పాల పౌడర్‌ను కలిపి పాలు తయారు చేస్తున్నాయని.. పరిమితికి మించి హైడ్రోజన్‌ పెరాక్సైడ్, కాస్టిక్‌ సోడాను వినియోగిస్తున్నాయని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియాలను తొలగించే ప్రక్రియ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని.. దాంతో ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న డెయిరీలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు!
హైదరాబాద్‌ పరిధిలో ఆహార రక్షణ, ప్రమాణాల చట్టం అమలు బాధ్యత జీహెచ్‌ఎంసీదే. అయితే తమ వద్ద అవసరమైన సిబ్బంది లేకపోవడంతో తాత్కాలికంగా ఈ బాధ్యతలను నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)కు అప్పగించారు. కానీ అక్రమాలను అరికట్టడంలో ఈ విభాగానిదీ ప్రేక్షకపాత్రే. రసాయనాలు, బ్యాక్టీరియా ఉన్న పాల ప్యాకెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నా.. ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం వినియోగదారుల్లో అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వ విభాగాలు విఫలమవుతున్నాయి.

రసాయనాలు, బ్యాక్టీరియా ప్రాణాంతకం!
– పాలు అధిక సమయం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లను ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. వీటివల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయని, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక యూరియా కారణంగా కళ్లు, మెదడుకు హానికరమని స్పష్టం చేస్తున్నారు.
– ఇ–కోలీ కారణంగా జీర్ణకోశ వ్యాధులు, సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్‌ వంటి సమస్యలు వస్తాయి.
– గేదెలకు విచ్చలవిడిగా ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇస్తుండడంతో ఆ రసాయనం పాలలో చేరుతోంది. దీనివల్ల ఆ పాలు తాగిన పిల్లల్లో అసాధారణ పెరుగుదల, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.
– పలు డెయిరీల నిర్వాహకులు పాలు తయారు చేసేందుకు నాణ్యత లేని పాలపొడిని వినియోగిస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర పరిసరాల్లో పాల తయారీ సాగుతోంది. దీని వల్ల వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియాలు సంక్రమించి రోగాల పాలు కావాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

అప్రమత్తంగా ఉండకపోతే రోగాలే..
‘‘కల్తీ పాలు తాగిన పిల్లలు ఎంట్రిక్‌ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు వంటి అనారోగ్య సమస్యల పాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇ–కోలీ బ్యాక్టీరియా వల్ల వాంతులు, డయేరియా, జిగట విరేచనలు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్‌ వస్తుంది. పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే అధిక వేడి మీద కొంతసేపు మరిగించినపుడే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక పాలల్లో కల్తీ చేసే పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి..’’  – డాక్టర్‌ రాజన్న, చిన్న పిల్లల వైద్య నిపుణుడు


కర్తవ్యం ఇదే..
– పాల కల్తీకి పాల్పడుతున్న డెయిరీలు, వ్యక్తులపై పౌర సరఫరాల శాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ గట్టి నిఘా పెట్టాలి. ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
– కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి.
– సాల్మొనెల్లా, ఈ–కోలీ, యూరియాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నందున అక్రమార్కులపై ప్రభుత్వం ఫుడ్‌యాక్ట్‌–34 ప్రకారం చర్యలు తీసుకోవాలి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో లో‘పాలు’..
జనాభా: కోటికి పైగా
రోజువారీ పాల అమ్మకాలు: 25 లక్షల లీటర్లు
సహకార, ప్రైవేటు పాల బ్రాండ్లు: 57 (సుమారుగా)
సహకార డెయిరీలు విక్రయిస్తున్న పాలు: 7 లక్షల లీటర్లు
ప్రైవేటు డెయిరీలు విక్రయిస్తున్నవి: 18 లక్షల లీటర్లు
లీటర్‌ పాల ప్యాకెట్‌ ధర: రూ.40 నుంచి రూ.54 (పాలలో కొవ్వు శాతాన్ని బట్టి)
పాలలో కలుపుతున్న రసాయనాలు: సోడా (నిల్వ ఉండేందుకు), హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ (దుర్వాసన రాకుండా ఉండేందుకు), యూరియా (చిక్కగా కనిపించేందుకు), జంతు సంబంధిత కొవ్వు (పాలలో కొవ్వు శాతాన్ని పెంచేందుకు), గ్లూకోజ్‌ (తియ్యటి రుచి కోసం)
పాల ప్యాకెట్లలో తరచూ బయటపడుతున్న బ్యాక్టీరియా: సాల్మొనెల్లా, ఈ–కోలి (వీటితో ఎంట్రిక్‌ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు, యూరియా ఆనవాళ్లతో మెదడుకు హాని వంటి సమస్యలు)

ఎంత మరిగించినా రంగు మారడం లేదు
‘‘పాలు మరిగించినా, మరుసటి రోజుకు కూడా రంగు మారడం లేదు. పాలు తోడువేస్తే పెరుగు జిగురుగా తీగలా సాగుతూ దుర్వాసన వస్తోంది. గడువు తీరిన పాలప్యాకెట్లను అంటగడుతున్నారు..’’
– సుధారాణి, పద్మానగర్‌

కల్తీ పాల విక్రయదారులపై కేసులు పెట్టాలి
‘‘ప్యాకెట్‌ పాలు ఉదయం మరిగించి పెట్టినా సాయంత్రానికే పగిలిపోతున్నాయి. పెరుగు కోసం తోడు వేస్తే నీళ్లలా మారుతున్నాయి. కల్తీ పాల కేంద్రాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..’’
– ప్రణయ, కుత్బుల్లాపూర్‌ గ్రామం

పెరుగు అతుక్కుపోతోంది!
‘‘ఎనిమిదేళ్లుగా ప్యాకెట్‌ పాలనే వాడుతున్నాం. ఒక ప్యాకెట్‌ తాగడానికి వాడి.. మరో ప్యాకెట్‌ పాలను పెరుగు తోడువేస్తున్నాం. కానీ కొంత కాలంగా పాలు సరిగా తోడుకోవడం లేదు. పెరుగు బంకలా అతుక్కుపోతోంది..’’
ఎం.మమత, గృహిణి, ఈస్ట్‌ కల్యాణపురి

తెల్లటి ఉండలు, పురుగులు వస్తున్నాయి
‘‘ప్యాకెట్‌ పాలు వేడి చేస్తుంటే అదో రకమైన వాసన వస్తోంది. పాలలో తెల్లటి ఉండల్లాంటి పదార్థాలు ఉంటున్నాయి. కొన్నిసార్లు చిన్న పురుగులూ కనిపిస్తున్నాయి. పెరుగు తోడుకోవటం లేదు. ఎవరికి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదు..’’
కాసం పద్మ, భవానీనగర్, ఏఎస్‌రావు నగర్‌

ప్యాకెట్‌ పాల నాణ్యతా పరీక్షలో తేలిందిదీ..

పరీక్ష                      ఉండాల్సిన మోతాదు                      పరీక్షలో వెల్లడైంది
కొవ్వుశాతం                      కనీసం 3 శాతం                      3.1 – 4 శాతం
ఇతర ఘన పదార్థాలు    కనీసం 8.5శాతం                         8.82 – 9 శాతం
ఈకోలి, సాల్మోనెల్లా        అసలు ఉండరాదు                        ఉన్నాయి
యూరియా, సోడా         అసలు ఉండరాదు                      స్వల్ప మోతాదులో ఉన్నాయి

(పలు కంపెనీల ప్యాకెట్‌ పాలను హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఫుడ్‌ లేబొరేటరీ పరీక్షించి ఇచ్చిన నివేదికలోని అంశాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement