Dairy Milk
-
HYD: డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగు.. మెట్రో ప్రయాణికుడికి చేదు అనుభవం
చాక్లెట్స్ .. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. ఏషాప్కు అయినా వెళితే ఏదో ఒక చాక్లెట్ కొనితీరాల్సిందే. దాదాపు అందరి ఇళ్లల్లోనూ చాక్లెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక మరో రెండో రెండు రోజుల్లో వాలంటైన్స్ డే(ఫిబ్రవరి 14) వస్తుండటంతో చాకెట్లకు డిమాండ్ మరింత పెరిగిపోయింది. చాలామంది ప్రేమికులు తమ ప్రేమసి, ప్రియుడికి చాక్లెట్‌ను ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు.. అయితే చాక్లెట్ ప్రియులకు ఓ చేదువార్త.. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు కనిపించింది. చాక్లెట్ కవర్ తీయడంతో అందులో సజీవంగా ఉన్న పురుగు కనిపించడంతో సదరు వ్యక్తి కంగు తిన్నాడు. .. తనకు ఎదురైన అనుభవాన్ని బిల్‌తోపాటు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాచెయస్ అనే వ్యక్తి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ రిటైల్ స్టోర్ నుంచి రూ. 45 చెల్లించి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్ చేయడంతో అందులో పురుగు పాకుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతను చాక్లెట్‌ను వీడియో, ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. చదవండి: Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు] Found a worm crawling in Cadbury chocolate purchased at Ratnadeep Metro Ameerpet today.. Is there a quality check for these near to expiry products? Who is responsible for public health hazards? @DairyMilkIn @ltmhyd @Ratnadeepretail @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/7piYCPixOx — Robin Zaccheus (@RobinZaccheus) February 9, 2024 ‘అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ షాప్‌లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో ఒక పురుగు పాకుతున్నట్లు కనిపించింది. గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ చేస్తున్నారా? ప్రజలు అనారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. సంబంధిత ఆహార భద్రత అధికారులను అప్రమత్తం చేశామని.. సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కారిస్తామని తెలిపింది. అదే విధంగా క్యాడ్బెరీ డెయిరీ మిల్క్ సైతం స్పందిస్తూ... ‘హాయ్, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాం. మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు దయచేసి మీ పూర్తి పేరు, అడ్రెస్, ఫోన్ నెంబరు, కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.com ద్వారా మాకు అందించండి.’’ అని పేర్కొంది. -
పశువులకు అలాంటి గడ్డి వేస్తున్నారా? కాల్షియం లోపం వస్తుంది!
‘మేపు లోనే సేపు’ అని నానుడి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తి సామర్ధ్యం పొందాలంటే మేలైన, నాణ్యమైన పశుగ్రాసాలను పచ్చిమేతగా అందించాలి. దాణా కన్నా పచ్చని పశుగ్రాసాలను మేతగా అందిస్తే అధిక పాల దిగుబడి సాధించడంతో పాటు పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచినవారమవుతాం. పాడి పరిశ్రమ లాభసాటి కావాలంటే ఖర్చు తగ్గాలి. ఇది తగ్గాలంటే మేలు జాతి పశుగ్రాసాలను పశువులకు మేతగా అందించాలి. దీనితో 40–50 శాతం ఖర్చు తగ్గటంతో పాటు పాల దిగుబడి 20 శాతం పెరుగుతోంది. రైతులు పశుగ్రాసాల్లో ఏదో ఒకటి లేదా రెండు రకాలను పెంచి పాడి పశువులకు మేపుతుంటారు. అలా కాకుండా కొన్ని రకాల పశుగ్రాసాలను పెంచి పశువులకు క్రమపద్ధతిలో మేపితే మరింత మేలు జరుగుతోంది. ఈ విధానాన్ని అమలాపురం ఏరియా పశు వైద్యశాల అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నారు. ఏరియా పశు వైద్యశాల వెనుక నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని చదును చేసి పదిహేను సెంట్ల స్థలంలో పది రకాల పశుగ్రాసాలను పెంచుతున్నారు. పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు ఎల్.విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనా క్షేత్రంలో సూపర్ నేపియర్, గిని గడ్డి, కనుమ గడ్డి, రెడ్ నేపియర్, గిని గ్రాస్, మోని, చంగల్ గడ్డి, బొబ్బర గడ్డి, సీవో4, సీవో 5 రకాల గడ్డిని పెంచుతున్నారు. ఔత్సాహికులైన పాడి రైతులకు పశుగ్రాసాల పెంపక విధానాన్ని వివరిస్తున్నారు. ప్రతి గడ్డిలో వైవిధ్యభరితమైన పోషకాలు ఉండటంతో అన్ని రకాలు మేపితే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కేవలం పేరా గ్రాస్ (ఇంగ్లీష్ గడ్డి) మాత్రమే మేపితే పశువుల్లో కాల్షియం లోపించే అవకాశముంది. చెంగల్ గడ్డి ‘రాగి సంగటి’తో సమానం. సూపర్ నేపియర్ ఐదేళ్లు పాటు మేత అందుతోంది. కాండం మెత్తగా ఉండడంతో పాటు ఇందులో అధిక పోషకాలుంటాయి. రెడ్ నేపియర్‌లో ప్రోటీన్, గినీ గడ్డిలో శక్తినిచ్చే పోషకాలు ఎక్కువ. వీటిని కలిపి అందించడం వల్ల అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీని వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువులు బలంగా ఉంటాయి. శాస్త్రీయ పద్ధతిలో పశు పోషణలో భాగంగా వివిధ పోషకాలున్న పశుగ్రాసాలను పరిచయం చేయటంతో పాటు వివిధ రకాల నేలలకు అనువైన పశుగ్రాసాల రకాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. గడ్డి విత్తనాలు, కనుపులను ఉచితంగా అందజేస్తున్నారు. రైతులతో పాటు వెటర్నరీ విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నారు. పదిహేను సెంట్లలో ఏడాదికి సగటున 2.5 టన్నుల పశు గ్రాసాన్ని రైతులు పొందనున్నారు. ఒక ఎకరం భూమిలో ఈ విధంగా పశుగ్రాసాలు పెంచితే 5 నుంచి 6 పాడి పశువులకు ఏడాది పొడవునా మేత అందించవచ్చు. వీటితో పాటు కలబంద, నల్లేరు, పసుపు, రణపాల, తులసి, తిప్పతీగ, ఇన్సులిన్ మొక్క వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతూ, సంప్రదాయ వైద్యంలో వాటి ఉపయోగాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఒకటికి పది రకాల పశుగ్రాసాల పెంపకం వల్ల పాడి రైతుల ఆదాయం పెరుగుతోందంటున్నారు విజయ్‌రెడ్డి (98663 27067). – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం 13 నుంచి సింహపురి సేంద్రియ మేళా గో–ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సింహపురి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నెల్లూరులోని వి.ఆర్ కాలేజి గ్రౌండ్స్‌లో సేంద్రియ ఉత్పత్తులతో పాటు చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన–అమ్మకం మేళా జరగనుంది. ఇతర వివరాలకు.. 81436 32488. 15,16 తేదీల్లో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఆదిగురు భారత్ ఫౌండేషన్ అధ్వర్యంలో జనగాంలోని బానపురంలో గో΄ాల్ గోశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో సేంద్రియ, గోఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఉంటుంది. ద్రావణాలు, కషాయాలు, గానుగ నునెలు, నెయ్యి, ధూప్ స్టిక్‌లు తదితర ఉత్పత్తుల తయారీపై నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70953 14226. -
పాలు కాదు.. పచ్చి విషం
సాక్షి, హైదరాబాద్: పొద్దున్నే ఇంటికి పాల ప్యాకెట్ వచ్చింది.. పాలు తెల్లగా, చిక్కగా ఉన్నాయి.. కానీ మరిగిస్తుంటే అదో రకమైన వాసన.. ఎంతసేపైనా మీగడ లేదు.. రంగుకూడా మారలేదు.. తోడుపెడితే పెరుగూ సరిగా కాలేదు.. బంకలాగా అతుక్కుపోతోంది... ఈ మధ్య తరచూ ఇలా జరుగుతోందా? దీనికి కారణం నాణ్యత లేని, రసాయనాలు కలిపిన కల్తీ పాలు.. ఏ ఒక్కరి ఇంట్లోనో, ఒక్క కంపెనీవో కాదు.. ఏకంగా 45% పాల ప్యాకెట్లు నాణ్యతా ప్రమా ణాల ప్రకారం లేవని, హానికరమైన రసాయ నాలు కలసి ఉన్నాయని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. అంతేకాదు ఇ–కొలీ, సాల్మోనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలకూ నిలయంగా మారిపోయాయని ప్రభుత్వ లేబొరేటరీ పరీక్షల్లోనే వెల్లడైంది. ఈ పాలు తాగితే పోషకాల మాటేమోగానీ.. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించి, వ్యాధుల బారినపడటం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లేబొరేటరీయే తేల్చింది.. మనకు పొద్దున పాలు లేనిదే తెల్లవారదు. పెద్దలకు చాయ్ దగ్గరి నుంచి పిల్లలకు ఓ గ్లాసుడు పాల దాకా అత్యవసరం. కానీ డెయిరీ నిర్వాహకుల నిర్లక్ష్యం, కక్కుర్తి కారణంగా ఇప్పుడా పాలే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ విక్రయమవుతున్న వాటిలో దాదాపు 45 శాతం పాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విక్రయిస్తున్న పలు ‡బ్రాండ్ల పాల ప్యాకెట్లను ఇటీవల ‘సాక్షి’బృందం సేకరించి నాచారంలో ఉన్న రాష్ట్ర ఆహార పరీక్షా కేంద్రం (స్టేట్ ఫుడ్ లేబొరేటరీ)లో పరీక్షలు చేయించింది. అందులో కొన్ని ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. కొన్ని శాంపిళ్ల పాలలో కొవ్వు వంటి పదార్థాలు నిబంధనల మేరకు లేవని.. ప్రమాదకరమైన ఇ–కోలీ, సాల్మోనెల్లా బ్యాక్టీరియా వంటి వాటి ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. అంతేకాదు యూరియా, గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడా వంటివి కూడా స్వల్ప మోతాదుల్లో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ‘సాక్షి’బృందం సోమవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్యాకెట్ పాల నాణ్యతపై మహిళల అభిప్రాయాలు సేకరించింది. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు చెబుతున్నది ఒకటే! ప్యాకెట్ పాలు జిగటగా ఉంటున్నాయని.. మరగబెట్టినప్పుడు అదోరకమైన వాసన వస్తోందని.. సరిగా తోడుకోవడం లేదని.. తోడుకున్నా బంకలాగా అతుక్కుంటోందని వాపోతున్నారు. అటు పోటీ.. ఇటు కక్కుర్తి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57 రకాల పాల బ్రాండ్లు అమ్ముడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా సంస్థలు ఒక్కో లీటర్ పాలను వెన్న శాతాన్ని బట్టి రూ.40 నుంచి రూ.54 వరకు విక్రయిస్తున్నాయి. అయితే డెయిరీల మధ్య విపరీతమైన పోటీ నెలకొనడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు డెయిరీలు పాల పౌడర్‌ను కలిపి పాలు తయారు చేస్తున్నాయని.. పరిమితికి మించి హైడ్రోజన్ పెరాక్సైడ్, కాస్టిక్ సోడాను వినియోగిస్తున్నాయని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా వైరస్లు, బ్యాక్టీరియాలను తొలగించే ప్రక్రియ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని.. దాంతో ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న డెయిరీలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. పట్టించుకోని ప్రభుత్వ విభాగాలు! హైదరాబాద్ పరిధిలో ఆహార రక్షణ, ప్రమాణాల చట్టం అమలు బాధ్యత జీహెచ్ఎంసీదే. అయితే తమ వద్ద అవసరమైన సిబ్బంది లేకపోవడంతో తాత్కాలికంగా ఈ బాధ్యతలను నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు అప్పగించారు. కానీ అక్రమాలను అరికట్టడంలో ఈ విభాగానిదీ ప్రేక్షకపాత్రే. రసాయనాలు, బ్యాక్టీరియా ఉన్న పాల ప్యాకెట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నా.. ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం వినియోగదారుల్లో అవగాహన కల్పించడంలోనూ ప్రభుత్వ విభాగాలు విఫలమవుతున్నాయి. రసాయనాలు, బ్యాక్టీరియా ప్రాణాంతకం! – పాలు అధిక సమయం నిల్వ ఉండేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లను ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. వీటివల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయని, జీర్ణకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక యూరియా కారణంగా కళ్లు, మెదడుకు హానికరమని స్పష్టం చేస్తున్నారు. – ఇ–కోలీ కారణంగా జీర్ణకోశ వ్యాధులు, సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. – గేదెలకు విచ్చలవిడిగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తుండడంతో ఆ రసాయనం పాలలో చేరుతోంది. దీనివల్ల ఆ పాలు తాగిన పిల్లల్లో అసాధారణ పెరుగుదల, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. – పలు డెయిరీల నిర్వాహకులు పాలు తయారు చేసేందుకు నాణ్యత లేని పాలపొడిని వినియోగిస్తున్నారు. అది కూడా అపరిశుభ్ర పరిసరాల్లో పాల తయారీ సాగుతోంది. దీని వల్ల వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియాలు సంక్రమించి రోగాల పాలు కావాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే రోగాలే.. ‘‘కల్తీ పాలు తాగిన పిల్లలు ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు వంటి అనారోగ్య సమస్యల పాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇ–కోలీ బ్యాక్టీరియా వల్ల వాంతులు, డయేరియా, జిగట విరేచనలు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది. పాలను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక వేడి మీద కొంతసేపు మరిగించినపుడే బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక పాలల్లో కల్తీ చేసే పదార్థాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి..’’ – డాక్టర్ రాజన్న, చిన్న పిల్లల వైద్య నిపుణుడు కర్తవ్యం ఇదే.. – పాల కల్తీకి పాల్పడుతున్న డెయిరీలు, వ్యక్తులపై పౌర సరఫరాల శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ గట్టి నిఘా పెట్టాలి. ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. – కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. – సాల్మొనెల్లా, ఈ–కోలీ, యూరియాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నందున అక్రమార్కులపై ప్రభుత్వం ఫుడ్యాక్ట్–34 ప్రకారం చర్యలు తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో లో‘పాలు’.. జనాభా: కోటికి పైగా రోజువారీ పాల అమ్మకాలు: 25 లక్షల లీటర్లు సహకార, ప్రైవేటు పాల బ్రాండ్లు: 57 (సుమారుగా) సహకార డెయిరీలు విక్రయిస్తున్న పాలు: 7 లక్షల లీటర్లు ప్రైవేటు డెయిరీలు విక్రయిస్తున్నవి: 18 లక్షల లీటర్లు లీటర్ పాల ప్యాకెట్ ధర: రూ.40 నుంచి రూ.54 (పాలలో కొవ్వు శాతాన్ని బట్టి) పాలలో కలుపుతున్న రసాయనాలు: సోడా (నిల్వ ఉండేందుకు), హైడ్రోజన్ పెరాక్సైడ్ (దుర్వాసన రాకుండా ఉండేందుకు), యూరియా (చిక్కగా కనిపించేందుకు), జంతు సంబంధిత కొవ్వు (పాలలో కొవ్వు శాతాన్ని పెంచేందుకు), గ్లూకోజ్ (తియ్యటి రుచి కోసం) పాల ప్యాకెట్లలో తరచూ బయటపడుతున్న బ్యాక్టీరియా: సాల్మొనెల్లా, ఈ–కోలి (వీటితో ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కడుపునొప్పి, వాంతులు, యూరియా ఆనవాళ్లతో మెదడుకు హాని వంటి సమస్యలు) ఎంత మరిగించినా రంగు మారడం లేదు ‘‘పాలు మరిగించినా, మరుసటి రోజుకు కూడా రంగు మారడం లేదు. పాలు తోడువేస్తే పెరుగు జిగురుగా తీగలా సాగుతూ దుర్వాసన వస్తోంది. గడువు తీరిన పాలప్యాకెట్లను అంటగడుతున్నారు..’’ – సుధారాణి, పద్మానగర్ కల్తీ పాల విక్రయదారులపై కేసులు పెట్టాలి ‘‘ప్యాకెట్ పాలు ఉదయం మరిగించి పెట్టినా సాయంత్రానికే పగిలిపోతున్నాయి. పెరుగు కోసం తోడు వేస్తే నీళ్లలా మారుతున్నాయి. కల్తీ పాల కేంద్రాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..’’ – ప్రణయ, కుత్బుల్లాపూర్ గ్రామం పెరుగు అతుక్కుపోతోంది! ‘‘ఎనిమిదేళ్లుగా ప్యాకెట్ పాలనే వాడుతున్నాం. ఒక ప్యాకెట్ తాగడానికి వాడి.. మరో ప్యాకెట్ పాలను పెరుగు తోడువేస్తున్నాం. కానీ కొంత కాలంగా పాలు సరిగా తోడుకోవడం లేదు. పెరుగు బంకలా అతుక్కుపోతోంది..’’ ఎం.మమత, గృహిణి, ఈస్ట్ కల్యాణపురి తెల్లటి ఉండలు, పురుగులు వస్తున్నాయి ‘‘ప్యాకెట్ పాలు వేడి చేస్తుంటే అదో రకమైన వాసన వస్తోంది. పాలలో తెల్లటి ఉండల్లాంటి పదార్థాలు ఉంటున్నాయి. కొన్నిసార్లు చిన్న పురుగులూ కనిపిస్తున్నాయి. పెరుగు తోడుకోవటం లేదు. ఎవరికి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదు..’’ కాసం పద్మ, భవానీనగర్, ఏఎస్రావు నగర్ ప్యాకెట్ పాల నాణ్యతా పరీక్షలో తేలిందిదీ.. పరీక్ష ఉండాల్సిన మోతాదు పరీక్షలో వెల్లడైంది కొవ్వుశాతం కనీసం 3 శాతం 3.1 – 4 శాతం ఇతర ఘన పదార్థాలు కనీసం 8.5శాతం 8.82 – 9 శాతం ఈకోలి, సాల్మోనెల్లా అసలు ఉండరాదు ఉన్నాయి యూరియా, సోడా అసలు ఉండరాదు స్వల్ప మోతాదులో ఉన్నాయి (పలు కంపెనీల ప్యాకెట్ పాలను హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఫుడ్ లేబొరేటరీ పరీక్షించి ఇచ్చిన నివేదికలోని అంశాలు) -
ఇంటి దొంగ అరెస్ట్
రూ.5.91 లక్షల నగదు స్వాధీనం అనంతపురం సెంట్రల్ : అనంతపురం పాపంపేటలో శ్రీచక్ర మిల్క్ డెయిరీలో జరిగిన దొంగత నాగేంద్ర అనే ఇంటి దొంగను సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ మల్లికార్జున వర్మ విలేకరులకు తెలిపారు. అతని నుంచి రూ.5.91 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వేసిన తాళాలు వేసినట్లే... చోరీ జరిగిన రోజు డెయిరీ తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. అయితే నగదు మాయం కావడంపై డెయిరీ యజమాని వెంకటేశ్వర వరప్రసాద్ అనంతపురం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేసిన తాళాలు వేసినట్లే ఉండగా, నగదు ఎలా మాయమైందన్న అనుమానం వచ్చిన పోలీసులు ఇంటి దొంగలపై కన్నేశారు. విందు ఇచ్చి... అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన నాగేంద్ర డెయిరీలో పని చేసేవాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. చెడు వ్యసనాలకు బానిసైన నాగేంద్ర ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ నెల 8న డెయిరీలో పని చేసే క్యాషియర్ హరీశ్, సేల్స్ ఎక్జిక్యూటివ్ పవన్‌కుమార్, విజయభాస్కర్‌కు విందు ఇస్తానని నమ్మబలికాడు. అదే రోజు వారిని ఓ రెస్టారెంట్ పిల్చుకెళ్లి ఫుల్‌గా మద్యం తాపించాడు. ఆ తరువాత అందరూ కలసి రూముకు వెళ్లి నిద్రపోయారు. వారంతా నిద్రపోయారని నిర్ధరించుకున్నాక నాగేంద్ర డెయిరీ తాళాలు తీసుకొని క్యాషియర్ మేజాలో ఉంచిన రూ.5.91 లక్షలను దొంగలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా మళ్లీ రూముకు వచ్చి యథావిధిగా తాళాలు క్యాషియర్ జేబులో పెట్టాడు. పోలీసుల విచారణలో అసలు ఈ విషయాలు ఒప్పుకోవడంతో అతన్ని అరెస్టు చేసి, నగదు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ ఇన్చార్జ్ సీఐ శివశంకర్ పాల్గొన్నారు.