- రూ.5.91 లక్షల నగదు స్వాధీనం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం పాపంపేటలో శ్రీచక్ర మిల్క్ డెయిరీలో జరిగిన దొంగత నాగేంద్ర అనే ఇంటి దొంగను సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ మల్లికార్జున వర్మ విలేకరులకు తెలిపారు. అతని నుంచి రూ.5.91 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
వేసిన తాళాలు వేసినట్లే...
చోరీ జరిగిన రోజు డెయిరీ తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. అయితే నగదు మాయం కావడంపై డెయిరీ యజమాని వెంకటేశ్వర వరప్రసాద్ అనంతపురం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేసిన తాళాలు వేసినట్లే ఉండగా, నగదు ఎలా మాయమైందన్న అనుమానం వచ్చిన పోలీసులు ఇంటి దొంగలపై కన్నేశారు.
విందు ఇచ్చి...
అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన నాగేంద్ర డెయిరీలో పని చేసేవాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. చెడు వ్యసనాలకు బానిసైన నాగేంద్ర ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ నెల 8న డెయిరీలో పని చేసే క్యాషియర్ హరీశ్, సేల్స్ ఎక్జిక్యూటివ్ పవన్‌కుమార్, విజయభాస్కర్‌కు విందు ఇస్తానని నమ్మబలికాడు. అదే రోజు వారిని ఓ రెస్టారెంట్ పిల్చుకెళ్లి ఫుల్‌గా మద్యం తాపించాడు. ఆ తరువాత అందరూ కలసి రూముకు వెళ్లి నిద్రపోయారు. వారంతా నిద్రపోయారని నిర్ధరించుకున్నాక నాగేంద్ర డెయిరీ తాళాలు తీసుకొని క్యాషియర్ మేజాలో ఉంచిన రూ.5.91 లక్షలను దొంగలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా మళ్లీ రూముకు వచ్చి యథావిధిగా తాళాలు క్యాషియర్ జేబులో పెట్టాడు. పోలీసుల విచారణలో అసలు ఈ విషయాలు ఒప్పుకోవడంతో అతన్ని అరెస్టు చేసి, నగదు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ ఇన్‌చార్జ్ సీఐ శివశంకర్ పాల్గొన్నారు.