Telangana: విత్తు.. విపత్తు | Fake Seeds Mafia Increases Police Raids Telangana | Sakshi
Sakshi News home page

Telangana: విత్తు.. విపత్తు

Published Sun, Jun 13 2021 3:24 AM | Last Updated on Sun, Jun 13 2021 3:38 AM

Fake Seeds Mafia Increases Police Raids Telangana - Sakshi

►శనివారం ఖమ్మం జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సంయు క్తంగా దాడులు చేసి ఏకంగా రూ.1.43 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల, వికారాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. 
►మూడురోజుల క్రితం సూర్యాపేట జిల్లాలో ఏకంగా రూ. 13.5 కోట్ల విలువ చేసే నకిలీ మిర్చి, కూరగాయలు, పుచ్చ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. ఒక్కరోజులోనే ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం అధికారులనే నివ్వెరపరిచింది.  
►శనివారం హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్, వనస్థలిపురం పరిధిలో పోలీసులు దాడులు చేసి రూ. 1.15 కోట్ల విలువైన నకిలీ పత్తి, మిరప, వేరుశనగ విత్తనాలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేశారు. 
►అత్యధికంగా ధర ఉండే పత్తి, మిరప, సోయాబీన్, మొక్కజొన్న వంటి విత్తనాలు (నకిలీ) తక్కువ ధరకు లభిస్తుండటంతో రైతులు వాటిని కొంటూ మోసపోతున్నారు. రాష్ట్రంలో  విత్తనాల కొరత కూడా నకిలీ దందాకు కారణమవుతోంది. 

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఒకపక్క అధికారులు ఎక్కడికక్కడ నిఘా వేసి పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నా.. మరోపక్క అదే స్థాయిలో నకిలీ విత్తన మాఫియా పేట్రేగిపోతోంది. వానాకాలం మొదలై ప్రస్తుతం విత్తనాలు వేసే సమయం కావడంతో అడ్డూఅదుపూ లేకుండా రెచ్చిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో నకిలీ విత్తన దందా కొనసాగుతోంది.

రాజధాని హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో ప్రతిరోజూ నకిలీ విత్తనాలు భారీ మొత్తంలో బయటపడుతున్నాయి. వాస్తవానికి సీజన్‌ రాకముందు నుంచే నకిలీ విత్తనాల సరఫరా మొదలుపెట్టిన అక్రమార్కులు, ఇప్పుడు మరింత విచ్చలవిడిగా అమాయక రైతులకు అంటగడుతున్నారు. రాష్ట్రంలో విత్తన మాఫియా ప్రతి వానాకాలం సీజన్‌లో వందల కోట్ల విలువైన నకిలీ విత్తనాల దందా కొనసాగిస్తోందని వ్యవసాయాధికారులే చెబుతున్నారు.

ఈ సీజన్‌లో కేవలం గత 15–20 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.80 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో పట్టుబడినట్లుగా వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపిందంటే.. రాష్ట్రంలో ఏస్థాయిలో ఈ అక్రమ దందా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇలా నకిలీ విత్తన మాఫియా రెచ్చిపోవడానికి కొందరు అధికారులు, మరికొందరు రాజకీయ నేతల అండదండలే కారణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. లక్షలకు లక్షలు ముడుపులు తీసుకుంటున్న అధికారులు, నేతల కారణంగానే రాష్ట్రం నకిలీ విత్తనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. విత్తన చట్టంలోని లోపాలు కూడా అక్రమ దందాకు ఊతం ఇస్తున్నాయని అంటున్నారు.

అధిక ధర పలికే విత్తనాల్లోనే..
పోలీసులు, వ్యవసాయాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నప్పటికీ అక్రమ వ్యాపారానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రధానంగా అత్యధికంగా ధర ఉండే పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, మిరపలకు సంబంధించిన నకిలీ విత్తనాలు వ్యాపారులు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అందులో అత్యధికంగా పత్తి విత్తనాలే ఉంటాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఈ సీజన్లో 70.05 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాల చొప్పున మొత్తం 1.40 కోట్ల ప్యాకెట్లకు పైగా అవసరం. ఈ విత్తనాన్ని మొత్తం ప్రైవేట్‌ కంపెనీలే (ప్రభుత్వ విత్తనాల్లేవు) రైతులకు విక్రయిస్తాయి. అయితే ప్రైవేటు కంపెనీల వద్ద కేవలం 90 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు అంటున్నారు. అంటే ఇంకా 50 లక్షల ప్యాకెట్ల కొరత నెలకొని ఉంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన మాఫియా నకిలీ లేబుళ్లు తయారు చేసి అందులో నాసిరకం విత్తనాలను పెట్టి రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా నిషేధిత బీజీ–3 పత్తి విత్తనం వరదలా పారుతోంది. రైతులు కూడా అమాయకంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు.

ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌ బృందానికి భారీగా బీజీ–3 విత్తనాలు దొరికాయి. అయితే ‘మాకు మంచి దిగుబడి వస్తే చాలు... ఏ విత్తనమైతే ఏంటి?’అని కొందరు రైతులు ప్రశ్నించడంతో అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది. ఇక మిరప విత్తనం కొరత కూడా ఉండటంతో అందులోనూ నకిలీ ముఠా రెచ్చిపోతోంది. ఇక నకిలీ, నాసిరకం విత్తనాలను కొన్నిచోట్ల ప్యాకింగ్‌ చేయకుండానే లూజ్‌గా అమ్ముతున్నారు. లైసెన్సులు లేకుండానే అనుమతి ఉన్నట్లుగా విక్రయాలు జరుపుతున్నారు. అసలు జర్మినేషన్‌ రాదని (మొలకెత్తవని) నిర్ధారించిన సీడ్స్‌ను కూడా ప్యాకింగ్‌ చేసి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అక్కడక్కడ రీసైక్లింగ్‌ కూడా చేస్తున్నారు. కాలం తీరిన విత్తనాలను వాటి నాణ్యత పరీక్షించకుండా, తేదీలు మార్చి మళ్లీ వాటినే (పాత విత్తనాలకు కొత్త ప్యాకింగ్‌) అమ్మకానికి పెడుతున్నారు. ఈ నకిలీ విత్తనాల విషయంలో సాధారణ, చోటా మోటా వ్యాపారులను మాత్రమే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తుండగా.. ఈ అక్రమ దందాల వెనుక అసలు సూత్రధారులు బయటకు రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

13 కేంద్రాలపై క్రిమినల్‌ కేసులు
రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన విక్రయ కేంద్రాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ శనివారం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా 229.55 క్వింటాళ్ల నకిలీ పత్తి, సోయాబీన్‌ తదితర పంటల విత్తనాలను, రికార్డులు లేని 74.3 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 268 కిలోల క్రిమిసంహరక మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లోని 13 కేంద్రాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 

గతంలో పట్టుకున్న మరికొన్ని కేసులు
– ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజీ–3 పత్తి విత్తనాలు పట్టుకున్నారు. వాటి విలువ రూ. 24.05 లక్షలు. 
– మంచిర్యాల జిల్లాలో గత 15 రోజుల్లో రూ. 50 లక్షల విలువైన బీజీ–3 విత్తనాలను పట్టుకున్నారు. బెల్లంపల్లి, నెన్నెల, మందమర్రి, భీమినిలలో ఎక్కువగా దొరికాయి. ముగ్గురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. 
– కర్ణాటక సరిహద్దు గ్రామాల మీదుగా వికారాబాద్‌ జిల్లాకు తరలిస్తున్న 5.95 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను ఈ నెల 8వ తేదీన చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు పలు బ్రాండెడ్‌ కంపెనీల పేర్లతో ముద్రించిన ఖాళీ ప్యాకెట్లు, తూకం యంత్రాలు, ప్యాకింగ్‌ మెషీన్లను సీజ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
– ఈ నెల 4న వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం బిచ్చాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇంటిపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే మండలం గోకఫసల్‌వాద్‌ గ్రామానికి చెందిన వీరపనేని కొండప్పనాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శుక్రవారం 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. 
 – మెదక్‌ జిల్లాలో కాలం చెల్లిన వరి, కూరగాయల విత్తనాలు పట్టుకున్నారు. వాటి విలువ రూ. 5.20 లక్షలు. తూప్రాన్, రామాయంపేటలలో ఎక్కువగా దొరికాయి. 
– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ద్వారకా స్టార్‌ బిందు మిర్చి విత్తనం పట్టుకున్నారు. వాటి విలువ రూ.71 లక్షలు. ఏన్కూరు మండల కేంద్రం, ఖమ్మం రూరల్‌ మండలం అరేకొడు, కాచిరాజుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలోని అంజనాపురంలలో ఎక్కువగా పట్టుకున్నారు. 
– ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇటీవల దీప్తి, భూమిక, పల్నాడు, సిరి, రాజేశ్వరి, పద్మావతి, అల్ట్రా, స్టార్‌ బిందు, పీహెచ్‌ఎస్‌ – 491 బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్న రూ.3.04 కోట్ల విలువైన నకిలీ మిర్చి విత్తనాలను ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. 
– ఆసిఫాబాద్‌ జిల్లాలో
గత పదిహేను రోజుల్లో రూ. కోటిన్నర విలువైన నిషేధిత బీజీ–3 (హెచ్‌టీ కాటన్‌) పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని కాగజ్‌నగర్, బెజ్జూర్, చింతల మానేపల్లి, పెంచికల్‌పేట్‌లలో ఇవి వెలుగుచూశాయి. 

ఖమ్మం క్రైం:
ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి రూ.1.43 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ తెలిపారు. ఏన్కూరుకు చెందిన బైరు వేణుగోపాల్‌రావు, మంగయ్యలు అదే గ్రామానికి చెందిన ముడిగొండ వెంకట కృష్ణారావు అనే రైతుకు మే 17న రూ.68 వేల విలువైన ‘ద్వారకా సీడ్స్‌ స్టార్‌ బిందు ఎఫ్‌–1 హైబ్రిడ్‌’అనే మిరప విత్తనాలు విక్రయించారు.

ఇవి నాణ్యమైనవని, అధిక దిగుబడి వస్తుందని నమ్మించారు. అయితే ఇటీవల నకిలీ విత్తనాల బెడద అధికమయ్యిందనే సమాచారంతో కృష్ణారావు ఈనెల 8న స్థానిక వ్యవసాయాధికారి (ఏవో) నర్సింహారావుకు సమాచారం అందించారు. ఏవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్‌ గుట్టు బయటపడింది. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని సాయిలక్ష్మి ఏజెన్సీ నుంచి 2,016 ప్యాకెట్లు, మహబూబాద్‌లోని దార్వకా ఏజెన్సీ దుకాణం నుంచి 1,840 ప్యాకెట్లు, వరంగల్‌లోని పరమేశ్వరి ఏజెన్సీ నుంచి 3,380 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్‌ షాప్‌ యజమానులు శ్రీధర్, సురేష్, పిచ్చయ్య, అజ్మీర సురేష్, చెరుకుమల్లి శ్రీధర్, వరంగల్‌కు చెందిన దేవ సతీష్‌పై కేసు నమోదు చేశారు. ద్వారకా విత్తన కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్న వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, హైదరాబాద్‌ ప్రాంతీయ మేనేజర్‌ మలపతి శివారెడ్డిని అరెస్ట్‌ చేశారు. 
నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్టు
మంచిర్యాల క్రైం: 
జిల్లాలోని మంచిర్యాల, సీసీసీ నస్పూర్, తాళ్లగురిజాల, భీమిని, కన్నెపెల్లి, తాండూర్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి రూ.51 లక్షల విలువైన నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
వికారాబాద్‌ జిల్లాలో..
కొడంగల్‌:
వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణంలోని ఓ ఎరువుల దుకాణంపై జిల్లా టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్, కొడంగల్‌ పోలీసులు, వ్యవసాయ అధికారులు కలిసి దాడులు చేశారు. సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాలను, గడ్డి మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో..
టేకుమట్ల(రేగొండ):
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎస్‌ఎస్‌ అగ్రి మాల్‌లో రూ.2.9 లక్షల విలువైన కాలం చెల్లిన మిరప విత్తనాలు ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: ధరల మంట.. బతుకు తంటా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement