
పాడి రైతు నెత్తిన పాలు!
సాక్షి, హైదరాబాద్: పాడి రైతుకు ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పాల సేకరణ ధరను రూ. 4 పెంచి, ఆ మేరకు భారాన్ని ప్రభుత్వం భరించడం ద్వారా డెయిరీకి ప్రాణం పోయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. పాల సేకరణ ధర పెంపు ఫైలును ఏపీ డెయిరీ ఎండీ ఎ.శ్రీనివాస్ శనివారం సీఎం కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకొంటుందని భావిస్తున్నారు. సేకరణ ధర పెంచిన ప్రతిసారీ సహజంగా అమ్మకపు ధర కూడా పెరుగుతుంది. కానీ సీఎం మాత్రం విజయ పాల అమ్మకపు ధర పెంపుపై విముఖతతోనే ఉన్నారు. సేకరణ ధర పెంచినా అమ్మకపు ధర పెరగకుండా చూడాలని భావిస్తున్నారు.
ప్రైవేటుకు దీటుగా: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాల విక్రయం రోజుకు 26 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. ఇందులో ఏపీ డెయిరీ 4.5 లక్షల లీటర్లు విక్రయిస్తుంది. ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల లీటర్లు అమ్ముతుంది. అంతా ప్రైవేటు గుత్తాధిపత్యమే నడుస్తోంది. ప్రైవేటు సంస్థలు రైతుకు పాల సేకరణ ధర అధికంగా ఇస్తుండటంతో ఏపీ డైయిరీకి పాలు పోసే వారే కరువయ్యారు. 4.5 లక్షల పాల సేకరణలో 2 లక్షల లీటర్లను కర్ణాటక నుంచే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. అందుకే సేకరణ ధర పెంచాలని విజయ డెయిరీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ఏపీ డెయిరీ లీటరు పాల సేకరణకు రైతులకు రూ.53 ఇస్తోంది. ప్రైవేటు సంస్థలు లీటరుకు రూ. 57కు మించి ఇస్తున్నాయి. దీంతో రైతులు ప్రైవేటు డెయిరీలకే పాలు పోస్తున్నారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెయి రీ రోజుకు 50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. అక్కడ పాడి రైతుకు ప్రభుత్వమే లీటరుకు రూ.4 ప్రోత్సాహం ఇస్తుండటంతో రైతులంతా సర్కారు సంస్థకే పాలు పోస్తున్నారు. ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. సేకరణ ధర పెంచినా ఆ భారం ఏపీ డెయిరీపై కాకుండా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.