తన మిమిక్రీతో... హాస్యోక్తులతో చిన్నారుల్లో నవ్వుల పువ్వులు...
ఆనంద నిలయం... పేరులో ఆనందమున్న ఆ నిలయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. ఎవరిని కదిలించినా కన్నీటి సంద్రాలే. గోరుముద్దలు తినిపించే తల్లిలేదు.. చేయిపట్టి నడిపించే తండ్రిలేడు.. కష్టాలను కన్నీళ్లను లేత హృదయాల్లో దాచుకొని.. ఆనంద నిలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆ చిన్నారుల్లో సినీనటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి రాక నిజమైన ఆనందాన్ని నింపింది. ఆయన కరీంనగర్‌లోని ఆనంద నిలయంలో ‘సాక్షి స్టార్ రిపోర్టర్’గా మారి పిల్లలతో పిల్లాడిలా కలిసిపోయి వారితో ఆడిపాడారు. తన మిమిక్రీతో... హాస్యోక్తులతో చిన్నారుల్లో నవ్వుల పువ్వులు పూయించారు. సరదా మాటలతో సంబరాల్లో ముంచారు. కడుపుబ్బా నవ్వించారు.
శివారెడ్డి : అన్న మంచిగున్నరానే..
పిల్లలు : బాగున్నాం సార్
శివారెడ్డి : ఎందుకు బాగున్నరు?
పిల్లలు : మీరొస్తున్నారని..
శివారెడ్డి : ఏం జరుగుతుందిక్కడ?
పిల్లలు : ప్రోగ్రాం
శివారెడ్డి : ఏం ప్రోగ్రాం?
పిల్లలు : మీరొచ్చారని..
శివారెడ్డి : నేటి వార్తలేంటి?
పిల్లలు : ఈ రోజు పేపర్ చదవలేదు
శివారెడ్డి : నేను తెలుసా మీకు?
పిల్లలు : శివారెడ్డి (టక్కున పిల్లలందరి జవాబు)
శివారెడ్డి : ఎట్లా తెలుసు?
పిల్లలు : కరెంటుతీగ, దూకుడు సినిమాలో చూశాం
శివారెడ్డి : సినిమాలు చూస్తారా.. రఫ్‌లో నటించా. శ్రీహరికి అసిస్టెంట్ పాత్ర చేశా. మంచి పేరొచ్చింది. నన్ను అభినందిస్తూ అందరినుంచి ఫోన్ల వస్తున్నయ్. పానీపూరి సినిమాతోపాటు ఇంకా మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.
పిల్లలు : మీ సినిమా చూస్తం
శివారెడ్డి : హాస్టల్ నచ్చిందా, బాగా చూసుకుంటున్నారా?
పిల్లలు : బాగుంది. అందరం బాగా చదువుకుంటున్నం
శివారెడ్డి : పొద్దున తినడానికి ఏం పెడతరు?
స్వామి : టిఫిన్ పెడతరు
శివారెడ్డి : మీకు ఏ హీరోలంటే ఇష్టం
పిల్లలు : ప్రభాస్, నాగార్జున, అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్, రవితేజ (ఎవరికి నచ్చిన హీరో గురించి వారు చెప్పారు)
శివారెడ్డి : కరీంనగర్‌కు మాత్రం నేనే హీరోను. ఆవలిస్తే పేగులు లెక్కబెడతా.
పిల్లలు : మీరు కూడా ఇష్టం సార్
శివారెడ్డి : పాటలు ఎవరు పాడుతరు?
పిల్లలు : అజయ్ పాడుతడు సార్
అజయ్ : తెలుగుభాష గొప్పతనం, తెలుగుభాష తియ్యదనం అంటూ పాటపాడుతుండగానే శివారెడ్డి కామెడీ చేశారు. (పిల్లలు కడుపుబ్బ నవ్వారు)
స్వామి : టింగ్‌టింగ్ టింగూ అంటూ నోటితో మ్యూజిక్ చేసుకుంటూ పాట పాడారు. (పాట పాడినంత సేపు శివారెడ్డి సరదా మాటలతో నవ్వించారు)
శివారెడ్డి : హాస్టల్ ఎలా ఉంది? దోమలున్నాయా.. దోమతెరలేమైనా కావాలా? ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విధాలా ముందుకు సాగవచ్చు. తెలుసా?
వంశీ, సంతోష్ : దోమలు కొద్దిగనే ఉన్నయ్ సార్.
శివారెడ్డి : ఆలోచించుకొని చెప్పు. పోయేలోపు. మీ పేరేంటి.
పిల్లలు : సార్... నాపేరు ఎన్.రాకేశ్, నాపేరు డి.శివశంకర్.
శివారెడ్డి : నాపేరు కూడా శివశంకర్‌రెడ్డే. చిరంజీవి పేరులో కూడా నాపేరే ఉంది. సినిమాలకొచ్చినాక ముందు శివ అని పెట్టుకున్న తర్వాత దాన్నే శివారెడ్డిగా మార్చుకున్నా. ఇంతవరకు 100 సినిమాలు చేశా. మన జిల్లాకు చెందిన సానా యాదిరెడ్డి అవకాశమిచ్చారు. అది సరే మీకు ఇంకా ఏం కావాలే.
పిల్లలు : సినీ నటుల, రాజకీయ నాయకులు గొంతులతో మిమిక్రీ చేయండి.
శివారెడ్డి : సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు, ఎమ్మెస్సార్, హన్మంతరావు, రోశయ్య, ప్రభాస్, నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి, బ్రహ్మానందం, తాగుబోతు రమేశ్ గొంతులను అనుకరించారు (పిల్లలు కేరింతలు కొట్టారు.)
పిల్లలు : మీరిక్కడికెందుకు రావాలనుకున్నారు?
శివారెడ్డి : నేను సాదాసీదా కుటుంబం నుంచి పైకొచ్చినవాణ్ణే. కష్టాలు, కన్నీళ్లు నాకు తెలుసు. కష్టాల్లో ఉన్నవారన్నా, పేదలన్నా నా మనసు కదులుతుంది. ఇక్కడ మీరున్నరని తెలిసి, మిమ్మల్ని కలుద్దామని వచ్చిన.
స్వామి : థాంక్యూ సార్. మీరు మాకోసం రావడం మమ్మల్ని పలకరించడం, మాకోసం మీరొచ్చారన్న ఆనందం ఎక్కువగా ఉంది సార్.. థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్ సార్.
సహాయం చేసే చేతులే మిన్న : శివారెడ్డి
నాకు చాలా ఆనందంగా ఉంది. కొద్ది సేపు ఇలాంటి పిల్లలతో గడిపే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి అభినందనలు. స్టార్ రిపోర్టర్‌గా పిల్లల బాధలు, గాధలు తెలుసుకున్నాను. సమాజంలో ఆదరణ తక్కువ ఉన్న పిల్లలకు సహాయం చేసే అవకాశం దొరికింది. అవకాశము న్న ప్రతీ ఒక్కరు వీరికి సహాయం చేయాలి. పైచదువులు చదువుకునేలా ప్రోత్సహించాలి. దాంట్లోనే సంతృప్తి ఉంటుంది. నేను కూడా పిల్లలందరికీ డ్రెస్సులు పంపిస్తాను. త్వరలోనే మళ్లీ కలుస్తాను. (అందరు పిల్లలతో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్‌లిచ్చి వీడ్కోలు చెప్పారు.)