
అమరవీరులకు మండలి సంతాపం
తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసం అమరులైన వీరులకు శాసన మండలి సంతాపం ప్రకటించింది. జూబ్లీహాల్‌లో ఏర్పాటైన తెలంగాణ మండలి సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.
సభ్యులతో ప్రమాణం చేయించిన చైర్మన్
అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా: మహమూద్‌అలీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసం అమరులైన వీరులకు శాసన మండలి సంతాపం ప్రకటించింది. జూబ్లీహాల్‌లో ఏర్పాటైన తెలంగాణ మండలి సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మండలి చైర్మన్ విద్యాసాగర్‌రావు తొలుత ఎమ్మెల్సీలతో మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రెండు నిమిషాల పాటు అమరవీరులకు మండలి సభ్యులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారికి రాష్ట్ర ఏర్పాటును అంకితం చేస్తూ సంతాప తీర్మానాన్ని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ప్రవేశపెట్టగా, విపక్షనేత డి.శ్రీనివాస్ బలపరిచారు.
33 మంది సభ్యులకుగాను సోమవారం 31 మంది హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాలేదు.అధికారిక చిహ్నంలో ఉర్దూ భాష లేనందున తాను ప్రమాణ స్వీకారం చేయనని షబ్బీర్ అలీ ప్రకటించారు. అయితే, ఈ విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ హామీ ఇవ్వడంతో చివరగా షబ్బీర్ ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల హామీ మేరకు అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహమూద్ ప్రకటించారు. చివరికి సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.