బంగారు తెలంగాణే లక్ష్యం | minister harish rao in 68th Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణే లక్ష్యం

Published Sat, Aug 16 2014 12:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

బంగారు తెలంగాణే లక్ష్యం - Sakshi

బంగారు తెలంగాణే లక్ష్యం

అభివృద్ధిలో మెతుకుసీమ అగ్రస్థానంలో నిలవాలి
ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష ఎకరాలకు సాగునీరు
గజ్వేల్, జహీరాబాద్‌లో పరిశ్రమల ఏర్పాటు
ఐదుచోట్ల కొత్త వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం
గజ్వేల్‌లో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్టు కాలేజీ
గత పాలకుల వల్లే కరెంట్ కష్టాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఆకలిచావులు లేని బంగారు తెలంగాణ నిర్మించుకుందాం. ఉద్యమంలోనే కాదు, ప్రగతిపథంలో కూడా మెతుకుసీమ ముందుంటుందని ప్రపంచానికి చాటుదాం.. తెలంగాణ సంస్కృతికి పునరుజ్జీవం పోద్దాం’ అని నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ  మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సంగారెడ్డిలో పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరుగుతున్న మొట్టమొదటి స్వాతంత్య్ర దినోత్సవవేడుకలకు మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

స్థానిక పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం మంత్రి హరీష్‌రావు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. గతంలో ఎన్నోమార్లు జెండా పండుగలు చేసుకున్నా ఇంత ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోలేదన్నారు. పేరుకు 68వ స్వాతంత్య్ర వేడుకలైనా మనందరికీ ఇది తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలని ప్రకటించారు. ఆంధ్ర వాసనలు పోగొట్టి తెలంగాణ పరిమళాలు వెదజల్లే కార్యక్రమాలు భవిష్యత్తులో జరుగుతాయని తెలిపారు.

జిల్లాతో ముఖ్యమంత్రి కేసీఆర్, తనకు జన్మజన్మల బంధం ఉందని, జిల్లా అడుగడుగునా తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. పుట్టిన నేల రుణం తీర్చుకునే సువర్ణవకాశం తమకు దక్కిందన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిపరుస్తామని ప్రకటించారు. మంత్రి హరీష్‌రావు తన ప్రసంగంలో మహాకవి దాశరథి కవితలను చదివి వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. మాసాయిపేట దుర్ఘటనలో చిన్నారుల మృతిని గుర్తుచేసుకుంటూ ఈ వేడుకల్లో పాల్గొన్న పిల్లలను చూస్తే నాకు ఆ చిన్నారులే గుర్తుకొస్తున్నారు.. వారు కూడా ఈ రోజు పొద్దున్నే తయారై జెండా వందనానికి వచ్చేవారు కదా...అంటూ మంత్రి హరీష్ గద్గదస్వరంతో పేర్కొనటం.. వేడుకలకు హాజరైన వారి అందరి హృదయాలను కదిలించింది.
 
రైతులకు రుణమాఫీ, దళితులకు భూమి

తెలంగాణ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటించారన్నారు. దీంతో జిల్లాలో 1.07 లక్షల మంది రైతులకు రూ.570 కోట్ల రుణాలు మాఫీ అవుతున్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న రూ.47 కోట్ల పంట నష్టపరిహారం విడుదల చేశామన్నారు. వ్యవసాయ కూలీలుగా ఉన్న దళితులను రైతులుగా మార్చేందుకు ప్రతి ఒక్కరికీ మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.18 కోట్లతో 214 మంది దళితులకు 458 ఎకరాల భూమి పంచుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 2,500 హెక్టార్లలో హైబ్రీడ్ కూరగాయలు, వెయ్యి హెక్టార్లలో పండ్లతోటల సాగు చేపట్టనున్నట్లు వివరించారు.

గజ్వేల్‌లో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్టు కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తొగుట, వంటిమామిడిలో కూరగాయల మార్కెట్, గంగాపూర్‌లో మిర్చి, గజ్వేల్‌లో పండ్ల మార్కెట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 12 కోట్ల మొక్కలు నాటి జిల్లాను హరితవనంగా మారుస్తామని తెలిపారు. కల్యాణలక్ష్మీ పథకం ద్వారా గిరిజన, దళిత ఆడపిల్లలకు రూ.50 వేల ఆర్థికసాయం అందజేస్తున్నట్లు చెప్పారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తున్నట్లు వివరించారు. ఎస్టీలకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో అన్యాక్రాంతమైన 30 వేల ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. తెలంగాణలో ఎంప్లాయ్ ఫ్రండ్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు చెప్పారు.  
 
ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు

జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందజేస్తామని మంత్రి హరీష్ చెప్పారు. సింగూరు జలాలు పూర్తిగా జిల్లాకు వాడుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఆఫ్ తెలంగాణకు సిద్దిపేటే స్ఫూర్తి అన్నారు. జహీరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా జిల్లా ఆర్థికంగా ఎదగటమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలిపారు.

పరిశ్రమల ఏర్పాటులో సింగింల్ విండో విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవటం వల్లే ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. రేషన్‌కార్డులు, గృహనిర్మాణం, పింఛన్‌లు ఇంకా ఇతర  పథకాల్లో అవినీతికి ఇదే కారణమని తెలిపారు. తెలంగాణలో ఎవరి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవటం కోసం ఈ నెల 19న ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 28 వేల మంది ఉద్యోగులతో 7.62 లక్షల ఇళ్లలో సర్వే జరుగుతుందన్నారు. ఒకేరోజు తెలంగాణ అంతటా ఇంటింటి జరిగి తీరుతుందని స్పష్టం చేశారు.

అందుకోసమే ఈ నెల 19న సెలవు దినంగా ప్రకటించామని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సర్వేకు సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్నవారికి సర్టిఫికెట్లు అందజేస్తామని, శిక్షణ లేని ఆరోగ్య వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహిస్తామని చెప్పారు. జిల్లాలో మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా 1,056 గ్రామాల్లో రూ.2,167 కోట్ల విలువైన ప్రతిపాదనలు తయారు చేసుకున్నామని, ఐదు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో 11,123 పనులను ప్రాధాన్యత ఉన్నవిగా గుర్తించామన్నారు. ఈ పనుల కోసం రూ.236 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లా ప్రణాళికలో సైతం రూ.1,247 కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని, వీటన్నింటికీ నిధులు మంజూరు చేసుకుని వచ్చే ఐదేళ్లలో జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు.
 
రెండేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవు
విద్యుత్ కొరతతో రైతులే కాకుండా అన్నివర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర పాలకులు అవలంబించిన పక్షపాత ధోరణి వల్లే విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్నామని అన్నారు. సమస్యను అధిగమించేందుకు జెన్కో ద్వారా ఆరువేల మెగావాట్లు, ఎన్‌టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. మరో రెండు మూడేళ్లలో మన రాష్ట్రం విద్యుత్తు కొరత లేని రాష్ట్రంగా మారుతుందని తెలిపారు.   సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement