
సాక్షి, సిద్ధిపేట: జిల్లా కేంద్రంలోని నాగులబండలో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎల్వీ ప్రసాద్, గొల్లపల్లి ఎన్ రావు, హెటిరో చైర్మన్ పార్థసారథి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే మెడికల్ కళాశాలలు ఉండేవని.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 1987లో ప్రారంభించిన ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని నాలుగు రాష్ట్రాలకు విస్తరించి ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి సేవలను సిద్ధిపేట ప్రజలు వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో 400 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రిని పార్థసారథి రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. మొట్టమొదటిగా సిద్ధిపేటలో క్యాన్సర్ స్క్రినింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని హరీష్‌రావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment