రీ ఇంజనీరింగ్ అంటే తెలుసా?
⇒ కాంగ్రెస్ నేతలకు మంత్రి హరీశ్‌రావు ప్రశ్న
⇒ ప్రభుత్వం చేసే ఏ పనినైనా గుడ్డిగా వ్యతిరేకించడమేనా?
సాక్షి, మహబూబాబాద్: ప్రాజెక్టుల నిర్మాణం వల్ల జరిగే ముంపును తగ్గిస్తూ నీటి సామర్థ్యం పెంచేందుకు కేంద్ర జలవనరుల సంఘం చేసిన సూచనల మేరకే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఉగ్గంపల్లిలోని స్థానిక ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ నివాసంలో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2పై అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టు తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, అందులో తీసుకోగలిగే నీరు 63 టీఎంసీలు మాత్రమేనని 2015, మార్చి 4న కేంద్ర జనవనరుల సంఘం రాష్ట్రానికి సూచించిందని తెలిపారు. దీంతో తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి పోయామన్నారు. 16 లక్షల ఎకరాల నీటిని ఇచ్చే ప్రాణహితలో రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉందని, అందుకే మలన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్‌లను రీ ఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
అలాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో మూడు చోట్ల కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉండి కూడా బ్యారేజీ కట్టేందుకు ఒప్పించలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో నీళ్లు రాకుండా రూపకల్పన జరిగితే ఒక్కనాడు కూడా ఆలోచించకుండా వారు ఏది చెప్పితే అది ఒప్పుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. కంతనపల్లి ప్రాజెక్ట్‌తో 20 తండాలు, 11 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయనే ఉద్దేశంతో ఒక్క తండా.. ఒక్క ఎకరం కూడా మునగకుండా రీ ఇంజనీరింగ్‌తో తుపాకులగుడెం వద్ద బ్యారేజీ కడుతున్నామని వివరించారు.
కరీంనగర్ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ వలన ఆరు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఆ గ్రామాలు ముంపునకు గురికాకుండానే 52 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం కల్పించడం వల్ల తోటపల్లి ప్రాజెక్ట్‌ను రద్దు చేశామన్నారు. తోటపల్లిని కట్టండి ఆరు ఊర్లను ముంచండి అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ధర్నాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంను పాత పద్ధతిలోనే కడితే రెండు నష్టాలు జరుగుతాయని ఉద్దేశంతోనే శ్రీశైలంకు మార్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.