
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే బాధ్యులను విధులనుంచి శాశ్వతంగా తొలగిస్తా మని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సరుకుల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే ప్రత్యేక బృందంతో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. తనిఖీ నివేదిక ఆధారంగా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల్లో అవకతవకలపై పలు ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. సరుకుల పంపిణీపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను క్రమబద్ధీకరించి, ఖాళీల భర్తీకి కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. పిల్లల దత్తతకు సంబంధించి త్వరలో ఆరు గురు సభ్యులతో రాష్ట్రస్థాయిలో అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల చెప్పారు. కొత్త జిల్లాల్లో సఖీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికా రులకు సూచించారు.