‘మిషన్’ను పనికి ఆహార పథకం కానివ్వొద్దు
- ప్రభుత్వానికి కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అవినీతి ముద్రపడిన పనికి ఆహార పథకంలా కానివ్వకుండా చూడాలని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించడాన్ని తప్పుబట్టారు.
గత బడ్జెట్‌లో వ్యవసాయ ప్రణాళిక బడ్జెట్ రూ. 3,061 కోట్లు కాగా ఈ ఏడాది అది రూ. 2,575 కోట్లు మాత్రమేనని, దీన్ని రైతులు ఏమాత్రం క్షమించరన్నారు. జాతీయ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 760 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం మాత్రం 97 మందే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోందని ఆరోపించారు. ప్రభుత్వ నిరాదరణ వల్లే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయశాఖను రైతు సంక్షేమశాఖగా మార్చాలని కోరారు.
సన్నచిన్నకారు రైతులకు కల్యాణలక్ష్మిని వర్తింపచేయడంతోపాటు వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేయగా మరో కాంగ్రెస్ సభ్యుడు కృష్ణారెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ మిషన్ కాకతీయతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోందన్నారు. వర్షం లేకుంటే చెరువులకు నీరు ఎలా వస్తుందో చెప్పాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో లక్ష నాగళ్లు ఎక్కడ?
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్నారన్న విషయాన్ని కాంగ్రెస్ సభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి సభలో ప్రస్తావించారు. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ సీఎం ఆ మాట అన్నట్లు ఆధారాలుంటే సభలో పెట్టాలని, సీఎం అనని మాటలను అన్నట్లు చెప్పడం తగదన్నారు. అలాగే బడ్జెట్‌కు సంబంధం లేని ప్రసంగం చేయడం బాగోలేదన్నారు. అనంతరం రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చకుండా ప్రస్తుతమున్న చోటే కొత్తగా నిర్మించాలని కోరారు. దళితులకు మూడెకరాలు ఎప్పుడు ఇస్తారో నిర్ణీత సమయం చెప్పాలని కోరారు. కాగా, సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్ యూ మృతికి రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలిపింది.