ఏటూరునాగారం: గోదావరిలో పుష్కర స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం కంతానపల్లి పడవరేవు వద్ద మహిళల మృతదేహాలను సోమవారం ఉదయం గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పార్వతి(35), కల్పన (21) కంతానపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 25 న సాయంత్రం గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. ప్రవాహ ఉధృతికి కొట్టుకు పోయారు. వారి కోసం అప్పటి నుంచి గాలిస్తుండగా సోమవారం ఉదయం మృతదేహాలు బయటపడడంతో పోలీసులు నది వద్దకు చేరుకుని వాటికి వెలికి తీయించారు. పోస్ట్‌మార్టం కోసం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.