సాక్షి, ఆదిలాబాద్ : మిషన్ భగీరథ ప్రయత్న ఫలితం ఆసన్నమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి సెగ్మెంట్‌గా తీసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలకు నీటి సరఫరా పనులు తుది దశకు వచ్చాయి. ఈ నెల చివరి వరకు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ట్రయల్‌రన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం లోకల్‌వెల్మల్‌లో ఇంటెక్‌వెల్, దిలావర్‌పూర్ మండలం మాడెగాంలో నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణాలు పూర్తయ్యాయి. పైమూడు నియోజకవర్గాలకు ఈ ఇంటెక్‌వెల్, నీటిశుద్ధి ప్లాంట్ నుంచే నీటి సరఫరా జరుగుతుంది. ఇదే సెగ్మెంట్‌లో గడ్డన్న వాగు వద్ద ఇంటెక్‌వెల్ నిర్మాణం పూర్తయింది. ఈ ఇంటెక్‌వెల్ నుంచి భైంసా పట్టణంలోనిæ శుద్ధి ప్లాంట్‌కు నీళ్లు చేరుకుంటాయి. ఈ ప్లాంట్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఇంటెక్‌వెల్, నీటి శుద్ధిప్లాంట్ నుంచి ముథోల్ నియోకవర్గానికి నీటి సరఫరా జరుగుతోంది. మొదట నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ ట్రయల్‌రన్ తర్వాత భైంసా ట్రయల్‌రన్ నిర్వహించాలని భావిస్తున్నారు.
మాడెగాంలో ప్రారంభమైన నీటిశుద్ధి పనులు..
ఎస్సారెస్పీ నుంచి నిర్మల్ జిల్లా సోన్ మండలం లోకల్‌వెల్మల్ ఇంటెక్‌వెల్ నుంచి దిలావర్‌పూర్ మండలం మాడెగాం శుద్ధి ప్లాంట్(డబ్ల్యూటీపీ)కు నీళ్లు చేరుకున్నాయి. ఇక్కడ శుద్ధి తర్వాత పైపులైన్‌ల ద్వారా నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో నిర్మించిన భూస్థాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు(జీఎల్‌బీఆర్)లు, ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్/బీపీటీ)లు, అంతర్గత సంప్‌లకు నీళ్లు చేరుకుంటాయి. ఈ నెల చివరిలోగా ఈ మూడు నియోజకవర్గాలకు నీటి సరఫరా చేసే ట్రయల్‌రన్ ప్రారంభించిన తర్వాత మూడు నెలలపాటు అది కొనసాగుతుంది. మాడెగాంలో శుద్ధి అయిన నీళ్లు నియోజకవర్గాల్లో నిర్మించిన జీఎల్‌బీఆర్‌లు, ఓహెచ్‌బీఆర్‌లు, అంతర్గత సంప్‌ల సామర్థ్యం మేరకు పంపిణీ చేయగలుగుతున్నామా లేదా అన్నది ఈ ట్రయల్‌రన్ ద్వారా అధికారులు నిర్ధారించుకుంటారు. ఈ నీటి పథకాల నుంచి ఈ మూడు నియోజకవర్గాల్లోని 869 ఆవాసాలకు నీటిని సరఫరా చేస్తారు. గ్రామాల్లో ఇంట్రావిలేజ్ నెట్వర్క్ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు జూన్‌లోగా పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఆ తర్వాతే భగీరథ నీళ్లు గ్రామాల్లో ఇంటింటికి చేరే పరిస్థితి ఉంది. గడ్డన్న వాగు వద్ద ఇంటెక్‌వెల్ నిర్మాణం పూర్తయింది. భైంసా వద్ద నిర్మిస్తున్న నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణం 95శాతం పూర్తయింది. ఈ నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ట్రయల్‌రన్ నిర్వహిస్తారు. ముథోల్ నియోకజవర్గానికి శుద్ధ జలం అందుతుంది. ఇక్కడి నుంచి 245 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతుంది.
రూ.1778 కోట్ల అంచన వ్యయంతో...
ఎస్సారెస్పీ, గడ్డన్నవాగు జలాశయాల ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ముథోల్ నియోజకవర్గాలకు శుద్ధ జలం అందించే మిషన్ భగీరథ పనులు రూ.1778 కోట్ల అంచన వ్యయంతో కొనసాగుతున్నాయి. ఈ మార్చి వరకు పూర్తయ్యే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా రెండు ఇంటెక్‌వెల్‌లు నిర్మిస్తుండగా, అందులో సోన్ మండలం లోకల్‌వెల్మల్‌లో ఒకటి, గడ్డన్నవాగు వద్ద మరొకటి నిర్మాణం పూర్తి చేశారు. నీటిశుద్ధి ప్లాంట్లు రెండు నిర్మిస్తుండగా, అందులో దిలావర్‌పూర్ మండలం మాడెగాం వద్ద ఒకటి, భైంసా పట్టణంలో మరొకటి నిర్మిస్తున్నారు. మాడెగాం నుంచి రోజూ 130 మిలియన్ లీటర్లు, భైంసా నుంచి రోజూ 50 మిలియన్ లీటర్లు శుద్ధజలం సరఫరా చేయనున్నారు. ఈ రెండింటి కింద భూస్థాయి బ్యాలెన్సింగ్, ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్గత సంప్‌ల నిర్మాణాలు పూర్తయ్యే దశకు వచ్చాయి. పైపులైన్ పనులు కూడా తుది దశకు వచ్చాయి. ఇంట్రావిలేజ్ నెట్వర్క్ పనులు మాత్రం జూన్ వరకు పూర్తయ్యే పరిస్థితి ఉంది. ప్రధాన గ్రిడ్ నుంచి నీటి పథకాల వరకు నీటిని మాత్రం ఈ ట్రయల్‌రన్ ద్వారా చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
మోటార్లతో పరిశీలన..
లోకల్‌వెల్మల్‌లో ఇంటెక్‌వెల్ వద్ద 1274 హెచ్‌పీ సామర్థ్యం గల ఆరు మోటార్ల ద్వారా నీటిని మాడెగాంలోని నీటి శుద్ది ప్లాంట్‌కు పంపిస్తారు. మాడెగాంలో 1207 హెచ్‌పీ సామర్థ్యం గల ఆరు మోటార్లు, 74 హెచ్‌పీ సామర్థ్యం గల మూడు మోటార్ల ద్వారా ఈ జలాలను శుద్ధి చేస్తారు. అక్కడి నుంచి నీరు ఆదిలాబాద్ జిల్లాకు నేరడిగొండ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో నిర్మించిన భూస్థాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జీఎల్‌బీఆర్)కు చేరుకుంటుంది. గుట్ట ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి నుంచి పైపులైన్‌ల ద్వారా నీరు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేకుండానే ఉపరితల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అంతర్గత సంప్‌లకు సరఫరా చేస్తారు.
ట్రయల్‌రన్‌కు ఏర్పాట్లు..
మిషన్ భగీరథ ద్వారా ఆదిలాబాద్, నిర్మల్, బోథ్ నియోజకవర్గాలకు నీరందించేందుకు ట్రయల్‌రన్‌ను ఈ నెలలో నిర్వహిస్తాం. 15వ తేదీ తర్వాత నిర్మల్‌లో, 25వ తేదీ తర్వాత ఆదిలాబాద్‌లో ట్రయల్‌రన్ నిర్వహించే అవకాశం ఉంది. మాడెగాంలో ఇప్పటికే నీటిశుద్ధి ప్లాంట్‌లో నీటిశుద్ధి జరుగుతుంది. అక్కడి నుంచి ట్రయల్‌రన్ ద్వారా నీటి పథకాల సామర్థ్యం మేరకు రోజు నీరు సరఫరా అవుతుందో లేదో పరిశీలిస్తాం. మూడు నెలలపాటు ట్రయల్‌రన్ చేస్తాం.
– యూఎస్‌ఎన్ మూర్తి, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్
Comments
Please login to add a commentAdd a comment