సాక్షి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులను జిల్లాలో పరుగులు పెట్టిస్తామని చిన్ననీటి పారుదలశాఖ ఎస్‌ఈ వి.లింగరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే జిల్లాలో చెరువులను దత్తత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. పూడిక తీత పనులను నాణ్యంగా చేపడతామని చెప్పారు. జిల్లాలో మిషన్ కాకతీయ పనులు జరుగుతున్న తీరును ‘సాక్షి’కి వివరించారు.
సాక్షి: మిషన్ కాకతీయ పనుల పురోగతి ఎలా ఉంది?
లింగరాజు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 7,369 చెరువులున్నాయి. వీటిలో పెద్ద చెరువులు 586. వీటి కింద 1.5లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. చిన్న చెరువులు 5,696 ఉన్నాయి. వీటికింద 80వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం ఉంది. మిగతావి స్పెక్యులేషన్ చెరువులు, ప్రైవేట్ కుంటలున్నాయి. వీటన్నింటికీ మిషన్ కాకతీయ ద్వారా విడతల వారీగా పనులు చేపట్టి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగినవిధంగా చర్యలు తీసుకుంటున్నాం.
సాక్షి: తొలివిడతలో ఎన్ని చెరువుల పనులు చేపట్టనున్నారు.?
లింగరాజు: ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20శాతం చొప్పున చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించిం ది. అందుకు అనుగుణంగా జిల్లాలో తొలి విడతలో మొత్తం 14,077 చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా పనులు చేపట్టనున్నాం.
సాక్షి: ఇప్పటివరకు ఎన్ని చెరువులకు పరిపాలన అనుమతి లభించింది.
లింగరాజు: మొత్తం 14వేల చెరువుల ఎస్టిమేట్స్ పూర్తిచేశాం. వీటిలో 900 చెరువుల వరకు చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి సబ్‌మిట్ చేశాం. ఇప్పటివరకు 560 చెరువులకు పరిపాలన అనుమతి లభించింది. అందుకు జిల్లా కు రూ.142 కోట్లు విడుదలయ్యాయి.
సాక్షి: మిగతా వాటికి ఎందుకు లభించలేదు? ఏమైనా సమస్యలున్నాయా?
లింగరాజు: అలాంటిదేమీ లేదు. అన్నింటిపై స్క్రూటినీ జరుగుతోంది. ఆర్థిక అనుమతులు పొందాల్సి ఉంటుం ది. ఈ పనులన్నింటికీ దఫాదపాలుగా అనుమతులు వస్తుంటాయి.
సాక్షి: ఈ ఏడాది చేపట్టబోయే చెరువుల పనులకు ఇంకా ఏమేర నిధులు అవసరమవుతాయి?
లింగరాజు: ప్రస్తుతం 560 చెరువుల పనులకు రూ.142 కోట్లు వచ్చాయి. మిగతా చెరువులకు ఇంకా రూ.280 కోట్లు అవసరమయ్యే అవకాశం ఉంది.
సాక్షి: పనుల కోసం టెండర్లు నిర్వహిస్తున్నారా?
లింగరాజు: పరిపాలన అనుమతి లభించిన 560 చెరువులలో ఇప్పటివరకు 80 చెరువులకు టెండర్లు నిర్వహించాం. మిగతా వాటికి త్వరలో నిర్వహిస్తాం.
సాక్షి: పనులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి.
లింగరాజు: ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున పనులు చేపట్టడం లేదు. సమయం దగ్గర పడుతుండడంతో ఇదివరకే ఎన్నికల కమిషన్‌కు మా శాఖ తరఫున లేఖ రాశాం. వారి నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
సాక్షి: చెరువుల దత్తతకు జిల్లాలో అంతగా స్పందన లేనట్లుంది?
లింగరాజు: నిజమే..! ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. చెరువుల దత్తతకు ఎన్నారైలు, ఇతర సంఘాలు తదితర వాళ్లు ముందుకు వస్తారని మేం భావించాం. అయితే జిల్లాలో పెద్దగా స్పందన ఉండడంలేదు. ఇప్పటి వరకు రెండు, మూడుచోట్ల నాలుగైదు చెరువులను తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. ఇంకా ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. అయితే ఇంకా దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సాక్షి: చెరువుల దత్తత కోసం డిపార్ట్‌మెంట్ తరఫున ఏమైనా ప్రచారం చేస్తారా?
లింగరాజు: అందుకోసం కూడా కార్యాచరణ చేపట్టాం. వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నాం. అంతేకాదు గ్రామాల్లో రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమం చేపట్టడంతో పాటు స్కూళ్లలో ప్రచారాలు చేయాలనుకుంటున్నాం.
సాక్షి: చెరువుల్లో తీసిన పూడిక మట్టి రైతులకు ఉపయోగపడేలా ఉందా?
లింగరాజు: పూడిక తీసిన మట్టిని వ్యవసాయ పొలాలకు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈసారి పూడిక తీయనున్న చెరువుల మట్టిని వ్యవసాయశాఖ అధికారులు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథకమికంగా మాకు ఒక రిపోర్టు ఇచ్చారు. అయితే అందులో ఆల్కలీన్, పీహెచ్ అంటూ వారి పరిభాషలో ఉన్నందున... అలా కాకుండా రైతులకు ఉపయోగపడుతుందా? కాదా? అనేది సూటిగా చెప్పాలని సూచించాం.
సాక్షి: ఏమైనా చెరువులు కబ్జాకు గురయ్యాయా?
లింగరాజు: దీనిపై మాకు కచ్చితమైన సమాచారం లేదు. కాకపోతే దీనిపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నాం. చెరువులకు సంబంధించి మా శాఖ ఎఫ్‌టీఎల్ బౌండరీలు పెడుతోంది. వాటికి అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనేది రెవెన్యూశాఖ పరిశీలించి చెప్పాల్సి ఉంటుంది.
సాక్షి: చెరువుల పనులు చేపట్టే కాంట్రాక్టర్లను ఏవిధంగా ఎంపిక చేస్తున్నారు?
లింగరాజు: పనుల ఎంపిక చాలా పారదర్శకంగా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి కంపెనీ కూడా ఆన్‌లైన్ ద్వారా టెండర్లలో పాల్గొనవచ్చు. అయితే కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించి వ్యాట్, ఐటీ, టర్నోవర్, అనుభవం తదితర వాటిని పరిశీలించే అనుమతి ఇస్తాం.
సాక్షి: పనుల నాణ్యతను ఎలా పరిశీలిస్తారు?
లింగరాజు: పనుల నాణ్యతకు సంబంధించి కూడా చాలా పక్కా ప్రణాళికతో వ్యవహరించనున్నాం. రూ.50 లక్షల కన్నా తక్కువ విలువ కలిగిన పనులను ఈఈ మంజూరు చేసి పర్యవేక్షిస్తారు. రూ.50లక్షలు దాటిన పనులను ఎస్‌ఈగా ఉన్న తాను అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని తామే పర్యవేక్షిస్తాం.
సాక్షి: సిబ్బంది కొరత ఏమైనా ఉందా?
లింగరాజు: సిబ్బంది కొరత కాస్త ఇబ్బందిగానే ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు కొందరిని పదవీ విరమణ చేసిన వారిని కూడా విధుల్లోకి తీసుకున్నాం. అయినప్పటికీ ఇంకా 24 మంది ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, టెక్నికల్ స్టాఫ్ కొరత ఉంది.
మిషన్ పరుగులు
Published Sat, Mar 14 2015 1:26 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement