మిషన్ వాటర్‌గ్రిడ్ | mission water grid in telangana | Sakshi
Sakshi News home page

మిషన్ వాటర్‌గ్రిడ్

Published Mon, Jan 5 2015 1:31 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

mission water grid in telangana

* పనులకు ఒకేసారి అనుమతులు   
* ప్రాజెక్టుపై సమీక్షలో కేసీఆర్ వెల్లడి
* ఇన్‌టేక్ బావులు, సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పైపులైన్ల ఏర్పాటు వేగవంతం
* ఫిబ్రవరి నుంచే సమాంతరంగా నిర్మాణ పనులు
* ప్రైవేటు భూముల్లోనూ పైపులైన్లు వేసేందుకు ప్రత్యేక చట్టం.. సత్వర నిర్ణయాల కోసం  సంబంధిత శాఖల కార్యదర్శులతో కమిటీ
* ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
* 25 వేల జనావాసాలకు 56 నీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా 39 టీఎంసీల తాగునీరు
* ప్రతి వ్యక్తికీ గ్రామాల్లో వంద, నగరాల్లో 150 లీటర్లు
* పరిశ్రమల అవసరాలకూ నీటి సరఫరా: కేటీఆర్
* నీటి కేటాయింపులపై ఇరిగేషన్ శాఖ కసరత్తు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఆటంకాలు ఏర్పడకుండా సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ ఒకేసారి అన్ని అనుమతులను(బ్లాంకెట్ పర్మిషన్లు) ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలిక్ పనులు, ఇన్‌టేక్ వెల్స్(బావుల) నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు వంటి వాటికి ప్రభుత్వమే ఏకమొత్తంగా అనుమతులు ఇస్తుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లోనూ విద్యుత్ లైన్లు, పైపులైన్ల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు.

వాటర్‌గ్రిడ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో ఇన్‌టేక్ బావులను నిర్మించాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే నెలలోనే నిర్మాణం చేపట్టి వేసవిలోగా వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ బావుల నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను అందించే పనులను కూడా సమాంతరంగా చేపట్టాలని విద్యుత్‌శాఖ వర్గాలకు నిర్దేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే నిమిత్తం సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లోని హోటల్ గ్రాండ్ కాకతీయలో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావుతో పాటు అటవీ, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పురపాలక, రెవెన్యూ, నీటి పారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన పనులు, అవి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ఈ సందర్భంగా సీఎం స్పష్టతనిచ్చారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని, ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు ఇవ్వడం కోసం చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును దేశంలోనే మేటిగా నిలిపేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ఆయాశాఖల మంత్రులు, ఉన్నతాధికారులు తమ కు అప్పగించిన బాధ్యతలను, చేయాల్సిన పనులను సోమవారం నుంచే ప్రారంభించాలని చెప్పా రు. ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు రాలేదన్న కారణంతో వాటర్‌గ్రిడ్ పనులను ఆపొద్దని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు తెలి పారు. అనుమతుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలను సీఎం ఆదేశించారు.

రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్ చట్టం
ప్రైవేటు భూముల్లోనూ పైపులైన్లు వేయడం కోసం రైట్ ఆఫ్ వే..రైట్ ఆఫ్ యూజ్(ఆర్‌డబ్ల్యుఆర్‌యూ) చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తోం దని, చట్టం అమలు కోసం ఆర్డినెన్స్ తేనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. కాగా, ఇన్‌టేక్ వెల్స్, సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రాజెక్టుల వద్ద స్థలం అప్పగించేందుకు నీటి పారుదల శాఖ సంసిద్ధత వ్యక్తం చే సింది. విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి, పంపింగ్, లిఫ్టింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ కోసం అవసరమయ్యే విద్యుత్‌ను అందించేందుకు విద్యుత్ శాఖాధికారులు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. కరెంట్ స్తంభాల ఏర్పాటుకు కూడా రైట్ ఆఫ్ వే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కూడా ఏకమొత్తంగా అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. ఒకే ఉత్తర్వుతో అనుమతులు వస్తాయని, విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా సబ్‌స్టేషన్లకు ప్రత్యేక సరఫరా లైన్లు వేయాలని నిర్దేశించారు.

ఇక వాటర్‌గ్రిడ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 56 నీటి శుద్ధి ప్లాంట్లను ప్రభుత్వం నిర్మించనుంది. వరంగల్ జిల్లాలోని జనగాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, నల్గొండ జిల్లాలోని భువనగరి, ఆలేరు, మెదక్ జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గాలకు ఎల్లంపల్లి నుంచి మంచినీటిని అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. గ్రిడ్‌కు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి త్వరలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. గ్రిడ్ పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖల కార్యదర్శులతో కమిటీని వేయనున్నట్లు చెప్పారు.

గర్వ పడుతున్నాం: మంత్రి కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా 25 వేల జనావాసాలకు జీవ నదుల నుంచి సురక్షితమైన మంచినీటిని అందించే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం చేపట్టినందుకు గర్వపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 29 నీటి వనరుల నుంచి 26 సెగ్మెంట్లకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఇందుకోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు.

క్షేత్రస్థాయిలో ఆయా విభాగాల అధికారులకు అవగాహన కల్పించేందుకు కూడా త్వరలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల మంచినీరు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని కూడా వాటర్‌గ్రిడ్ ద్వారా అందిస్తామన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

నీటి కేటాయింపులపై కసరత్తు
వాటర్‌గ్రిడ్ పథకానికి నీటి కేటాయింపుల విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం నివేదించిన గణాంకాలపై నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోం ది. వివిధ ప్రాజెక్టుల నుంచి అందించాల్సిన నీటి లెక్కలను పరిశీలి స్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీల నీటిని ఇవ్వాలన్న ప్రతి పాదనను ఆశాఖ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

24 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే ఎన్టీపీసీ, పరిశ్రమలు, తాగునీటి అవసరాల కోసం 8 టీఎంసీలను కేటాయించిన దృష్ట్యా వాటర్‌గ్రిడ్‌కు 3 టీఎంసీల వరకే ఇవ్వగలమని చెబుతోంది. పక్కనే ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీలు వాడుకోవచ్చునని ప్రతిపాదిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement