
జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని వీడాలనీ అంబర్‌పేట నియోజక వర్గం ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులను హెచ్చరించారు. నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా నత్త నడకన సాగుతున్నాయని... వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆదివారం పాత నల్లకుంట ప్రాంతంలో కిషన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో కలసి పాదయాత్ర చేశారు. బస్తీలు, కాలనీల్లో ఎక్కడ చూసినా తవ్విన రోడ్లే దర్శనమివ్వడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లకు ప్యాచ్‌వర్క్స్ చేపట్టడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కలుషిత నీటిపై ప్రజలు ఫిర్యాదు చేయగా తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, పరిశుద్ధమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ స్థానిక నేతలు పలువురు కూడా ఉన్నారు.