హైదరాబాద్ శివార్లలో మొబైల్ హబ్ ఏర్పాటు : కేటీఆర్
హైదరాబాద్ (మేడ్చల్) : హైదరాబాద్ శివార్లలో మొబైల్ హబ్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ పారిశ్రామికవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్‌కాన్ మొబైల్ తయారీ కంపెనీ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పారిశ్రామిక పాలసీతో తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
హైదరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమ కేవలం గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలకే పరిమితం కాదని ఆ రంగాన్ని నగరం నలుమూలలకు విస్తరింపచేస్తామన్నారు. దేశంలో కోట్ల మంది సెల్ ఫోన్‌లు వాడుతున్నా దేశీయ మొబైల్ కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పారిశ్రామిక పాలసీలతో సెల్‌కాన్ మొబైల్ సంస్థ దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా మేడ్చల్లో సెల్ఫోన్ల తయారీ పరిశ్రమను స్థాపించడం హర్షణీయమని మంత్రి తెలిపారు.
మరిన్ని సెల్‌ఫోన్ సంస్థలను తెలంగాణలో స్ధాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్‌తో చర్చలు జరుపుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలు తెలంగాణలో ఏర్పాటు చేయుడం వల్ల తక్కువ విద్యార్హతలు ఉన్నవారికి సైతం ఉపాధి దొరుకుతుందని అన్నారు. సెల్‌కాన్ మొబైల్ సంస్ధ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళి రేతినేని మాట్లాడుతూ ప్రస్తుతం మేడ్చల్ పరిశ్రమ ద్వారా రెండు లక్షల ఫోన్‌లను ఉత్పత్తి చేస్తామని, నెలకు 10లక్షల మొబైల్‌లు ఉత్పత్తి చేసే విధంగా కంపెనీని అభివృద్ధి చేస్తామని అన్నారు.