రాష్ట్రంలో మొబైల్ తయారీ హబ్
రెండు లక్షల మందికి ఉపాధి ఖాయం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొబైల్ తయారీ హబ్ ఏర్పాటు ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి దక్కుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తైవాన్‌కు చెందిన ఫ్యాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ప్రెసిడెంట్ కాల్విన్ చిన్, ఫిహ్ మొబైల్ లిమిటెడ్ చైర్మన్ విన్సెంట్ టాంగ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ వారితో అన్నారు.
పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే పారిశ్రామిక విధానం వల్ల ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో మొబైల్ తయారీ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక సెల్‌ఫోన్ తయారీ సంస్థల ప్రతినిధులు తమ యూనిట్లను తెలంగాణలో స్థాపించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మొబైల్ తయారీ హబ్‌కు అనువైన స్థలం కేటాయించడంతో పాటు, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలని తైవాన్ ప్రతినిధులను కేసీఆర్ కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న టీఎస్ ఐపాస్ చట్టం ఉదాత్తంగా ఉందని, తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐఫోన్ లాంటి అత్యాధునిక ఫోన్లను తయారు చేసే తమ కంపెనీ హైదరాబాద్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తైవాన్ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు.