
మో‘డల్’..!
సాక్షి, మహబూబ్‌నగర్:
జిల్లాలో మోడల్‌స్కూళ్ల నిర్వాహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ పాఠశాలలు కనీస సదుపాయాలకు నోచుకోక కూనరిల్లుతున్నాయి. ఇంగ్లిష్ మీడియంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించే సరికి తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. విద్యార్థులు కూడా చేరేందుకు ఆసక్తిచూపారు. తీరా ప్రారంభ మయ్యాక అసలు విషయం బోధపడింది. ప్రస్తుతం మోడల్‌స్కూళ్ల నిర్వహణ తీరును చూసి నిరాశచెందుతున్నారు. విద్యాపరంగా వెనుకబడిన జిల్లాపట్ల ప్రత్యేకశ్రద్ధ చూపుతామని ప్రభుత్వాలు హామీలు గుప్పిస్తున్నా.. ఆచరణలో అమలుకావడం లేదు. మోడల్‌స్కూళ్ల నిర్వహణలో కూడా ఇదే తేటతెల్లమైంది. జిల్లాలో 64 మండలాలకు మొదటి, రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు 47స్కూళ్లు మంజూరయ్యాయి.
అయితే వీటిలో కోస్గి, వెల్దండ, ధన్వాడ, కొత్తకోట, కోడేర్, పెబ్బేర్, ఖిల్లాఘనపూర్ మండలాల్లో మాత్రమే తరగతులు ప్రారంభమైనా..హాస్టల్ వసతిలేదు. దీంతో విద్యార్థులు స్వస్థలాల నుంచి రావడమో లేక అద్దెగదులు తీసుకునో చదువులు సాగిస్తున్నారు. ఇక మిగతా 40 స్కూళ్ల పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే చందంగా మారింది. అచ్చంపేట, ఆమనగల్లు, అమ్రాబాద్, దామరగిద్ద, దేవరకద్ర, దౌల్తాబాద్, ఫరూఖ్‌నగర్, అయిజ, మద్దూరు, మాగనూరు, మహబూబ్‌నగర్, మక్తల్, పాన్‌గల్, పెద్దకొత్తపల్లి, తాడూర్, ఊట్కూరు, వనపర్తి మండలాల్లో స్కూలు నిర్మాణం కోసం కనీసం స్థలాన్ని కూడా సేకరించలేదు.
పిల్లలున్నా.. పంతుళ్లు లేరాయే?
కొత్తగా ఏర్పాటుచేసిన మోడల్‌స్కూళ్లలో విద్యార్థులు భారీసంఖ్యలో చేరారు. ఒక్కోతరగతిలో ప్రభుత్వ నిర్దే శం మేరకు 80 మంది విద్యార్థులు చేరారు. ఉపాధ్యాయ ల కొరత కారణంగా తరగతులు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఏడు స్కూ ళ్లలో రెండింటికీ పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్ లేరు. అధ్యాపకుల విషయానికొస్తే మంజూరైన వాటిలో సగం వరకు ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఏడు స్కూళ్లకు పీజీటీ, టీజీ టీ మొత్తం 140 పోస్టులు మంజూరుకాగా, అందులో 67 ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా చూస్తే తెలుగు 13, ఇంగ్లిషు 16, హిందీ 6, గణితం 14, సైన్స్ 10, సోషల్ 8 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు కూడా చదువుప ట్ల నిరాశ చెందుతున్నారు. తరగతులు సక్రమంగా సాగకపోవడంతో చాలామంది విద్యార్థులు టీసీలు తీసుకుని ఇంటిబాట పడుతున్నారు. ఇటీవల వెల్దండ మోడల్ స్కూల్ నుంచి నలుగురు విద్యార్థులు టీసీ తీసుకువెళ్లా రు. మిగతా స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులు వెళ్లిపోగా మిగిలిన ఖాళీలను ఎలా భర్తీచేయాలో తెలియక రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్ ఏ) అధికారులకు అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.