ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ | modern information system outer | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ

Published Sun, Jul 6 2014 11:43 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

modern information system outer

సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ రహదారిపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనదారులు ఆ మార్గంలో ట్రాఫిక్, వాతావరణం తదితర పరిస్థితులను తెలుసుకొనేందుకు వీలుగా ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ ఏర్పాటు కానుంది. ఔటర్‌పై 19 జంక్షన్ల (ఇంటర్ ఛేంజెస్)లో రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల కోసం హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఇటీవల టెండర్లు ఆహ్వానించింది.

 వీటిని రెండ్రోజుల క్రితం తెరిచారు. ఎల్‌అండ్‌టీ, ఈఎఫ్‌సీఓఎన్ సంస్థల నుంచి రెండు బిడ్స్ దాఖలయ్యాయి. వీలైనంత త్వరలో సాంకేతిక ప్రక్రియను పూర్తిచేసి, రుణదాత జైకా అనుమతి తీసుకొన్నాక ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో పూర్తిచేసి 2014 నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుపై 20 జంక్షన్లకు గాను 19 చోట్ల ఈ ఆధునిక సమాచార వ్యవస్థను 18 నెలల వ్యవధిలో నిర్మించి, అయిదేళ్ల పాటు నిర్వహించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. కాంట్రాక్టు సంస్థ ఖరారయ్యాక లక్ష్యాల మేరకు పనులు జరిగితే... ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ 2016లో అందుబాటులోకి రానుంది.

 కళ్ల ముందే సమాచారం
 ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అమల్లో ఉంది

 ఔటర్‌పై ఇది అందుబాటులోకి వస్తే నిర్ణీత కిలోమీటర్ల పరిధిలో తాము వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్థితిగతుల గురించి వాహనచోదకులు ముందే తెలుసుకోవచ్చు

 ప్రయాణించే మార్గంలో రద్దీ, రోడ్డుపై తవ్వకాలు లేదా ప్రమాదాలు, అలాగే వర్షం నీరు నిలిచినా, పొగమంచు కమ్ముకున్నా.. వెంటనే ఆ వివరాలు తెలుస్తాయి

 19 జంక్షన్లలో సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ఈసీబీ)లు, ఆటోమాటిక్ వెహికల్ క్లాసిఫయర్ కం కౌంటర్ (ఏబీసీసీ), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు, లార్జ్ డిస్‌ప్లే స్క్రీన్, నానక్‌గూడలో ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, కంప్యూటర్-ఎలక్ట్రానిక్-కమ్యూనికేషన్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తారు

 ప్రతి జంక్షన్‌కు 1 కి.మీ. ముందుగానే వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డు ఉంటుంది. దీనిపై ఎప్పటికప్పుడు ఔటర్‌పై ట్రాఫిక్, రోడ్డు, వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే ద్వారా ప్రదర్శిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement