సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే రెండు ప్రధాన జాతీయ పార్టీల అగ్రనేతలు రాష్ట్రానికి వస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. అలాగే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ సోమవారం మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌లలో జరిగే కాంగ్రెస్ ప్రచార సభలకు ఆయన హాజరవుతున్నారు. జహీరాబాద్ సభా వేదికగా పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను కూడా రాహుల్ వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధాని సభకు భారీగా జనసమీకరణ ఏర్పాట్లు...
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకునే ఆయన 5 గంటలకు సభాస్థలికి వస్తారని, ఆయన ప్రసంగం 5:30 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సభ కోసం భారీ ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సభ సాయంత్రం 4 గంటలకే ప్రారంభం కానుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు పార్టీ రాష్ట్ర నాయకులు, ఆ తర్వాత లక్ష్మణ్, దత్తాత్రేయ, రాజాసింగ్, రాంచంద్రరావు, కిషన్‌రెడ్డి తదితరులు ప్రసంగించిన తర్వాత మోదీ సందేశం ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాహుల్ పర్యటన ఇలా...
సోమవారం జరిగే మూడు బహిరంగ సభలకు హాజరయ్యేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి 8:40 నిమిషాలకు శంషాబాద్‌కు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతోపాటు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి, మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్‌లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా హోటల్‌కు చేరుకొని రాత్రి భోజనం అనంతరం విశ్రాంతి తీసుకున్నారు.
రాహుల్ బస ఏర్పాట్లను టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పర్యవేక్షించారు. టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ లోక్‌సభ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆదివారం రాత్రి హోటల్‌కు చేరుకొని రాహుల్‌ను కలిశారు. సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాహుల్ జహీరాబాద్ బహిరంగ సభకు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి సైతం పాల్గొననున్నారు.
జహీరాబాద్‌లో సభను ముగించుకొని మళ్లీ హెలికాప్టర్ ద్వారా రాహుల్ వనపర్తికి చేరుకుంటారు. అక్కడ 1:40 గంటలకు జరిగే బహిరంగ సభలో భట్టి విక్రమార్కతో కలసి పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్ ద్వారానే హుజూర్‌నగర్ సభకు వెళ్లి సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో ఉత్తమ్‌తో కలసి పాల్గొంటారు. సాయం త్రం 5:15కి అక్కడి నుంచి బయలుదేరి 5:50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment