మంకీ గన్ తయారీ విధానాన్ని వివరిస్తున్న విద్యార్థి
సాక్షి, తొర్రూరు: పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టించి రూ.లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు రైతులు అనేక కష్టాలు పడుతుంటారు. కొంత మంది రైతులు పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు కొండెంగలను సైతం కొనుగోలు చేశారు. ప్రతి రోజు కొండెంగను తమ పంట పొలాల వద్దకు తీసుకెళ్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ కొండెంగలను సైతం ఎదిరించి పంటలను సర్వ నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో తొర్రూరులోని లిటిల్ ప్లవర్ స్కూల్‌కు చెందిన కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు పంట పొలాలను కోతుల బెడత నుంచి కాపాడుకునేందుకు పడుతున్న కష్టాన్ని చూసి తుపాకీ తరహాలో పెద్ద శబ్ధం వచ్చేలా మంకీ గన్( మంకీ స్కారర్)ను తయారు చేశారు. దాని నుంచి వచ్చే శబ్ధంతో పంట పొలాల నుంచి కోతులు పరారవుతున్నాయి. దీంతో విద్యార్థులను పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు రైతులు అభినందిస్తున్నారు.
రూ.200 ఖర్చుతోనే..
ఐదు ఫీట్లు ఉండే రెండు రకాల ప్లాస్టిక్ పైపులతో ఈ తుపాకీ(మంకీ స్కారర్)ని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు తయారు చేశారు. ప్లాస్టిక్ పైపులు, ఒక లైటర్‌తో కేవలం రూ.200 ఖర్చుతో సుమారు 50 తుపాకులను తయారు చేశారు. కార్బైడ్ అనే 10 గ్రాముల కెమికల్, 10 మిల్లీలీటర్ల వాటర్‌ను కలిపి లైటర్‌తో నెట్టడంతో ఈ మంకీ గన్ పేలి పెద్ద శబ్ధం వస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న కోతులు వెళ్లిపోయే అవకాశం ఏర్పడుతుంది.
రైతులకు ఉచితంగా అందిస్తాం
పంటలను కోతుల బెడద నుంచి కాపాడేందుకు విద్యార్థులు తయారు చేస్తున్న మంకీ స్కారర్లను ఈ ప్రాంత రైతులకు ఉచితంగా అందిస్తాం. విద్యార్థులు ఇలాంటి ప్రయోగాలు చేసి విజయవంతం అవడం అభినందనీయం. మండలంలోని ఏ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందో గుర్తించి రైతులకు మంకీ స్యారర్లను అందిస్తాం.
– అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, స్కూల్ కరస్పాండెంట్
Comments
Please login to add a commentAdd a comment