అయ్యో పాపం!
కుటుంబ కలహాలకు తల్లీబిడ్డ బలి
కుటుంబ కలహాలకు తల్లీబిడ్డ బలి
మృతురాలి మరిది, తోటికోడలుపై కేసు
పరారీలో నిందితులు
తాండూరు రూరల్ :క్షణికావేశం తల్లీబిడ్డల ప్రాణాలు తీసింది. ధాన్యం విషయంలో మరిది, తోటికోడలు మందలించారిని మనస్తాపంతో ఓ ఇల్లాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే మంటలు ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారికి వ్యాపించడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృత్యువాత పడింది.
ఈ సంఘటన మండలంలోని అంతారం గ్రామంలో గురువారం రాత్రి పొద్దుపోయాక చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ నాగార్జున కథనం ప్రకారం.. యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన జోగు రత్నప్ప మూడో కుమార్తె సుక్కమ్మ (30)ను తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన నక్కల రాములుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇంత కాలం పిల్లలు పుట్టలేదు.
కాగా ఎనిమిది నెలల క్రితం చిన్నారి జన్మించింది. కాగా.. నక్కల రాములు అతడి సోదరుడు వీరేందర్‌ల మధ్య పొలం, ఇంటి విషయమై గొడవలు ఉన్నాయి. ఇదే విషయమై తరచూ ఘర్షణ పడేవారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ధాన్యం విషయంలో రాములు, సుక్కమ్మ - వీరేందర్, లక్ష్మి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వీరేందర్, లక్ష్మి దంపతులు సుక్కమ్మను తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సుక్కమ్మ ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించుకుని ఒం టిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అయితే అప్పటికే ఇంట్లో మం చంపైనే ఉన్న పాప సౌజన్య (8 నెలలు) కు కూడా మంటలు వ్యాపించాయి.
స్థానికులు సుక్కమ్మ కేకలు విని ఇంటి తలుపులు పగులగొట్టి తీవ్రగాయాలైన తల్లీకూతుళ్లను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సుక్కమ్మ అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మృతి చెందింది. శనివారం ఉదయం ఆ రు గంటల ప్రాంతంలో చిన్నారి కూడా మృతి చెందింది.
తల్లీకూతుళ్లు ఇద్దరూ మృతి చెందడంతో అంతారం గ్రామం లో విషాధచాయలు అలుముకున్నాయి. మృతురాలి అక్క దండు అమృతప్ప ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగార్జున తెలి పారు. కాగా వీరేందర్, లక్ష్మీ దంపతులు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అప్పుడే నూరేళ్లు నిండాయా?
‘లేక లేక పుట్టిన నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా పెరుగుతున్న సౌజన్యను కుటుంబ కలహాలు బలితీసుకోవడంపై గ్రామస్తులను కలచివేసింది.