
అజయ్, లత(ఫైల్)
కొడుకు బాగా చదువుకుని ప్రయోజకుడవుతాడని కలలు కంది ఆ తల్లి...చెట్టంత ఎదిగిన కొడుకును చూసి ఎంతగానో మురిసిపోయింది.
మూడు నెలల క్రితం కుమారుడి ఆత్మహత్య
అప్పటి నుంచి తల్లడిల్లుతున్న తల్లి
బెంగతో చనిపోయిన మాతృమూర్తి
కామారెడ్డి : కొడుకు బాగా చదువుకుని ప్రయోజకుడవుతాడని కలలు కంది ఆ తల్లి...చెట్టంత ఎదిగిన కొడుకును చూసి ఎంతగానో మురిసిపోయింది. కుటుంబానికి చేదోడు వాదో డుగా ఉంటాడని, ఇక నుంచి తమ కష్టాలు తీరుతాయనుకుంది. కానీ, హఠాత్తుగా కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కొడుకు చనిపోయిననాటి నుంచి బెంగతో నిద్రాహారాలు మాని మంచం పట్టింది. చివరకు తను కూడా చివరి శ్వాస విడిచి కొడుకును వెతుకుతూ వెళ్లిపోయింది. హృదయాలను కలిచివేసిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చీపురు శ్రీనివాస్, లత దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు అజయ్. ఇంటర్మీడియేట్ తర్వాత హోటల్ మేనెజ్‌మెంట్ చదవాలని ఆశించాడు.
తనకు అంత స్థొమత లేదని, డిగ్రీ చదవాలని తండ్రి చెప్పడంతో మానసిక వేదనకు గురైన అజయ్ గత ఆగస్టు ఐదున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఒక్కగానొక్క కొ డుకు మృతి చెందడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి తిండి, తిప్పలు మానేసింది. ఎవరు ఎంత ధైర్యం చెప్పినా కొడుకు కావాలంటూ ఏడ్చేది. మూడు నెలలుగా ఏ పనిచేయకుండా కొడుకు ఫొటోను చూస్తూనే గడిపింది. అతడి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యేది. అదే బెంగతో మంచం పట్టిన ల త శుక్రవారం తుది శ్వాస విడిచింది. కొడుకు లేకపోవడంతో భర్త శ్రీనివాస్ ఆమెకు తలకొరివి పెట్టాడు. ఇది చూసి గ్రామస్తులు చలించిపోయి కంటతడిపెట్టారు.