
తల్లే చంపింది!
►మిస్టరీ వీడిన అక్కంపల్లి చిన్నారి హత్య కేసు
►గుప్త నిధుల కోసమే ‘పూజ’ హత్య
►కన్న కూతురినే బలి ఇవ్వడానికి ఒప్పుకొన్న తల్లి
►దొరకబోయే నిధుల పంపకాల్లో తేడాలు రావడంతో బెడిసిన పన్నాగం
►నిందితురాలు తల్లితోపాటు మరో ఇద్దరి ప్రమేయం
►వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ
అనుమానమే నిజమైంది. చిన్నారి పూజను తల్లే మరో ఇద్దరితో కలిసి హతమార్చిందని తేలింది. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో గత నెల 23న గుప్తనిధుల కోసం చిన్నారి పూజను బలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు మిస్టరీని మంగళవారం ఛేదించారు. వివాహేతర సంబంధం, గుప్తనిధుల నేపథ్యంలోనే పూజను హత్యచేసినట్టు గుర్తించా రు. ఇందులో పాల్గొన్న ముగ్గుర్నీ అరెస్టు చేశారు.
యాలాల: మానవత్వాన్ని మంటగలిపిందో తల్లి. గుప్త నిధుల కోసం కన్న కూతురినే బలిచ్చింది. దొరకబోయే నిధుల్లో వాటా విషయమై తేడాలు రావడంతో.. బండారం బయటపడుతుందని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి చివరకు అడ్డంగా దొరికిపోయింది.గత నెల 23న మండల పరిధిలోని అక్కంపల్లిలో జరిగినచిన్నారి హత్య కేసు మిస్టరీృ పోలీసులు ఛేదించారు. ఈ ఘటన లో ప్రధాన నిందితురాలితో పాటు మరో ఇద్దరు నిందితులను మంగళవారం రూరల్‌సీఐ శివశంకర్ విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు.
ఈ ఘటనకు సంబందించిన రూరల్ సీఐ కథనం ప్రకారం.. అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పల లక్ష్మికి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన భీములుతో వివాహం జరిగింది. వీరికి పూజ(1) పుట్టిన అనంతరం లక్ష్మిని భీములు వదిలేశాడు. ఇక అప్పటినుంచి అక్కంపల్లిలోనే లక్ష్మి నివసిస్తోంది. ఇటీవల ఆమె అక్క పద్మమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో అదే ఇంటో లక్ష్మి ఉంటోంది.
ఇదిలావుండగా మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం రేగడి మైలారం గ్రామానికి చెందిన మైలారం నర్సిములు అక్కంపల్లికి చెందిన ఘనాపురం భీమమ్మను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకొని ఇల్లరికం వచాృడు. ఈ క్రమంలో నర్సిములు, లక్ష్మి మధ్య వివాహేతర సంబంధం నెలకొంది. అయితే నర్సిములు ఎప్పుడూ గుప్తనిధులు, మంత్రాలు, తంత్రాలు అంటూ తిరిగేవాడు. కాగా లక్ష్మి నివసిస్తున్న ఇంటి సమీపంలో గుప్త నిధులున్నాయని, వాటిని బయటకు తీద్దామని నర్సిములు ఆమెను ఒప్పించాడు.
ఇక దీనికోసం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన సోమనాథ్‌స్వామి సహాయానిృ తీసుకున్నారు. గత నెల 22న లక్ష్మి ఇంటికి వచ్చిన నర్సిములు, సోమనాథ్‌స్వామిలు రాత్రివేళ ఇంటి సమీపంలో ముగ్గులు వేయాలని చెప్పారు. అంతేకాకుండా గుప్త నిధుల కోసం నరబలి అవసరమని సోమనాథ్ పేర్కొనడంతో ఇంట్లో నిద్రిస్తున్న పూజ(1)ను బలికి సిద్ధం చేశారు. నర్సిములు తన వద్ద ఉన్న మొలతాడుతో పాప గొంతు నలుమి హత్యచేశాడు. పూజను హత్య చేసే సమయంలో లక్ష్మి కూడా వారికి సహకరించింది.
దొరకబోయే నిధి పంపకాల్లో తేడాలు రావడంతో..
కాగా పూజను హత్య చేసిన అనంతరం ముగ్గురు నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో ఇంటి సమీపంలో పూజలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో వెలికితీయబోయే నిధుల్లో వాటాల గురించి ముగ్గురు వాదోపవాదాలు చేసుకున్నారు. దీంతో ముగ్గురి మద్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఎలాగైన విషయం బయటకు పొక్కుతుందనే భావంతో నర్సిములు, సోమనాథ్‌లు అక్కడి నుంచి పరారయ్యారు. అదే సమయంలో గ్రామానికి చెందిన కొందరూ అటువైపు బహిర్భూమికి రావడంతో లక్ష్మి కూడ ఇంట్లోకి వచ్చింది.
తాను చేసిన తప్పును ఎలా కప్పి పుచ్చుకోవాలనే ఆలోచనతో మరుసటి రోజు కొత్త ‘కథ’ను పోలీసులు, గ్రామస్తులకు తెలియజేసింది. ఘటన అనంతరం పొంతనలేని లక్ష్మి మాటలతో అనుమానించిన పోలీసులు నర్సిములు, సోమనాథ్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. అక్కంపల్లి గ్రామంలో మూఢనమ్మకాలపై కళజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో యాలాల ఎస్‌ఐ విజయభాస్కర్ ఉన్నారు.