
కన్నతల్లే.. కడతేర్చింది
చంపేసి బావిలో పడేసిన వైనం
ఆర్థిక ఇబ్బందులే కారణంటున్న నిందితురాలు
అదృశ్యమైందని నాటకం.. పోలీసులకు ఫిర్యాదు
బావిలోంచి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
పూడూరు మండల కేంద్రంలో ఘటన
పూడూరు : కన్నతల్లే.. కడతేర్చింది. ఆర్థిక ఇబ్బందులతో సాకలేనని అభంశుభం తెలియని ఏడాది చిన్నారిని చంపేసి బావిలో పడేసింది. పాప అదృశ్యమైందని నాటకమాడి చివరకు పోలీసులకు పట్టుబడింది. చిన్నారి అదృశ్యం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పూడూరు మండల కేంద్రంలో ఈనెల 24 ఏడాది పాప అదృశ్యమైన విషయం తెలిసందే. చేవెళ్ల సీఐ ఉపేందర్, చన్గోముల్ ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల కేంద్రానికి చెందిన మాసగళ్ల శ్రీనివాస్, అనురాధ దంపతులు. వీరికి కుమార్తెలు శ్రీజ(5), శ్రీహనీ(1) ఉన్నారు. శ్రీనివాస్ ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈనెల 24న ఇంట్లో పాలుపడుతూ తాను నిద్రించగా చిన్న కూతురు అదృశ్యమైందని అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటి నుంచి పోలీసులకు కుటుంబీకులపైనే అనుమానం ఉంది. శ్రీహనీని తల్లి అనురాధనే చంపేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అనురాధ తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. ఈమేరకు తానే కూతురు శ్రీహనీని చంపేసి బావిలో పడేశానని ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది.
ఆడపిల్ల.. సాకలేక..
ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో సాకలేక ఈనెల 24న రాత్రి తన చిన్న కూతురు శ్రీహనీని చంపేసి గ్రామ సమీపంలోని బావిలో పడేసినట్లు మృతురాలి తల్లి అనురాధ నేరం అంగీకరించింది. ఆదివారం ఉదయం పోలీసులు స్థానికుల సాయంతో బావిలోంచి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అంత్యక్రియల అనంతరం నిందితురాలు అనురాధను అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలిస్తామని సీఐ ఉపేందర్ తెలిపారు.
కాగా.. అనురాధ చెప్పే వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. తాను తాగిన మత్తులో ఉన్నానని ఏం జరిగిందో తెలియదని అనురాధ ఓసారి చెప్పింది. ఆడపిల్ల.. ఆర్థిక ఇబ్బందులతేనే కూతురును సాకలేక చంపేసి బావిలో పడేశానని మరోమారు నిందితురాలు తెలిపింది. కాగా కొన్నేళ్ల క్రితం అనురాధ తండ్రి చంద్రయ్య హత్యకు గురయ్యాడు. ఈకేసులో చంద్రయ్య భార్య పోచమ్మ, కూతురు అనురాధ, అల్లుడు శ్రీనివాస్ నిందితులు.
చేతులెట్ల వచ్చినయ్..
అభంశుభం ఎరుగని చిన్నారి శ్రీహనీ కన్నతల్లి చేతుల్లో హత్యకు గురవడంతో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కన్నపేగును చిదిమేయడానికి తల్లికి చేతులెట్ల వచ్చినయ్.. అంటూ అనురాధపై మండిపడ్డారు. సంఘటనా స్థలంలో గ్రామస్తులు పెద్దఎత్తున గుమిగూడారు. చిన్నారి మృతదేహాన్ని చూసి ‘అయ్యో.. పాపం’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. కూతురు చంపేసిన అనురాధను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. గ్రామంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.