‘అమ్మ’కానికి పసిబిడ్డ | A Mother Selling her Son In Drunk | Sakshi
Sakshi News home page

‘అమ్మ’కానికి పసిబిడ్డ

Published Wed, Aug 14 2019 1:30 AM | Last Updated on Wed, Aug 14 2019 3:33 AM

A Mother Selling her Son In Drunk - Sakshi

వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో సుజాత, ఆమె ఒడిలో బాబు

కాజీపేట అర్బన్‌: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే మద్యం మత్తులో 8 నెలల బాబును వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు యత్నించింది. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వరంగల్‌ బస్టాండ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. జనగామ జిల్లా పెంబర్తిలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ సహజీవనం సాగిస్తున్న పెన్నింటి లింగం, సుజాతలకు 8 నెలల క్రితం ఓ బాబు పుట్టాడు. అప్పటికే లింగంకు మరో మహిళతో వివాహం జరగగా వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో సుజాత, లింగంల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా సుజాత మద్యానికి బానిసైంది. ఆదివారం అతిగా మద్యం సేవించడంతో సుజాతపై లింగం చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సుజాత సోమవారం పెంబర్తి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కి వరంగల్‌ రైల్వే స్టేషన్‌ కు చేరుకుంది.

ఆ తర్వాత స్టేషన్‌ ఎదురుగా ఉన్న బస్టాండ్‌కు చేరుకున్న ఆమె మద్యం మత్తులో నిద్రించగా 8 నెలల బాబు ఏడుస్తున్నా పట్టించుకోలేదు. రెండ్రోజులుగా చంటి బిడ్డతో బస్టాండ్‌లో ఉన్న సుజాతను గస్తీ పోలీసు సిబ్బంది గమనిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయం ఆమె తన బాబును రూ. వెయ్యికి విక్రయించేందుకు యత్నిస్తుండగా వారు అడ్డుకుని సీడబ్ల్యూసీ అధికారులకు అప్పజెప్పారు. సీడబ్ల్యూసీ అధికారులు ఐసీపీఎస్‌ అధికారుల సౌజన్యంతో హన్మకొండలోని బాలరక్ష భవన్‌కు సుజాత, బాబును తరలించారు. భర్త లింగంకు సమాచారం అందించి, కౌన్సెలింగ్‌ అనంతరం స్వధార్‌ హోంకు తరలించారు. సహజీవనం చేస్తున్న సుజాత, లింగంలను ఒక్కటి చేశారు. ఈ విషయంపై ఇంతేజార్‌గంజ్‌ సీఐ శ్రీధర్‌ మాట్లాడుతూ.. సుజాత తన బిడ్డను రూ. 1,000కి అమ్మకానికి పెట్టిందనేది అవాస్తవమని, ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్టాండ్‌లో ఉంటే ప్రయాణికులే ఇదంతా సృష్టించారన్నారు. మానసిక స్థితి సరిలేక, భర్త కొట్టడం వల్ల మనోవేదనకు గురైన సుజాత సరిగా సమాధానం చెప్పడం లేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement