కేసీఆర్‌ను కలిసిన మోత్కుపల్లి
యాదాద్రి : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కలిసి తన కుమార్తె నిహారిక వివాహానికి హాజరుకావాలని లగ్నపత్రిక అందజేశారు. తెలుగుదేశం ఆవిర్భావంలో ఒకే పార్టీలో అత్యంత ప్రియమిత్రులుగా ఉన్న మోత్కుపల్లి, కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత వివాహ పత్రిక సందర్భంగా కలవడం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. లగ్నపత్రికతో తన నివాసం ప్రగతిభవన్ కు వచ్చిన చిరకాల మిత్రులు మోత్కుపల్లిని కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నవారందరినీ బయటకు పంపించి సుమారు గంటన్నరపాటు పలు అంశాలపై ఇరువురూ చర్చించారు.
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఈ ఇద్దరు నేతలు తమ గత స్మృతులను నెమరేసుకున్నారు. ఆమె పెళ్లికి ఖచ్చితంగా వస్తానని సీఎం మోత్కుపల్లికి మాట ఇచ్చారు. అలాగే తన కోరికను మన్నించి యాదాద్రిభువనగిరి జిల్లాను ప్రకటించినందుకు కేసీఆర్‌కు మోత్కుపల్లి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు మల్లన్నసాగర్‌లో చేపట్టిన బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్‌లు పూర్తచేయాలని కోరినట్లు తెలిసింది. కాగా వీరి కలయికపై రాజకీయంగా చర్చ మొదలైంది. కాగా ఇదే విషయంపై మోత్కుపల్లిని ప్రశ్నించగా తాను తన కుమార్తె వివాహానికి లగ్నపత్రిక అందించడానికి వెళ్లానే తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.