
పెళ్లి కాలేదని మోసగించి..
తనకు పెళ్లి కాలేదని చెప్పుకున్న ఓ ప్రబుద్ధుడు ఓ అమాయకురాలిని నిలువునా వంచించాడు. కట్నకానుకల కోసం యువతిని పెళ్లాడి, ఆమె కుటుంబాన్ని మోసం చేశాడు. తీరా వివాహం అనంతరం కుటుంబంతో కలిసి శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఈక్రమంలో తన భర్తకు ఇంతకుముందే వివాహం అయ్యిందని, ఓ కుమారుడు కూడా ఉన్నాడని తెలిసి బాధితురాలు న్యాయం చేయాలని ధర్నాకు దిగింది.
ఆర్మూర్ టౌన్ : తనకు పెళ్లి కాలేదని మోసగించి రెండో పెళ్లి చేసుకుని చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీకి చెందిన కత్రాజి విజయ్‌కుమార్ ఇంటి ముందు నిత్యశ్రీ(మౌనిక) అనే వివాహిత శనివారం ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని, కట్నం కోసమే రెండో పెళ్లి చేసుకున్న భర్త విజయ్‌కుమార్, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ నిత్యశ్రీ(మౌనిక)కి ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీకి చెందిన కత్రాజి విజయ్‌కుమార్‌తో మే 21, 2014న పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 4 లక్షలు నగదు, ద్విచక్ర వాహనం, తులం బంగారంతోపాటు గృహావసర వస్తువులు ముట్టజెప్పారు.
మొదలైన వేధింపులు
పెళ్లి తర్వాత 15 రోజుల నుంచే భర్త, అత్త సు వర్ణ, మామ రాజేందర్, ఆడబిడ్డ శిరీష నిత్యశ్రీని శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించారు. వివాహమైన నెల రోజులకు విజయ్‌కుమార్‌కు అనిత అనే మరో అమ్మాయితో ముందే వివాహం జరిగిందని, ఒక కు మారుడు కూడా ఉన్నట్లు నిత్యశ్రీకి తెలిసింది. దీంతో ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్ప గా వారు విజయ్‌కుమార్ ఇంటికి వచ్చి ఆరా తీస్తే నిజం బయట పడింది. కాగా శనివారం నిత్యశ్రీ కుటుంబీకులు ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న విజ య్‌కుమార్, అతని తల్లి సువర్ణ, తండ్రి రాజేందర్, చెల్లెలు శిరీష ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే బైఠాయించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు, ఆమె కుటుంబీకులు కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిత్యశ్రీ మాట్లాడుతూ విజయ్‌కుమార్ మొదటి భార్య అనిత తనకు ఫోన్ చేసి విజయ్‌కుమార్ దుశ్చర్యల గురించి చెప్పినట్లు తెలిపింది. ఈ విషయమై రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. నలుగురిపై ఫిర్యాదు చేయగా విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారని, ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తమకు న్యాయం చేయాలని కట్నంగా ఇచ్చిన సొమ్ము, పెళ్లి ఖర్చులు ఇప్పించాలని నిత్యశ్రీ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో నిత్యశ్రీ తండ్రి రాములు, తల్లి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనసూయ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ నూర్జహాన్, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు దరోజి భారతి, సీపీఎం నాయకులు పల్లపు వెంకటేశ్, చక్రపాణి, గోవర్ధన్, గంగాధర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.