ఆ 60 వేల మందికి ఎంపీ ఎవరు?
ఏపీలో విలీనమైన మండలాలపై సీతారాం నాయక్ ఆవేదన
సాక్షి, న్యూఢిల్లీ: తన నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని, అయితే ఆ 60 వేల మంది ప్రజలకు ఇప్పుడు ఎంపీ ఎవరని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఇది ఆది వాసీల సమస్య. 7 మండలాల్లో 60 వేల మంది ఓటర్లయిన ఆదివాసీలను ఏపీలో కలిపారు. వీరంతా ఓట్లువేసి నన్ను ఎంపీగా గెలిపించారు.
ఇప్పుడు వీరికి ఎంపీ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? వారు సమస్యలపై ఎవరిని అడుగుతారు?. నేను పార్లమెంటుకు ఎన్నికైనప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను. ఇక్కడ ముంపు ప్రాంతంలో లేని 4 పంచాయతీలను కూడా విలీనం చేశారు. అందువల్ల ఆయా అంశాలపై కేంద్రం దృష్టిపెట్టి వారికి న్యాయం చేయాలి’ అని కోరారు.