సాక్షి, భువనగిరి : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కాకముందే మండల, జిల్లా పరిషత్ స్థానాలకు రిజర్వేన్లు ఖరారు కావడంతో నియోజకవర్గంలోనిమండలాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా ఖరారైన రిజర్వేషన్‌లపై చర్చ కొనసాగుతుంది. కాగా పలువురు ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండు నెలల పాటు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరగనుండడంతో పల్లెలో ఇప్పటినుంచే రాజకీయం వేడెక్కుతోంది.
పోటీకి సై అంటున్న ఆశావహులు..
మండలపరిషత్ స్థానాలకు సంబంధించిన రిజర్వేన్లు ఖరారుకావడంతో నియోజకవర్గంలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండ, భూదాన్ పోచంపల్లి మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలపై పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కొంత మందికి రిజర్వేషన్ కలిసిరావడంతో పోటీలో దిగేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థులు ఎంపీటీసీ ఎన్నికల్లోనైనా పోటీచేసి గెలుపొందాలని ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
నియోజకవర్గంలో ఇలా..
భువనగిరి నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో 4 జెడ్పీటీసీ, 4 ఎంపీపీ, 54 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వలిగొండలో 17, భువనగిరిలో 13, బీబీనగర్‌లో 14, భూధాన్‌పోచంపల్లిలో 10 ఎంపీటీసీ స్థానాల చొప్పున ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment