దేవరకద్ర(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు అరుణాచలం రాజు (50) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. మాటువేసిన దుండగులు అరుణాచలం రాజు ఇంటి నుంచి వాకింగ్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే స్థానిక ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయం సమీపంలో నడిరోడ్డుపై వేటకొడవళ్లతో వెంటాడి నరికి చంపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పాతకక్షలే ఈ ఘటనకు దారి తీశాయని పోలీసుల అనుమానం. రాజు తల, మెడ, చేతులపై పడిన గాయాలను బట్టి ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యగా దేవరకద్రలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు.
స్థానికంగా జరగాల్సిన పోచమ్మ బోనాల పండుగను గ్రామస్తులు వాయిదా వేసుకుని, స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అరుణాచలం రాజు మృత దేహంతో కాంగ్రెస్ నాయకులు రాయచూర్ అంతరాష్ట్ర రహదారిపై కాసేపు ధర్నా నిర్వహించారు. తక్షణమే నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ బాలకోటి తెలిపారు. దీనికి గాను ఒక ఎస్సై 10 మంది పోలీసులతో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. అరుణాచ లం రాజుకు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. దేవరకద్ర పంచాయతీ వార్డు సభ్యునిగా, సర్పంచిగా రాజు పనిచేశారు.