ఇంటిస్థలం.. వైఫై | Municipal Elections 2020 Congress Party Manifesto Released | Sakshi
Sakshi News home page

ఇంటిస్థలం.. వైఫై

Published Fri, Jan 17 2020 1:08 AM | Last Updated on Fri, Jan 17 2020 10:49 AM

Municipal Elections 2020 Congress Party Manifesto Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ కామన్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక సమస్యల ఆధారంగా లోకల్‌ మేనిఫెస్టోలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రజలకు కాంగ్రెస్‌ విజన్‌ తెలిపే విధంగా మాజీ ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి నేతృత్వంలో రూపొందించిన డాక్యుమెంట్‌ను గురువారం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో విడుదల చేశారు. మున్సిపాలిటీల్లో 500 గజాలలోపు నిర్మాణ వైశాల్యం ఉన్న ఇండ్లకు ఆస్తి పన్ను రద్దు చేస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికి 100 గజాల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అదే విధంగా అన్ని మున్సిపాలిటీల్లో రూ.5కే మధ్యాహ్నం, రాత్రి భోజన పథకం అమలు, రీడింగ్‌ రూంలతో లైబ్రరీల ఏర్పాటు, విశాల క్రీడామైదానాలు, యువతీ యువకుల కోసం జిమ్‌లు ఏర్పాటు చేస్తామని అందులో వెల్లడించారు. 

కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఇదే..

  • అవినీతి రహిత మున్సిపాలిటీలను అత్యుత్తమ ప్రజాసేవా కేంద్రాలుగా తీర్చిదిద్దడం
  • 500 చదరపు అడుగులలోపు నిర్మాణ వైశాల్యం ఉన్న ప్రతి ఇంటికి ఆస్తి పన్ను రద్దు
  •  మున్సిపాలిటీల్లో భవనాల క్రమబద్ధీకరణ పథకం అమలు, అదనపు గదుల క్రమబద్ధీకరణకు అవకాశం
  • తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఉచిత నల్లా, మంచినీటి సరఫరా 
  • ప్రతి మున్సిపాలిటీలో ఆధునిక సౌకర్యాలతో కూడిన అంతర్గత రోడ్లు, రోడ్డు డివైడర్లు, భూగర్భ డ్రైనేజీలు, ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు, ఇంకుడు గుంతల నిర్మాణం
  •  ప్రతి మున్సిపాలిటీలో పార్కులు, గ్రీన్‌బెల్టులు, చెరువుల సుందరీకరణ, బతుకమ్మ ఘాట్‌ల నిర్మాణం
  •  ఉద్యోగ ఉపాధి కల్పన కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాల ఏర్పాటు
  • స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో మధ్యాహ్నం, రాత్రి రూ.5కే భోజన పథకం అమలు 
  • కూరగాయల విక్రయ కేంద్రాలు, షాపింగ్‌ కాంప్లెక్సులు, స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాల ఏర్పాటు
  • మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, కుక్కలు, కోతులు, దోమల నియంత్రణకు ప్రత్యేక నిధుల కేటాయింపు
  •  ఆధునిక వసతితో కూడిన ఇండోర్‌ స్టేడియంతో పాటు అన్ని వసతులతో కూడిన విశాల క్రీడా మైదానాలు, జిమ్‌ల ఏర్పాటు
  • ప్రతి మున్సిపాలిటీలో ఇంటర్నెట్‌ సౌకర్యంతో రీడింగ్‌ రూంలున్న లైబ్రరీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లోని ముఖ్య కూడళ్లలో ఉచిత వైఫై సౌకర్యం
  •  శాంతిభద్రతల కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
  • అన్ని మతాల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కలిగిన స్మశాన వాటికలు, శవయాత్ర వాహనాల ఏర్పాటు
  • రజకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన దోభీఘాట్‌ల నిర్మాణం, నాయీ బ్రాహ్మణుల వృత్తి సౌకర్యం కోసం షాపులు, స్థలాలు, కుమ్మరుల కోసం స్థలాల కేటాయింపు
  • ప్రతి మున్సిపాలిటీలో వివాహాలు, సాంస్కృతిక వేడుకల నిర్వహణ కోసం ఆధునిక కన్వెన్షన్‌ సెంటర్లు
  • కబేళాల నిర్మాణం, ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డు, ఆధునిక వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు 
  • ఆదివాసీ మున్సిపాలిటీల్లో సంప్రదాయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు సాంప్రదాయ, సాంస్కృతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలు
  • జూనియర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి
  • 100 పడకల ఆసుపత్రి, 108, 104 సర్వీసుల విస్తరణ, వార్డుల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ఏర్పాటు, ప్రతి ఆసుపత్రిలో 2 అంబులెన్స్‌ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి
  • పేదలకు 100 గజాల ఇంటి స్థలం కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి రూ.6లక్షల ఆర్థిక సాయం కోసం ఒత్తిడి
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ ఆధారిత మున్సిపాలిటీల్లో కొనసాగించేలా ఒత్తిడి తెస్తాం. 

విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఉత్తమ్‌
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో తమను గెలిపిస్తే ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి కట్టుబడే విధంగా మేనిఫెస్టోను రూపొందించామని, ఈ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్‌ ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ నేతృత్వంలో జరిగిన 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో మున్సిపాలిటీలను, స్థానిక ప్రభుత్వాలను గుర్తించి ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు చెప్పారు. తాము గెలిచిన మున్సిపాలిటీలతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఈ మేనిఫెస్టోను తయారు చేశామని తెలిపారు. పల్లెలు, పట్టణాలు సమతుల్యతతో అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని, పట్టణాల్లోని అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కాంగ్రెస్‌ భావిస్తోందని అన్నారు. రాష్ట్రంలోని నగరాలను, మున్సిపాలిటీలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసుకుని రాష్ట్ర పురోగతికి దోహదపడే విధంగా కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందని శ్రావణ్‌ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement