నేటి స్వప్నం బంగారు తెలంగాణ | my aim is bangaru telangana, says kcr | Sakshi
Sakshi News home page

నేటి స్వప్నం బంగారు తెలంగాణ

Published Tue, Apr 28 2015 1:09 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

సోమవారం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన టీఆర్ఎస్ విజయగర్జన సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ - Sakshi

సోమవారం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన టీఆర్ఎస్ విజయగర్జన సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

*అన్ని వర్గాల క ళ్లలో వెలుగులు చూడాలి
 *టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్
*ప్రతి బిడ్డ ముఖం బంగారు నాణెంలా వెలగాలి
 *పల్లెపల్లెకూ తాగునీరు.. ఇంటింటికీ నల్లా
 *వచ్చే ఏడాది నుంచి సాగుకు 9 గంటల కరెంట్
 *రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
 *కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలో రెగ్యులర్ చేస్తాం
 *నాది వజ్ర సంకల్పం.. మాట తప్పను
 *ప్లీనరీ నిర్ణయాలనే హామీలుగా ప్రకటించిన సీఎం
 
  సాక్షి, హైదరాబాద్:‘ఇప్పుడు మాటలు కాదు.. చేతలు కావాలె.. బంగారు తెలంగాణ లక్ష్యం కావాలె. ఆనాటి స్వప్నం తెలంగాణ రాష్ట్రం.. నేటి స్వప్నం బంగారు తెలంగాణ. రాష్ట్రంలో నూటికి 80 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలే ఉన్నారు. వీరిలో చాలా మంది పేదోళ్లే. వారి కళ్లలో వెలుగు నిండిన నాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్లు. ఆ వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడే తెలంగాణ బాగుపడ్డట్టు. బంగారు తెలంగాణ అంటే పది తులాల బంగారం తెచ్చి పతకం చేసి చూపించొచ్చు. అది కాదు. తెలంగాణలో ప్రతి బిడ్డ ముఖం బంగారు నాణెంలా వెలగాలి. అదే నా లక్ష్యం.. నా స్వప్నం. నా వెంట ఉన్న టీమ్ లక్ష్యం కూడా అదొక్కటే’ అని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ‘విజయ గర్జన’ వేదికపై కేసీఆర్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పార్టీ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా టీఆర్‌ఎస్ ప్రస్థానం సాగుతోందన్నారు. ప్లీనరీలో చేసిన తీర్మానాలనే ఈ బహిరంగ సభలో సీఎం హామీలుగా ప్రకటించారు. భారీ భూకంపంతో అల్లాడుతున్న నేపాల్ ప్రజలకు ఈ సందర్భంగా రాష్ర్టం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
 మంచినీళ్లతో పాదాలు కడుగుతా
 
 రాష్ట్రంలో పల్లెపల్లెకు మంచినీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కేసీఆర్ ప్రతినబూనారు. ‘తెలంగాణలో ప్రతి తండా, గూడెం, బస్తీలో ఇంటింటికీ ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా పెట్టిస్తా. మంచి నీటితో మీ పాదాలు కడుగుతా. ఆనాడు తెలంగాణ తేకపోతే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన. ఈరోజు మంచి నీళ్లు తేకపోతే ఓట్లు అడగబోమని చెప్తున్నా.. మొండి పట్టుదలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులందరం కష్టపడుతం. మంచినీళ్లు తెచ్చి ప్రజల పాదాలకు అభిషేకం చేస్తాం’ అన్నారు.
 
 పగటిపూట 9 గంటల కరెంట్
 
 వచ్చే మార్చి తర్వాత రాష్ర్టంలో వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల కరెంటునిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘ఇక రైతులు చీకట్ల పొలంకాడికి పోవుడు లేదు. ఆటో స్టార్టర్లు అవసరం లేదు. పాములు, తేళ్లు కరిచి చచ్చిపోవుడ్లేదు. ఆరు నూరైనా సరే. తల తాకట్టు పెట్టైనా సరే. పొద్దుందాకా కరెంటిస్తాం. మార్చి తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా తొమ్మిది గంటల కరెంటు ఏకధాటిగా వస్తది. ఇది కేసీఆర్ మాట’ అని నొక్కి చెప్పారు. మిషన్ కాకతీయ పనులతో తెలంగాణ చెరువుల్లో జలకళ మళ్లీ ఉట్టిపడుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘ 60 ఏళ్ల సమైక్య పాలనలో గుండెల మీద పేరుకుపోయిన పాపాన్ని.. చెరువుల్లో పూడుకున్న మట్టిగా తొలగిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
 
 డబుల్ బెడ్రూం ఇళ్లు మొదలుపెడతాం
 
 ఈ ఏడాది నుంచే పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, అంతులేని అవినీతితో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైంది. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టిస్తాం. పేదలకు అప్పగిస్తాం’ అని పేర్కొన్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పునరుద్ఘాటించారు.  రెండేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ‘కొద్దిపాటి ఆలస్యానికి తప్పుదోవ పట్టవద్దు. జెన్‌కోలో 20 వేల నుంచి 25 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. కమలనాథన్ కమిటీ విభజన ఆలస్యమవుతోంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా మా తమ్ముళ్లందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘నాకున్న పెద్ద కల కేజీ టు పీజీ విద్య. కులం మతం లేకుండా ఒకే యూనిఫాం, ఒకే సిలబస్‌తో పిల్లలు చదువుకోవాలనేది నా కోరిక. దాన్ని వచ్చే ఏడాది ప్రారంభిస్తాం’ అని చెప్పారు.
 
 మనదే సంక్షేమ రాష్ట్రం
 
 ప్రజా సంక్షేమ రంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు చేస్తోందని, ఈ విషయంలో ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నామని రాజకీయ పక్షాలకు కేసీఆర్ సవాల్ విసిరారు. ‘పింఛన్లు, సన్న బియ్యం, అంగన్‌వాడీ జీతాలు, పౌష్టికాహారానికి ఏటా రూ.28 వేల కోట్లు ఖర్చు చేసే రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంక్షేమానికి చేస్తున్న ఖర్చు చూసి ఆ డబ్బంతా ఎక్కడిదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదేం దొంగతనం చేయట్లే. గతంలో ఆంధ్రకు పోయింది. ఇప్పుడు మన బడ్జెట్‌ను మనకే ఖర్చు చేస్తున్నాం’ అని అన్నారు.
 
 నాది వజ్ర సంకల్పం
 
 ‘నాకు గోల్‌మాల్ చేసుడు రాదు. వజ్ర సంకల్పంతో అడుగేస్తా.. బ్రహ్మాండంగా సాధించి తీరుతా. అదే నా లక్షణం.. నాకున్న వీర గుణం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పదిహేను ఇరవై రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ‘పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాలమూరు పంట పండాలె.. కల్వకుర్తి కొత్త రిజర్వాయర్ కట్టాలె. ఆంధ్ర పాలనలో దుర్నీతి మోసానికి ఎస్సెల్బీసీ పథకమే సాక్ష్యం. ఆ టన్నెల్ ఎన్నేళ్లకు పూర్తి కావాలి. కృష్ణా నది నుంచి పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల చొప్పున 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పూచి నాది. ఉత్తర తెలంగాణలో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి, దుబ్బాక, సిద్దిపేట, గ జ్వేల్, నర్సాపూర్, భువనగిరి, ఆలేర్, స్టేషన్ ఘనపూర్ దాకా ఉన్న ప్రాంతాల కరువు తీరాలి. ఎస్సారెస్పీతో నిజామాబాద్, ఆదిలాబాద్ పారాలె.. పెన్‌గంగా పారాలె.. నిజామాబాద్ లెండి కాల్వలు పూర్తి కావాలి. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ చాకులాగా పని చేస్తున్నడు. వీటన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని సీఎం అన్నారు.
 
 డల్లాస్‌లా హైదరాబాద్
 
 రాబోయే మూడేళ్లలో అమెరికాలోని డల్లాస్‌లా, సింగపూర్, జపాన్‌ను తలదన్నే రీతిలో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘హైదరాబాద్ నగరాన్ని హైటెక్ చేసినం అని మాట్లాడుతరు. ఇక్కడ ఘోరమైన పరిస్థితులున్నవి. తాగేం దుకు నీళ్లు లేవు. వానపడితే కార్లన్నీ బోట్లు కావాలి. సౌకర్యాలు లేవు. మార్కెట్లు లేవు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నయి. మన నగరం మన గుండె కాయ. ఇది విశ్వ నగరంగా రూపుదాల్చాలి. కేసీఆర్ మాట తప్పడు. మీరు నా వెంట నడవండి. జంట నగరాలను ఏ అంతర్జాతీయ నగరాలకు తీసిపోకుండా తయారు చేసి మీకు బహుమతిగా అందజేస్తా’ అని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ సాధించిన స్ఫూర్తి, ఆ గౌరవం నా జీవితానికి చాలు. తెచ్చిన తెలంగాణ గుంట నక్కల పాలు కావద్దు. బంగారు తెలంగాణ కావాలి. బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలి. రైతన్నలు సంతోషంగా ఉండాలి. యువకులకు ఉద్యోగాలు రావాలి. అందరి చిరునవ్వుతో ఉండే తెలంగాణ కావాలి. అప్పటివరకు విశ్రమించను. 24 గంటలు పని చేస్తా. మీ కల సాకారం చేస్తా’ అని కేసీఆర్ ప్రమాణం చేశారు.
 
 ఏపీలో అన్నీ మోసాలే.. చంద్రబాబు ఓ కిరికిరినాయుడు: కేసీఆర్
 
 ‘పక్క రాష్ట్రంలో అన్నీ మోసాలే. అబద్ధాలే. మీడియా మేనేజ్‌మెంట్ తప్ప ప్రజాసంక్షేమం లేదు’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ మండిపడ్డారు. ఘాటుగా తనదైన శైలిలో విమర్శించారు. ‘పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి.. మనకొక కిరికిరినాయుడున్నడు. ఇక్కడ ఛీ పో అన్నా ఇంక పోడట. ఆయనకు రాష్ట్రమున్నది. అక్కడ చాలా సమస్యలున్నయి. ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా. పొద్దునలేస్తే లేనిదో పుల్ల పెడుతడిక్కడ. అక్కడ ఆయనకు దిక్కులేదు. చెప్పిన వాగ్దానాలను అమలు చేసే తెలివి లేదుగనీ.. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణాలు మాఫీ చేస్త అన్నడు. సబ్బు పెట్టిండు.
 
  అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తమని రైతులకు చెప్పిండు. హేరాఫేరీ గోల్‌మాల్ చేసి సగం మందికి కూడా మాఫీ చేస్తలేడు. మేం ఒక్కటే మాట చెప్పి.. 34 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లు మాఫీ చేసినం. కానీ నేనేదో ఉద్ధరిస్తా అని.. ఆయన మహబూబ్‌నగర్‌కు వచ్చి కేసీఆర్ నిన్ను నిద్ర పోనియ్యా అంటున్నడు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజు చేయిస్తా అన్నడట. నీ రాష్ట్రంలో దిక్కులేదుగనీ.. ఈడకొచ్చి నిన్ను నిద్ర పోనియ్యా.. నన్ను నిద్రపోనియ్య.. అంటున్నడు. ఆంధ్రకు పోయి ప్రజలెంటవోయి సావుపో. గీడేమున్నది నీకు.. ఈ మధ్య మహబూబ్‌నగర్‌లో పాములాట దుకాణం పెట్టిండు. మన మీటింగ్ దగ్గర బఠానీలు అమ్ముకునేంత మంది కూడా రాలే అక్కడ. దానికే ఆహా.. ఓహో.. అంటున్నరు. మూడు నాలుగు పెంపుడు కుక్కలు పెట్టుకున్నడు. అవి ఇష్టమొచ్చినట్లు మొరుగుతనే ఉంటై. గాళ్లు మొరుగుతున్నరని నువ్వేం భయపడకు కేసీఆర్... గాడిదలుంటేనే కదా గుర్రాల విలువ తెలుస్తదని మనోళ్లు అంటనే ఉన్నరు’ అని బాబు పేరెత్తకుండానే కేసీఆర్ ఆయన్ని కడిగిపారేశారు.
 
 ఈ ఘనత తెలంగాణ ప్రజలదే..
 
 పద్నాలుగేళ్ల పార్టీ ప్రస్థానాన్ని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని కేసీఆర్ నెమరువేసుకున్నారు. సోమవారం నాటి టీఆర్‌ఎస్ భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ గతాన్ని గుర్తుచేసుకున్నారు. 14 ఏళ్ల కిందట జలదృశ్యంలో పిడికెడు మందితో మొదలై ఎన్నో అవమానాలను అధిగమించి ముందుకు కదిలామని, చివరకు దేశ రాజ్యాంగ వ్యవస్థను ఒప్పించి తెలంగాణను సాధించామని అన్నారు. ఉద్యమ తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ.. ‘గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ నినాదం మార్మోగింది.
 
 గ్రామగ్రామాన ప్రజలు పులిలా పంజా ఎత్తిండ్రు. విద్యార్థిలోకం బెబ్బులిలా ఉద్యమించింది. ఎక్కడివాళ్లక్కడే కథానాయకులైండ్రు. తెలంగాణ సమాజం బరిగీసి ఒక్కతాటిపై నిలబడింది’ అని అన్నారు. ‘ఉద్యమం వీడితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన.. ఇంటికొక యువకుడిని తోడుగా ఇవ్వండి రాష్ట్రం సాధించి తెస్తానని చెప్పిన. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కష్టాలు, బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయిలా వలసల తెలంగాణగా జీవితాలు మారి పోయాయి. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం మాక్కావాలి.. హక్కులు మాకు దక్కాలన్న నినాదంతో ఒక్కడినై నిలదీస్తే మీరంతా ఎల్లవేళలా ఆదుకున్నరు’ అని గుర్తు చేసుకున్నారు. ‘ఎన్నో విపత్కర పరిస్థితులు చూసిన. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ నిరాహార దీక్షకు దిగిన. చివరకు నేను కూడా చావు అంచు వరకు వెళ్లి.. మృత్యువును ముద్దాడే క్షణంలో కేంద్రం దిగివచ్చింది. కేసీఆర్ చావలే.. తెలంగాణ వచ్చింది. కొన్ని గుంటనక్కలు, ఒక వర్గం మీడియా కుట్ర చేసి కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశాయి. సకల జనుల సమ్మెలో సింగరేణి, ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఒక్కతాటిపై నిలిచాయి’ అని అన్నారు.
 
 ఆటా పాటా అదుర్స్..
 
 మధ్యాహ్నం 2 గంటల నుంచే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని ధూం..ధాం కళాకారులు పాటలు పాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ‘అయ్యోనివా..నువ్వు అవ్వోనివా.. తెలంగాణ తోటి పాలోనివా..’, ‘పల్లె మేలుకోవాలి..ప్రతి ఇల్లు మేలుకోవాలి..’ అనే పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సన్న బియ్యం, ఆసరా పింఛన్లు వంటి  ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాకారులు పాటలు పాడారు. బతుకమ్మ, బోనాల పండుగలను గుర్తుచేస్తూ పాడిన ఉయ్యాల పాటలకు మహిళలు, కార్యకర్తల నుంచి మంచి స్పందన కనిపించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement