సాక్షి, లింగాల:ప్రధానోపాధ్యాయుడి కృషి, గ్రామస్తుల సహకారంతో మూతపడే దశలో ఉన్న పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
విద్యార్థులు తక్కువగా ఉన్నారు. ఇక మూసివేస్తారని అనుకున్నారు. ఓ ఉపాధ్యాయుడి పట్టుదల, కృషితో పూర్వవైభవం తీసుకొచ్చారు. నేడు మండలంలోని ఆదర్శ పాఠశాలగా వెలుగొందుతుంది. అదే మండలంలోని మగ్ధూంపూర్ ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ విద్యాలయం పురస్కారాలు అందుకున్నారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.శంకర్.
నాడు 6.. నేడు 33 మంది
ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ప్రధానోపాధ్యాయుడిగా శంకర్, విద్యావలంటీర్‌గా లక్ష్మీప్రసన్న పని చేస్తున్నారు. 2015లో ఆయన పాఠశాలకు వచ్చిన సమయంలో కేవలం ఆరుగురు మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సమయంలో పాఠశాల మూత పడే అవకాశాలు ఉండేవి. దీంతో ఉపాధ్యాయుడు శంకర్ చేసిన కృషి ఫలించింది. ప్రతి రోజు పాఠశాల ప్రారంభానికి ముందుగా వచ్చి గ్రామంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తామని, మధ్యాహ్న భోజనం తదితర ప్రభుత్వ పథకాలను వివరించారు. గ్రామం పాఠశాల మూతపడితే తిరిగి పున:ప్రారంభం కావడం కష్టమని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆయన పట్టుదల, కృషిని శ్లాఘించిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు మాన్పించి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపడం మొదలు పెట్టారు. దీంతో ప్రశ్నార్థకంగా ఉన్న పాఠశాల పరిస్థితి నేడు ఉన్నతంగా మారింది. నేడు 33 మంది విద్యార్థులు ఉన్నారు.
రెండు స్వచ్ఛ పురస్కారాలు
పాఠశాల హెచ్‌ఎం శంకర్ శ్రద్ధతో గత సెప్టెబంరు 5న పాఠశాలకు రెండు స్వచ్ఛ పురస్కారాలు వచ్చాయి. జిల్లాకు మొత్తం మూడు పురస్కారాలు రాగా అందులో రెండు ఈ పాఠశాలకు రావడం గర్వంగా ఉందని హెచ్‌ఎం పేర్కొన్నారు.
సొంతంగా ఖర్చు
పాఠశాల నేడు పచ్చదనంతో విరాజిల్లుతుంది. ప్ర తి ఏటా పాఠశాలకు ప్రభుత్వం నుంచి వస్తున్న రూ .10 వేలు సౌకర్యాలకు ఏ మాత్రం సరిపోవడం లే దు. ఇప్పటివరకు హెచ్‌ఎం సొంతంగా రూ.40వేల వరకు ఖర్చు చేసి ప్రొజెక్టర్ ఏర్పాటు చేయించచారు. కలరింగ్‌తో పాటు విద్యార్థులను ఆకర్శించే విధంగా వివిధ జాతీయ నాయకుల చిత్రపటాలను వేయించారు. మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం తదితర పనులు చేయించారు.
సంపాదనలో కొంత పాఠశాలకు ఖర్చు
ప్రతి నెలా తనకు వస్తున్న వేతనంలో కొంత భాగం పాఠశాలకు ఖర్చు చేయాలని నిర్ణయించాను. గ్రామస్తులు సహకరించడంతో నేడు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పాఠశాలకు అదనపు గదులు, ఆటస్థలం కావాల్సి ఉంది. దీనికి కొంత మేరకు దాతల సహకారం కోరుతున్నాను. దాతలు సహకరిస్తే సౌకర్యాలు కల్పించి తనవంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తా. ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. – జక్కం శంకర్, హెచ్‌ఎం, పీఎస్ మగ్ధూంపూర్
Comments
Please login to add a commentAdd a comment