ఉత్కంఠ..
తిరుమలగిరి/అర్వపల్లి: సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో ఈనెల 31తేదీ అర్థరాత్రి ఇద్దరు పోలీసుల ప్రాణాలను బలిగొన్న దుండగులు శనివారం ఉదయం సినీఫక్కీలో జరిగిన పోలీసు ఛేజింగ్‌లో మోత్కూరు మండలం జానకీపురం సమీపంలో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. అందుకు సంబంధించిన వివరాలు సమయం వారీగా ఇలా ఉన్నాయి.
ఉదయం 5గంటలకు అర్వపల్లి శివారులోని నసీరుద్దీన్‌బాబా దర్గా నుంచి దుండగులు ఆయుధాలతో కాలినడక బయటకు వచ్చారు.
ఉదయం 5:15గంటలకు అర్వపల్లిలోని 10వ వార్డు మీదుగా సీతారాంపురం శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లారు.
5:20 గంటలకు వీరి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
5:30 గంటలకు తుంగతుర్తి సీఐ గంగారాం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లారు.
5:35గంటలకు పోలీసులకు, దుండగులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.
5:40గంటలకు పోలీసుల వద్ద ఉన్న సీఐ తుపాకీ మొరాయించడంతో కాల్పులు అగిపోయాయి.
5:50గంటలకు దుండగులు నడుచుకుంటూ అరకిలోమీటర్ దూరంలో ఉన్న అర్వపల్లి చౌరస్తాకు వెళ్లారు.
6:00గంటలకు దుండగులు అర్వపల్లిలో జాజిరెడ్డిగూడెం వాసి లింగమల్లును తుపాకీతో బెదిరించి బైక్‌తో తిరుమలగిరివైపు వెళ్లారు.
6:30గంటలకు ఫణిగిరి స్టేజీ నుంచి ఈటూరు మీదుగా అనంతారం వైపు వెళ్లారు.
6:50గంటలకు అనంతారం బస్టాండ్ వద్ద బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నారు.
6:55గంటలకు మోత్కూరు పోలీసులు తిరుమలగిరి వైపు వెళ్తుండగా దుండగులను చూసి వెనక్కి వచ్చారు.
7:05గంటలకు పోలీసులు వెంబడించడంతో మోత్కూరు మండలం చిర్రగూడురు మీదుగా జానకీపురం వైపు వెళ్లారు.
7:15గంటలకు మోత్కూరు కానిస్టేబుళ్లు, గ్రామ యువకులు వెంటపడగా బైక్‌పై బిక్కేరు వైపు వెళ్లారు.
7:30గంటలకు ఇసుకలో బైక్ ముందుకు వెళ్లకపోవడంతో అక్కడే వదిలేసి రోడ్డువైపునకు వెళ్లారు.
7:40గంటలకు రోడ్డుపక్కన ఉన్న మరోబైక్‌ను తీసుకొని జానకీపురం వైపునకు వెళ్లారు.
7:50గంటలకు జానకీపురం గ్రామ సమీపంలో ఆత్మకూర్ (ఎం) పోలీసు వాహనం ఎదురుగా రావడంతో బైక్‌దిగి పోలీసు వాహనంపై కాల్పులు జరిపారు.
7:55గంటలకు దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందగా ఆత్మకూర్ (ఎం) ఎస్‌ఐ సిద్ధయ్య తీవ్రంగా గాయపడ్డాడు.
7:55-8:00 గంటల మధ్య పోలీసుల కాల్పుల్లో దుండగులు అస్లాం అయ్యూబ్, జాకీర్‌లుగా భావిస్తున్న ఇద్దరు దుండగులు హతమయ్యారు.
8:15గంటలకు సంఘటనా స్థలానికి నల్లగొండ ఎస్పీ ప్రభాకర్‌రావు చేరుకున్నారు.
10:50 గంటలకు డీజీపీ అనురాగ్ శర్మ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
11:15గంటలకు విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది సూర్యాపేటలో కాల్పులు జరిపిన దుండగులేనని స్పష్టం చేశారు.
11:30గంటలకు డీజీపీ అనురాగ్‌శర్మ తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లారు.
1:30గంటలకు ఎదురు కాల్పుల్లో చనిపోయిన దుండగుల మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృత్యువుతో పోరాడుతూ భర్త.. ప్రసవ వేదనతో భార్య..
ఎల్‌బీనగర్ ‘కామినేని’లో చేరిన ఎస్‌ఐ డి. సిద్ధయ్య, ఆయన భార్య ధరణి
ఆత్మకూరు(ఎం): మృత్యువుతో భర్త పోరాడుతూ ఉండగా... ప్రసవ వేదనతో భార్య ఉంది.. ఇది ఎల్‌బీ నగర్ కామినేని హాస్పిటల్‌లో చోటు చేసుకున్న దయనీయ స్థితి. వివరాలలోకి వెళితే... ఆత్మకూరు(ఎం) మండలం ఎస్‌ఐ డి. సిద్ధయ్య మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఎస్‌ఐ సతీమణి ధరణి నిండు గర్భిణి. టీవీ చానళ్ల ద్వారా సంఘటన సమాచారం తెలుసుకున్న ఆమె తన భర్తను చూడటానికి ఎల్‌బీ నగర్ హాస్పిటల్‌కు హుటాహుటిన వచ్చింది. అదే రోజు ఆమె డెలివరీ డేట్ కావడంతో ప్రసూతి నొప్పులు రావడంతో అదే ఆస్పత్రిలో చేర్పించారు. మృత్యువుతో పోరాడుతున్న భర్త, ప్రసవ వేదనతో భార్య ఒకే హాస్పిటల్‌లో ఉండడం అక్కడ ఉన్న వారిని కలచి వేసింది. ఎస్‌ఐ భార్య ధరణి మగబిడ్డకు జన్మనిచ్చింది.