కొత్త పోలీస్ బాస్ ప్రకాశ్‌రెడ్డి | Nalgonda SP Vikramjit Duggal transfer | Sakshi
Sakshi News home page

కొత్త పోలీస్ బాస్ ప్రకాశ్‌రెడ్డి

Published Thu, May 19 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

కొత్త పోలీస్ బాస్ ప్రకాశ్‌రెడ్డి

కొత్త పోలీస్ బాస్ ప్రకాశ్‌రెడ్డి

 ఎస్పీ వీకే.దుగ్గల్ బదిలీ
 
 ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
 వివాదరహితుడిగా గుర్తింపు పొందిన విక్రమ్
 పోలీస్ శాఖలో పలు మార్పులకు శ్రీకారం
 సామాజిక సేవ.. జనమైత్రీతో ప్రజలకు చేరువ
 కిడ్నీ రాకెట్ ఛేదనతో అంతర్జాతీయ గుర్తింపు

 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న ఎన్.ప్రకాశ్‌రెడ్డి రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం  బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న దుగ్గల్.. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా వెళ్లనున్నారు. కొత్త ఎస్పీగా నీలగిరికి వస్తున్న ఐపీఎస్ అధికారి ప్రకాశ్‌రెడ్డి 2010 బ్యాచ్‌కు చెందిన వారు. ఐపీఎస్ హోదాలో ఆయన తొలి పోస్టింగ్ ఖమ్మం జిల్లా భద్రాచలం. అక్కడ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏఎస్పీగా వెళ్లారు. అక్కడి నుంచి నార్త్‌జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా బదిలీ అయ్యారు.
 
  ప్రస్తుతం నల్లగొండ జిల్లా ఎస్పీగా రానున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్ పూర్తి చేసిన ప్రకాశ్‌రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా మంథని. ఆయన బిట్స్ పిలానీలో ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. విద్యాధికుడైన ప్రకాశ్‌రెడ్డి సమర్థవంతమైన పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. పోలీస్ ఉద్యోగానికి రాకముందు సన్‌మైక్రో సిస్టమ్స్‌లో పనిచేశారు. నార్వే దేశంలో ఈ గవర్నెన్స్ పైలట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలుగు సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడే ప్రకాశ్‌రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలపై ఓ ప్రాజెక్ట్‌ను తయారు చేశారు. సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో తన తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదన్న ఆలోచనతో ఆయన సన్ మైక్రోసిస్టమ్స్‌లో ఉద్యోగం చే సినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
 
 బిట్స్ పిలానీలో ఉన్నప్పుడే...
 ఇంజనీరింగ్ విద్యార్థి అయిన ప్రకాశ్‌రెడ్డి బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ చదువుతుండగా సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వార్తాపత్రికల్లో వచ్చే పలు అంశాలను గమనించిన ఆయన ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిగానే సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే... ప్రభుత్వ వైద్యుడైన తన తండ్రి డాక్టర్ ఎన్. లక్ష్మారెడ్డిని స్ఫూర్తిగా తీసుకున్నారు. నిస్వార్థంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలందించిన లక్ష్మారెడ్డి అంటే ప్రజలు ఎంతో ఇష్టపడేవారట. ఆయన స్ఫూర్తితోనే ప్రజల అధికారిగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. తన ప్రతిభను విదేశాల్లో ఉపయోగించడం కన్నా దేశానికి ఉపయోగపడేలా ఉండాలన్న ఆలోచన సివిల్ సర్వీసు వైపునకు మళ్లించిందని ప్రకాశ్‌రెడ్డి వివరించారు. ఎస్పీగా నియమితులైన సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి ఁసాక్షి*తో మాట్లాడుతూ ఇది తనకు లభించిన మంచి అవకాశంగా భావిస్తానని, త్వరలోనే బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు.
 
 వివాదరహితుడుగా వెళ్లిపోతున్న దుగ్గల్
 తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశం దృష్టిని ఆకర్షించిన ఉగ్రవాదుల దాడి ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్‌జీత్ దుగ్గల్ వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో గత ఏడాది ఏప్రిల్ ఒకటి అర్ధరాత్రి జరిగిన ఉగ్రవాద దాడి సందర్భంగా ఏప్రిల్ 2న జిల్లా ఎస్పీగా ఉన్న ప్రభాకర్‌రావును ప్రభుత్వం బదిలీ  చేసింది. ఆయన స్థానంలో దుగ్గల్‌ను నియమించింది. గత ఏడాది మే ఆరో తేదీన జిల్లా పోలీస్  బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన దుగ్గల్ ఏడాది కాలంలోనే పోలీసు శాఖలో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా జనమైత్రి పేరుతో పోలీసు శాఖను ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేశారు. జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన పోలీసు శాఖను మిళితం చేశారు.
 
 ముఖ్యంగా నల్లగొండ రూరల్ మండలంలోని గుండ్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. హరితహారం,  స్వచ్ఛభారత్‌లో పోలీసు శాఖ పాలుపంచుకునేలా చేశారు. జిల్లాలోని అన్ని దేవాలయాలు, మసీదు, చర్చిల్లో పరిశుభ్రత కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రధానంగా దుగ్గల్ హయాంలో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం తీగ లాగిన ఎస్పీ దుగ్గల్ టీం ఈ కేసులో మంచి పురోగతిని సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అదేవిధంగా నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలోనే శిక్షణ ఇప్పించారు ఎస్పీ దుగ్గల్. ఈ విధంగా పలు సామాజిక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మంచిపేరు తెచ్చుకున్న దుగ్గల్ తక్కువ కాలంలోనే (13 నెలల్లో) జిల్లా నుంచి బదిలీ కావడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement