
అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసు..
- నలుగురికి పదేళ్ల జైలు
- తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం రేపిన ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో హసన్, అబ్దుల్లా, వాహిద్, వహ్లాన్‌లను దోషులుగా తేల్చింది. వీరికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రధాన నిందితుడైన మహ్మద్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ మహ్మద్ పహిల్వాన్‌తో పాటు మరో 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
నిర్ధోషులుగా ప్రకటించిన వారిలో హుస్సేన్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ హసన్, అబ్దుల్లా బిన్ యూనుస్ యాఫై, అవద్ బిన్ యూనుస్ యాఫై, యూనుస్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ యూనుస్ యాఫై, ఈసా బిన్ యూనుస్ యాఫై, మహ్మద్ బహదూర్ అలీఖాన్ అలియాస్ మునవర్ ఇక్బాల్, సైఫ్ బిన్ హుస్సేన్ యాఫై, మహ్మద్ అమెరుద్దీన్ అలియాస్ ఆమోర్‌లు ఉన్నారు. దోషులకు విధించిన పదేళ్ల జైలుశిక్షలో వారు అనుభవించిన ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు మినహాయించింది.
కోర్టు పరిసరాల్లో గట్టి బందోబస్తు..
2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని కేశవగిరిలోని బార్కాస్–బాలాపూర్ రోడ్డులో అక్బరుద్దీన్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అక్బరుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. అక్బరుద్దీన్ గన్‌మన్‌లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇబ్రహీం బిన్ యూనుస్ యాఫై హతమయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ బిన్ ఒమర్ యాపై అలియాస్ మహ్మద్ పహిల్వాన్ చేర్చడంతో పాటు మొత్తం 14 మందిపై అభియోగాల్ని నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ ప్రారంభించిన నాంపల్లి కోర్టు 86 మంది సాక్షుల్ని విచారించింది.
గత నెలలో వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును వాయిదా వేసింది. గురువారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో పలువురు నిందితులు చాలా కాలంగా జైలులోనే ఉన్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ పహిల్వాన్ బెయిల్‌పై విడుదలయ్యాక వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో కోర్టు ఆయనకు 2012 ఏప్రిల్ 25న బెయిల్ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది మే 2న పహిల్వాన్ లొంగిపోయారు. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లోనే ఉంటున్నారు. నిందితుల్లో మరో ఆరుగురు బెయిల్‌పై ఉండగా ఎనిమిది మంది చర్లపల్లి జైల్లో ఉన్నారు.
పహిల్వాన్ విడుదల..
కాగా, కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన వారిలో పహిల్వాన్‌తో పాటు మరో నలుగురు గురువారం రాత్రి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో పహిల్వాన్ మాట్లాడుతూ... చేయని నేరానికి శిక్ష అనుభవించానని, 2019 కల్లా తానేంటో నిరూపించుకొంటానని చెప్పారు. ఆరు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులకు దూరం చేసి మానసికంగా హింసించిన వారి సంగతి దేవుడే చూచుకొంటారన్నారు.