పట్టాభి రాముడు
భద్రాచలంలో కనులపండువగా పట్టాభిషేకం
సాక్షి, ప్రతినిధి ఖమ్మం: భద్రాద్రిలో కోదండ రామయ్య మహా పట్టాభిషేకం కనులపండువగా జరిగింది. శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. గవర్నర్ నరసింహన్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా రామాలయంలోని యాగశాలలో ఉదయం చతుస్థానార్చన హోమం నిర్వహించారు. పూజల అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరిప్రదక్షిణగా మిథిలా స్టేడియానికి తీసుకెళ్లారు. వేడుకలో భాగంగా స్వామివారికి ముందుగా ఆరాధన జరిపారు. విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేన పూజ నిర్వహించారు.
పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యహవచనం గావించారు. కలశాలలోని చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థ జలాలతో ప్రాంగణాన్ని ప్రోక్షణ చేసి, అభిషేకానికి వీలుగా కలశ స్థాపన చేశారు. రామదాసు కాలం నాటి బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి కిరీట ధారణ చేశారు. అనంతరం ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యకు పట్టాభిషేకం చేశారు. ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి భద్రాచలంలో జరిగే మహాపట్టాభిషేకం విశిష్టతను భక్తులకు వివరించారు. శ్రీరాముడు లోక కల్యాణం కోసం చేసిన త్యాగాన్ని వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలన్నారు. పట్టాభిషేకం అనంతరం పుణ్య జలాలను భక్తులపై చల్లారు.
తగ్గిన భక్తుల సంఖ్య
పట్టాభిషేక మహోత్సవానికి భక్తుల సంఖ్య బాగా తగ్గింది. సుమారుగా 3 వేల మంది భక్తులు హాజరై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కల్యాణం మరుసటి రోజున స్వామివారికి నిర్వహించే పట్టాభిషేకంపై తగిన రీతిలో ప్రచారం చేయకపోవటంతో కల్యాణానికి వచ్చిన భక్తులంతా అదే రోజున వెళ్లిపోయారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. భక్తులు లేక మిథిలా స్టేడియంలోని సెక్టార్‌లన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి.
గవర్నర్ ప్రత్యేక పూజలు
పట్టాభిషేక ఉత్సవానికి గవర్నర్ నరసింహన్ ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రామాలయంతోపాటు లక్ష్మీతాయారు అమ్మవారు, భద్ర మహర్షి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, సతీష్‌బాబు, టీఆర్‌ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు సత్యనారాయణరెడ్డి, జగన్‌మోహన్ , ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.