నా పేరు నరసింహన్‌ | Narasimhan Emotional Speech At Farewell Ceremony | Sakshi
Sakshi News home page

నా పేరు నరసింహన్‌

Published Sun, Sep 8 2019 2:19 AM | Last Updated on Sun, Sep 8 2019 10:46 AM

Narasimhan Emotional Speech At Farewell Ceremony - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘నా పేరు నరసింహన్‌. పేరుకు తగ్గట్టు పనిచేయాలి. లేకుంటే సార్థక నామధేయుడు అనరు. అందుకే అప్పుడప్పుడు నరసింహావతారం ఎత్తాల్సి వచ్చింది’’ అని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చమత్కరించారు. గవర్నర్‌గా తొమ్మిదిన్నరేళ్లపాటు సేవలందించిన ఆయనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రగతి భవన్‌లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్‌ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘‘కేసీఆర్‌ తెచ్చిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు, కేసీఆర్‌ కిట్స్‌ లాంటి పథకాల్లో మానవత్వం ఉంది.

నీటిపారుదలశాఖ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ లాంటి పథకాల్లో కేసీఆర్‌ విజన్‌ కనిపించింది. తెలంగాణలో శాంతిభద్రతల పర్యవేక్షణ చాలా గొప్పగా ఉంది. ప్రతి స్కీం గురించి నాకు చెప్పేవారు. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలను వివరించేవారు. డబ్బుందా అని అడిగితే, తెలంగాణ రాష్ట్రానికి ఢోకా లేదని, ధనిక రాష్ట్రమని ధైర్యంగా ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు దేశవ్యాప్తంగా చర్చ అయ్యేవి. ముఖ్యమంత్రి స్వయంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేసి స్క్రీన్‌పై పథకాల గురించి వివరించిన వైనాన్ని నేను ప్రధానికి కూడా చెప్పాను.

కేసీఆర్‌కు ప్రజల నాడి తెలుసు. వారి కష్టాలు తెలుసు. అందుకే మంచి పథకాలు తేగలిగారు. ఆయనతో కలసి పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నా. ఇద్దరం గంటల తరబడి చర్చలు చేసేవాళ్లం. మా మధ్య వాడీవేడి చర్చలు జరిగేవి. కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది. నేను ఎక్కడున్నా సరే... తెలంగాణ ఫలానా రంగంలో నంబర్‌ వన్‌గా నిలిచింది, ఫలానా విషయంలో టాప్‌గా ఉంది అనే వార్తలు చదివి సంతోషిస్తా. తెలంగాణ మొదటి గవర్నర్‌గా నా పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. దీన్నెవరూ మార్చలేరు’’అని నరసింహన్‌ పేర్కొన్నారు.
 

తమ్ముడిలా ఆదరించారు: కేసీఆర్‌ 
తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన గవర్నర్‌ నరసింహన్‌ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓ పెద్దదిక్కులాగా, రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గవర్నర్‌ పదవీ విరమణ చేసి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పి, స్ఫూర్తి నింపిన నరసింహన్‌తో తనకు గొప్ప జ్ఞాపకాలున్నాయన్నారు. ప్రసంగం మధ్యలో చాలాసార్లు కేసీఆర్‌ ఉద్వేగానికి గురయ్యారు.

‘‘తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన నరసింహన్‌ గవర్నర్‌గా వచ్చారు. ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం నాడు కొందరిలో ఉండేది. అదే సమయంలో నేనే ఆయన్ను కలిశాను. ఉద్యమ నేపథ్యాన్ని, ఇన్నేళ్లుగా ఉద్యమం సజీవంగా ఉండటానికి గల కారణాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం ఉండటంతో నరసింహన్‌... ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్‌ గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తొలినాళ్లలోనే ఆయనపై విశ్వాసం వ్యక్తం చేశా.

ఆయనతో ఎంతో అనుబం ధం ఉంది. నన్ను సీఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారు. ప్రభుత్వ పథకాల మంచిచెడులను చర్చించేవారు. బాధపడినా, ఇబ్బంది అనిపించినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారు. ప్రతి పనీ విజయవంతం కావాలని తపన పడేవారు. ప్రభుత్వం చేసే మంచి పనులను కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వివరించేవారు. తెలంగాణ, ఏపీ మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపారు’’అని సీఎం పేర్కొన్నారు. 

ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా విందు భోజనం... 
వీడ్కోలు సభ అనంతరం గవర్నర్‌ దంపతుల గౌరవార్థం సీఎం కేసీఆర్‌ విందు ఇచ్చారు. గవర్నర్‌ గౌరవార్థం పూర్తి శాకాహార భోజనం, అదీ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా పెడుతున్నాం అని అంతకుముందు సభలోనే సీఎం ప్రకటించారు. విందు తర్వాత గవర్నర్‌ దంపతులను కారు దాకా వెళ్లి కేసీఆర్‌ దంప తులు సాగనంపారు. ఆ తర్వాత గవర్నర్‌ దంపతులకు సీఎం కేసీఆర్, స్పీకర్‌ పోచారం, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు బేగం పేట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్‌అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ గవర్నర్‌ దంపతులను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తోడ్కొని వెళ్లారు. అంతకు ముందు నరసింహన్‌ పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు. 

కల్వకుంట్ల... కలవకుంట గవర్నర్‌ చమత్కారం 
‘‘చాలా మంది కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురించి మాట్లాడతారు. వారంతా కలవకుంట మాట్లాడతారు. నేను కలసి మాట్లాడుతున్నాను’’అని నరసింహన్‌ చమత్కరించారు. ‘‘పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం, నమ్మకం నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్‌లో నాకు కనిపించాయి. నమస్కారం చెబితే పెద్దవాళ్లు చిన్నవాళ్లకు నమస్కారం పెట్టకూడదు అనేవారు. మా అమ్మ చనిపోయినప్పుడు కేసీఆర్‌ నా దగ్గరకు వచ్చి అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు. అస్థికలు కలపడానికి హెలికాప్టర్‌లో పంపారు. ఇక్కడకు వచ్చిన కొత్తలో అన్ని విధాలా సహకరిస్తామని కేసీఆర్‌ మాటిచ్చారు. అన్న విధంగా మాట నిలబెట్టుకున్నారు. ’’అని గవర్నర్‌ చెప్పారు. 

యాదాద్రికి నరసింహన్‌ మళ్లీ రావాలి... 
‘‘యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్‌ దంపతులు ఎంతో నిష్టతో మడికట్టుకుని అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను తల్లిదండ్రులను కోల్పోయాను. పెద్దన్న లేడు. పెద్దల ఆశీర్వాదం తీసుకొని మంచి పనికి శ్రీకారం చుట్టాలని భావించాను. నాకు గవర్నర్‌ దంపతులే పెద్దదిక్కుగా కనిపించారు. సోదరభావంతో వారికి పాదాభివందనం చేసి పని ప్రారంభించాను. అది విజయవంతంగా కొనసాగుతున్నది. నరసింహన్‌ గారు యాదాద్రి పనులు పూర్తయ్యాక మళ్లీ రావాలి. పూజలో పాల్గొనాలి. నరసింహన్‌ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండి పోతాయి’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నరసింహన్‌కు ఇచ్చినట్లే కొత్త గవర్నర్‌కూ అదే గౌరవం ఇస్తామని, రాజ్‌ భవన్‌ ప్రాశస్త్యాన్ని కాపాడుతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement