మద్యంపై నారీ భేరీ
నర్సింగాపూర్‌లో సంపూర్ణ మద్య నిషేధం కోసం మహిళల ప్రతిన
చందుర్తి: మండలంలోని నర్సింగాపూర్ స్వశక్తి మహిళలందరు ఏకమయ్యారు. మద్యం మహమ్మారిని గ్రామం నుంచి తరిమివేస్తామని ప్రతి నబూనారు. ఇక్కడ మద్యం, సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. యువకులతో పాటు చాలా మంది తాగుడుకు బానిసలవుతున్నారు. దీంతో పచ్చని కాపురాల్లో చిచ్చురగులుతోంది. ఇటీవల కాలంలో వివాదాస్పద సంఘటనలు ఎక్కువయ్యాయి.
వీటన్నింటికి మద్యం, సారాలే కారణమని గుర్తించిన మహిళలు.. వాటిని నిషేధించడమే మార్గమని తలచారు. సోమవారం గ్రామంలోని 39 స్వశక్తి సంఘాల మహిళలందరు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. గ్రామ పెద్దలను, పంచాయతీ పాలకవర్గాన్ని అక్కడికే పిలిచారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని తీర్మానించారు.
వెంటనే బెల్టుషాపుల నిర్వాహకులు, గుడుంబా అమ్మకందారులను పిలిచి వెంటనే దుకాణాలు ఎత్తివేయాలని హెచ్చరించారు. అనంతరం తమ సంకల్పానికి సహకరించాలని కోరుతూ ఎక్సైజ్, పోలీసు అధికారులకు వినతిపత్రాలిచ్చారు. సర్పంచ్ చింతపంటి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు బండి అమృతరాములు, ఉపసర్పంచ్ ఇ.గణేశ్, చందుర్తి సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు రామస్వామి పాల్గొన్నారు.