సాక్షి, హైదరాబాద్: నీట్ పీజీ–2020 ఫలితాలను నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) శుక్రవారం విడుదల చేసింది. పరీక్ష రాసిన వారిలో 55% మంది ఉత్తీర్ణులయ్యారు. దేశవ్యాప్తంగా 1,67,102 మంది నీట్ పీజీ రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,60,888 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 89,549 మంది ఉత్తీర్ణులైనట్లు ఎన్‌బీఈ ప్రకటించింది. రాష్ట్రం నుంచి దాదాపు 10 వేల మంది వరకు పరీక్ష రాసి ఉంటారని కాళోజీ హెల్త్ వర్సిటీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఎంతమంది ఉత్తీర్ణులయ్యారన్న విషయం తమకు ఇంకా సమాచారం రాలేదని వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఈ నెల 3వ తేదీ నాటికి ప్రతీ విద్యార్థి స్కోర్ కార్డును ఎన్‌బీఈ అప్‌లోడ్ చేస్తుంది. ఈ నెలలోనే ఆలిండియా స్థాయిలో పీజీ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే, రాష్ట్రంలో మార్చి 15 నుంచి మొదలవుతుందని వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 1,200 మార్కులకు నీట్ పీజీ పరీక్ష నిర్వహించారు. అందులో జనరల్ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్–ఆఫ్ 366, జనరల్ పీహెచ్ అభ్యర్థులకు 342, ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ 319గా నిర్ధారించారు.
అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,624 వరకు పీజీ వైద్య విద్య సీట్లున్నాయి. ఒక్క ప్రభుత్వ వైద్య విద్య కాలేజీల్లోనే 760 సీట్ల వరకు ఉన్నాయి. ఇటీవలే నిజామాబాద్ మెడికల్ కాలేజీకి 54 పీజీ సీట్లు వచ్చాయి. వాటిలో కూడా ఈ సంవత్సరం నుంచే ప్రవేశాలుంటాయని అధికారులు చెప్పారు. కాగా, గత జనవరి 5వ తేదీన జరిగిన ఈ నీట్ పీజీ పరీక్షలో తమిళనాడు నుంచి ఎక్కువ మంది అర్హత సాధించారు. అయితే పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న తప్పు అని తేలడంతో అభ్యర్థులందరికీ ఆ ప్రశ్నకు పూర్తి మార్కులు లభించాయి. ఆ ప్రశ్నకు సమాధానం రాసినా, రాయకపోయినా అభ్యర్థులందరికీ పూర్తి మార్కులు ఇచ్చినట్లు ఎన్‌బీఈ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment