సాక్షి, ఖమ్మం: డబ్బులు పెట్టి వస్తువు కొనుగోలు చేసినప్పుడు వ్యాపారులు నాణ్యత లేనివి అంటగడితే..మోసం చేస్తే..ఆర్థికంగా నష్ట పరిస్తే..వినియోగదారుల పక్షాన వినియోగదారుల రక్షణ చట్టం అండగా నిలుస్తుంది. నిగ్గదీసి అడిగేలా..లబ్ధి చేకూర్చేలా చేస్తుంది. వస్తువులను కొనేవారు, వినియోగించేవారు, కిరాయివారు, వస్తువుల వల్ల లబ్ధి పొందే వారంతా వినియోగదారులే. ఈ చట్టం అన్ని రకాల వస్తువులు, సేవలకు వర్తిస్తుంది. హక్కులను పూర్తిస్థాయిలో పొందేందుకు, నష్ట పరిహారం తీసుకునేందుకు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు. వ్యాపారులు..వస్తువులు, సేవల గురించి సక్రమమైన సమాచారాన్ని అందించకున్నా, నాణ్యతలేని వస్తువులను ఇచ్చినా, కొత్త వస్తువు కోసం, నష్ట పరిహారం కోసం ఫోరంను ఆశ్రయించవచ్చు. చౌకబారు, నాణ్యతలేని వస్తువులను ఉత్పత్తి చేయకుండా, దొంగ వ్యాపారాన్ని అరికట్టేందుకు, డూప్లికేట్ సరుకు రాకుండా, అధిక ధరల అమ్మకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. బాధితులు జిల్లా వినియోగదారుల ఫోరంలో రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. వస్తువు ధరను బట్టి రూ.20లక్షల నష్టపరిహారం వరకు జిల్లా వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో..అంతకుమించి అయితే..రాష్ట్ర ఫోరం పరిధిలోకి వస్తుంది.
ఫిర్యాదులు ఎప్పుడు చేయాలంటే?
⇔ కొన్న వస్తువులు పాడైనప్పుడు
⇔ డూప్లికేట్‌ది అంటగట్టినప్పుడు
⇔ ఆశించిన రీతిలో వస్తువు లేనప్పుడు
⇔ కొన్ని విభాగాల్లో లోపాలున్నప్పుడు
⇔ అధిక ధర వసూలు చేసినప్పుడు
⇔ సదరు వ్యాపారి సరిగ్గా స్పందించనప్పుడు
⇔ ఫోరం తేల్చి..వినియోగదారుడికి న్యాయం జరిగేలా చూస్తుంది
⇔ లేదంటే జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తుంది
హక్కులకు భద్రత..
చట్ట సవరణ బిల్లు ద్వారా..హక్కులకు అధిక భద్రత లభించనుంది. తగిన రశీదులతో సంప్రదిస్తే కచ్చితంగా నష్ట పరిహారం పొందవచ్చు. వివరాలు స్పష్టంగా ఉండాలి.
– పి.మాధవ్‌రాజా, వినియోగదారుల ఫోరం, జిల్లా చైర్మన్
రశీదులు పొందాలి..
ఎరువులు, పురుగుమందులు అమ్మే వ్యాపారుల నుంచి రైతులు రశీదులు కొనాలి. ఫోరంను ఆశ్రయించడానికి రశీదులు తప్పనిసరి. న్యాయసేవాసంస్థ ద్వారా చైతన్యం కల్పిస్తూనే ఉన్నాం.
– వినోద్‌కుమార్, న్యాయసేవాసంస్థ కార్యదర్శి
మోసపోవద్దనే చట్టం..
వ్యాపారస్తుల చేతిలో వినియోగదారుడు మోస పోవద్దనే..రక్షణ చట్టాన్ని రూపొందించారు. మోసాలను వేలెత్తి చూపి..అడగగలగాలి. ఫోరంను ఆశ్రయించాలి.
– రేణిగుంట ఉపేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్
Comments
Please login to add a commentAdd a comment