తొలితరం నక్సలైట్ నేత నాగన్న మృతి | naxalite naaganna dies in karimnagar district | Sakshi
Sakshi News home page

తొలితరం నక్సలైట్ నేత నాగన్న మృతి

Published Tue, May 31 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

naxalite naaganna dies in karimnagar district

-విప్లవ బీజాలు నాటిన ఉప్పల మోహన్‌రెడ్డి
మిరుదొడ్డి(మెదక్ జిల్లా):
మెతుకుసీమలో తొలిసారిగా విప్లవ బీజాలు నాటిన తొలితరం నక్సలైట్ నేత నాగన్న అలియాస్ ఉప్పల మోహన్‌రెడ్డి (56) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెల్లిలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1984 మధ్య కాలంలో దళ కమాండర్‌గా మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో నాగన్న నక్సలైట్ల ఉద్యమానికి బీజాలు వేశారు. నిరుపేదలను పీల్చి పిప్పిచేసే దొరల ఆగడాలను అరికట్టి పట్టణాలకు తరిమి కొట్టడంలో నాగన్న కీలక పాత్ర పోషించారు. ఉద్యమకాలంలో ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నాగన్నతో అప్పుడే సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పట్లోనే సోలిపేట రామలింగారెడ్డి నక్సలైట్ల ఉద్యమానికి ఆకర్శితులు కావడానికి కారణంగా చెప్పవచ్చు.

తన దళంలో పనిచేస్తున్న చిట్టాపూర్‌కు చెందిన వెంకటలక్ష్మి అనే దళిత మహిళను నాగన్న కులాంతర వివాహం చేసుకున్నారు. నక్సలైట్ ఉద్యమంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో నాగన్న దంపతులు 1989లో అప్పటి జిల్లా ఎస్పీ సురేందర్ ఎదుట లొంగిపోయారు. పోలీసులకు లొంగిపోయే ముందు తన స్వలాభం కోసం ఆకాంక్షించకుండా నక్సలైట్ కార్యకలాపాలకు సంబంధించిన డబ్బు, తుపాకులు పార్టీకే అప్పగించారు. దీంతో నాగన్న నిజాయితీకి జిల్లా ప్రజలు హర్షించారు. లొంగిపోయిన నాగన్నకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన సొంత గ్రామమైన కొత్తపెల్లిలో పునరావాసం కల్పించింది. అనంతరకాలంలో ఆర్థికంగా చితికిపోయిన నాగన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం ఆయన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. నాగన్న మృతితో ఆయన శ్రేయోభిలాషులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement