- న్యూడెమోక్రసీ అజ్ఞాత దళం చర్యపై సాధువు ఆవేదన
బయ్యారం: నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాలో పయనిస్తున్న కామ్రేడ్లు గిరిజన సాధువుపై కన్నెర్ర చేశారు. సాధువు మూలంగా తమ పార్టీ వైపు ప్రజలు వచ్చేందుకు భయపడుతున్నారనే ఆగ్రహంతో ఏకంగా 30 సంవత్సరాల పాటు పెంచుకున్న సాధువు జుట్టును కత్తిరించి గుండు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చెందిన బాధితుడు గుగులోత్ సోమ్లా తెలిపిన వివరాలు ప్రకారం... సోమ్లా తన వంశపారపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం సాధువుగా మారి జుట్టును పెంచుకుంటూ ఇంటి వద్ద నిర్మించిన గుడిలో సేవాలాల్ మహరాజ్, వెంకటేశ్వరస్వామిలకు పూజలు నిర్వహిస్తుంటాడు. న్యూడెమోక్రసీలో చీలికరాక ముందు సోమ్లా ఆ పార్టీ సానుభూతిపరునిగా కొనసాగాడు. పార్టీలో చీలిక అనంతరం రాయలవర్గంలో కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలో శనివారం ఉదయం చంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత నాయకుడు అశోకన్న పిలుస్తున్నారని ఓ వ్యక్తి వచ్చి సోమ్లాను గ్రామ సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఆ పార్టీ బయ్యారం ఏరియా దళ కమాండర్ కుమార్ సోమ్లాను రాయల వర్గానికి ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నావా అని ప్రశ్నించగా తాను ఆర్గనైజర్‌ను కాదని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాని తెలిపాడు. ఆ తరువాత జుట్టు ఎందుకు పెంచుకుంటున్నావని నీ జుట్టుకు భయపడి మా పార్టీలోకి ఎవరూ రావటం లేదని ఆగ్రహంతో సోమ్లా చేతులను వెనుకకు విరిచి కట్టివేశాడు. ఆ తరువాత జుట్టు, గడ్డంను బ్లేడుతో గీశారని సోమ్లా చెప్పాడు. సంవత్సరాల తరబడి దేవునిపై నమ్మకంతో పెంచుకున్న జుట్టు వెంట్రుకలను తనకు ఇస్తే దేవునికి సమర్పిస్తానని బతిమిలాడినప్పటికీ కనికరించలేదని సోమ్లా కన్నీటి పర్యంతమయ్యాడు.